‘ఎల్లిపోతావుర మనిషి… ఏదో ఓనాడు ఈ భూమి వదిలేసి’ పాట కొవిడ్ కాలంలో రెండు తెలుగు రాష్ర్టాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లందరినీ కుదిపేసింది. పాలమూరు తత్వగీతాల వారసత్వంలాంటి ఆ పాటతో తెలంగాణ బిడ్డ స్వాతి రెడ్డి ప్రపంచానికి పరిచయమైంది. ‘నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి’ అంటూ ఇప్పుడు ప్రతి పెండ్లింట డీజే పాటై స్టెప్పులేయిస్తున్నది. ప్రవాసంలో ఉంటూ తెలుగు జానపద బాణీలు ఆలపిస్తున్న పాలమూరు పల్లెదనం గురించి ఆమె చెబుతున్న జ్ఞాపకాల స్వాతి చినుకులు..
Swathi Reddy | మహబూబ్‌నగర్ జిల్లా వెలుగొండ మా సొంతూరు. నేను పుట్టింది, పెరిగింది మాత్రం నాగర్‌కర్నూల్‌లో. చిన్నప్పటి నుంచి పాటలు పాడేదాన్ని. అప్పట్లో గాయనిగా ఎదగాలన్న కోరికేమీ ఉండేది కాదు. మహబూబ్‌నగర్‌లో డిగ్రీ చదివాను. కాలేజీ రోజుల్లో ఆడియో క్యాసెట్లకు మంచి మార్కెట్ ఉండేది. జానపద పాటలు బాగా వినిపించేవి. డిగ్రీలో ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా పాడేదాన్ని. పాటల రచయిత రామస్వామి గారు నాకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు. ఎన్ని పాటలు పాడానో లెక్కే లేదు. కానీ, ‘తొడగవయ్య గాజుల శెట్టి, అమ్మతోడు మామ నేను అడిగెదాన్ని కాదు, మూడు వందలిస్త్తా.. ముక్కుకు ముక్కెర తెస్తవ’ పాటల్ని జనం బాగా పాడుకున్నట్టు గుర్తు. నేను పాడిన ‘పల్లె కోలాటం, జంట కోలాటం’ ఆల్బమ్స్‌కి మంచి ఆదరణ వచ్చింది. అలా అవకాశం వచ్చినప్పుడు పాడేదాన్ని. మిగతా రోజుల్లో సంగీతం నేర్చుకునేదాన్ని. మహబూబ్‌నగర్‌లో సరస్వతమ్మ దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఆమె దగ్గరే లలిత సంగీతం అభ్యసించాను. వీకెండ్స్‌లో హైదరాబాద్ వచ్చేదాన్ని. తెలుగు విశ్వవిద్యాలయంలో చిత్తరంజన్ గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకునేదాన్ని.
డిగ్రీ తర్వాత ఎంబీఏలో చేరాను. అందరూ ‘గొంతు బాగుంది. సినిమాల్లో పాడు’ అనేవాళ్లు. ఆ మాటలతో సినిమాల్లో పాడే అవకాశం కోసం ప్రయత్నాలు చేశాను. సరైన దారి దొరక్క అవకాశాలు దక్కలేదు. అప్పటివరకు పాడటానికి, నేర్చుకోవడానికి ఇంట్లో అభ్యంతరం చెప్పలేదు. కానీ, సినిమా ప్రయత్నాలు నాన్నకు నచ్చలేదు. ముందు చదువు మీద దృష్టిపెట్టు అన్నారు. ఇక ఆ రెండేళ్లూ పాటే పాడలేదు.
పెండ్లి తర్వాత ఇంగ్లండ్ వెళ్లా. మా ఆయన నరేందర్ రెడ్డి అక్కడ ఐటీ ఉద్యోగి. పెండ్లిచూపుల్లోనే ‘నాకు పాటలు చాలా ఇష్టం’ అని ఆయనతో చెప్పాను. వివాహం తర్వాత పాడాలని ఉందన్నాను. ‘మంచిదే కదా. తప్పకుండా పాడు’ అని పాటకు మాట ఇచ్చారు. ఆయన సపోర్ట్ వల్లే ఇప్పటికీ పాడగలుగుతున్నాను. యూకేలో ఉన్నప్పుడే యాదాద్రి ఆలయ వైభవం గురించి ‘యాదిలోకి వచ్చాక యాదన్న’ ఆల్బమ్ పాడాను. ‘నేల తల్లికి వందనం’ ఆల్బమ్‌లో ‘నేలతల్లీ వందనమమ్మా’ అనే పాట పాడాను. ‘ఊరే మన కన్నతల్లిరా’ పాట పాడాను. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ‘తెలుగు నేలకు పూలమాల’ అనే ఆల్బమ్ చేశాను. ఆ మహాసభలకు నాకూ ఆహ్వానం అందింది. సంతోషంగా హాజరయ్యాను.
