ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి విలవిలలాడుతున్న పేద ప్రజలపై మరో పిడుగుపడింది. పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించగా, వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులపై ఏటా ఏకంగా రూ 57.60 కోట్ల అదనపు భారం పడనున్నది.
– హనుమకొండ, మార్చి 8
పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్రప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచింది. ఈ ప్రభావం వరంగల్ ఉమ్మడి జిల్లాలో స్పష్టంగా కనిపించనున్నది. గ్యాస్ ఏజెన్సీల యజమానులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో బీపీసీ, ఐవోసీ, హెచ్పీసీ కంపెనీలకు చెందిన 100 వరకు గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారు 8 లక్షల వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఇప్పటి వరకు డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.924 ఉండగా, పెంచిన రూ.60తో రూ.984కు చేరింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 8 లక్షల మంది లబ్ధిదారులపై నెలకు రూ.4.80లక్షలు, ఏడాదికి రూ.57. 60 కోట్ల అదనపు భారం పడనున్నది.
గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా దాదాపు ప్రతి ఇంట్లో గ్యాస్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ధర ల పెంపు లక్షలాది కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపనున్నది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.410 ఉండగా.. ఇప్పుడు అది రెట్టింపు అయిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీని సైతం అంతంత మాత్రంగానే అమలు చేస్తున్నాయనే విమర్శలున్నాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సబ్సిడీ విధానాన్ని తీసుకొచ్చిందని, గ్యాస్ సిలిండర్‌పై అధికంగా వసూలు చేస్తూ.., అందులో నుంచి కొంత సబ్సిడీగా ఇచ్చిందని, రానురాను అది కూడా తగ్గిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, ఒక్కో కుటుంబానికి ఒక సిలిండర్ సుమారు రెండు నెలలు వస్తుందని, అంటే సంవత్సరానికి ఆరు సిలిండర్లకు కుటుంబంపై రూ.360 అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన విద్యుత్, కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు గ్యాస్ ధరల పెంపు మరింత భారంగా మారనున్నది. అలాగే గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై కూడా ప్రభావం పడనుంది. అలాగే, కమర్షియల్ సిలిండర్ ధర రూ.115 పెరగడం వల్ల ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ధరల పెంపును పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, గ్యాస్ సిలిండర్ ధరల పెంపునకు నిరసనగా వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు మిన్నంటాయి. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని పలువురు మహిళలు, నాయకులు, పలు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
పేద ప్రజలపై తీవ్ర ప్రభావం
యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్రప్రభుత్వం వంటగ్యాస్ పెంచడంతో పేదలపై తీవ్రంగా భారం పడుతుంది. రెక్కాడితే కానీ, డొక్కాడని నిరుపేదల బతుకులు గుదిబండగా మారుతాయి. ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పే నాయకులు పేదల గురించి ఆలోచించడం లేదు. ఒకేసారి గ్యాస్ సిలిండర్ మీద రూ.60 పెంచడం అంటే మాటలు కాదు. పెంచిన ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలి.
– కొకిరాల జ్యోతి, నడికూడ
వెంటనే ధరలు తగ్గించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై భారం మో పుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశన్నంటాయి. దీనికి తోడుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో పేద ప్రజలు మరిం త ఇబ్బంది పడతారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలి. లేదా పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.
-చందుపట్ల సుజాత, పరకాల