పాడే అవకాశం కోసం నా అంతట నేనే ఆల్బమ్స్ చేశాను. సొంత డబ్బులు ఖర్చుపెట్టాను. నా ఆల్బమ్స్ అన్నిటికీ మా ఆయనే నిర్మాత. ఆల్బమ్స్ చేయాలంటే చాలా ఖర్చవుతుంది. అంత డబ్బు తిరిగి రాదు. అయినా సరే ఇష్టంతో చేశాను. డబ్బులు వస్తాయని ఆశించలేదు. నా పాటలన్నీ సందేశాన్నిచ్చేవే. నాకు ఎవరితో కలిసి పనిచేయడం అనుకూలంగా ఉంటుందో వాళ్లతో కలిసి పనిచేస్తాను. అందుకే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, రైటర్స్తోనే పని చేస్తున్నాను. బీమ్స్ గారికి సబ్జెక్ట్ చెప్పి ‘ఎల్లిపోతావురా మనిషి’ పాట రాయించుకున్నాను. కొవిడ్ సమయంలో ఆ పాట చేశాను. అది బాగా వైరల్ అయింది. ఎంతోమందిని కదిలించింది. నాకూ సంతృప్తినిచ్చింది. అలాంటి పాటల కోసం ఇప్పుడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాను.
ఈ పోటీ ప్రపంచంలో నేను అనుకున్నంత గుర్తింపు వచ్చింది. మొదట నాకు నేనుగా అవకాశాలు సృష్టించుకున్నాను. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాను. లండన్‌లో ఆర్థిక సేవల సంస్థ వెల్త్ మ్యాక్స్‌లో ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. యూకే, అమెరికాతోపాటు ఐరోపా దేశాల్లోని తెలుగు ఎన్ఆర్ఐ సంఘాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. సినీ నేపథ్య గాయకులకు, శాస్త్రీయ సంగీతకారులకు అందినట్టే నాకూ ఆహ్వానం, గుర్తింపు, గౌరవం అందాయి. ఇంతకన్నా కావాల్సిందేముంది?
నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలని చాలాకాలం ఉచితంగా పాడాను. కానీ, ఇప్పుడు నా పాట నాకు ఆర్థిక స్వావలంబన ఇచ్చింది. ఇక్కడి తెలుగువాళ్లు మాతృభాషను ఎంతో ఇష్టపడతారు. ఆ ఇష్టంతోనే నన్ను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ల సహకారంతో యూట్యూబ్ చానెల్ Swathi Reddy UK నడుపుతున్నాను. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్లు దీనిని ఆదరిస్తున్నారు. మా పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. వాళ్లను చూసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ పాటల కోసం పనిచేస్తున్నాను. ఆరు నెలల నుంచి ఫుల్ బిజీగా ఉన్నాను. ఇంటి బాధ్యతలు వదులుకోకుండా, ఇష్టమైన సంగీతంతో జర్నీ చేస్తున్నాను. ఈ ప్రయాణంలో మా ఆయన ప్రోత్సాహం ఇప్పటికీ కొనసాగుతుండటం నా అదృష్టం.
నా పాటలన్నీ సందేశాత్మకమైనవే. ‘ఎప్పుడూ ఇవేనా?’ అని చాలామంది అంటున్నారు. నా మైండ్‌సెట్‌కి తగ్గ పాటలు చేస్తున్నానని చెబుతూ వచ్చాను. వాళ్ల కోసం కూడా చేద్దామని ఫోక్ సాంగ్స్ మీద మళ్లీ ఫోకస్ చేశాను. ‘నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి’ పాట పాడాను. ఈ పాటలో ఏమీ ఉండదు. జస్ట్… ఆ బీట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. స్వాతి రెడ్డి పాటతో మస్త్ ఫేమస్ అయ్యాను.
– నాగవర్ధన్ రాయల