హైదరాబాద్, మార్చి 9(నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ‘టీ-సాట్’ వేదికగా ఒక ప్రత్యేక అవగాహన, ప్రేరణాత్మక కార్యక్రమం నిర్వహించింది. పరీక్షల చివరి దశలోఎలా సిద్ధం కావాలి?, విద్యాపరమైన మెళకువలు, మానసిక ధైర్యంపై నిపుణులు దిశానిర్దేశం చేశారు.
సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా మాట్లాడుతూ పరీక్షలను ఎలాంటి భయం లేకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదురోవాలన్నారు. కేవలం మారులపైనే దృష్టి పెట్టకుండా, సానుకూల దృక్పథంతో సాధన చేయాలన్నారు. పరీక్షల మధ్య వచ్చే సెలవు రోజుల్లో ఒత్తిడి లేకుండా పునశ్చరణ కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ ఎస్సీఈఆర్టీ అందించిన యాక్షన్ప్లాన్ను విద్యార్థులు కచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. సబ్జెక్టులను రివిజన్ చేయాలని, పాత ప్రశ్నపత్రాలతో సాధన చేయాలని, ముఖ్యమైన అంశాలపై నోట్స్ రాసుకోవాలని సూచించారు. సైకాలజిస్ట్ డాక్టర్ పద్మజ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్(రీడిండ్, రిసైట్, రివ్యూ) పద్ధతిలో చదవాలని చెప్పారు. గంటల తరబడి కాకుండా, చిన్న చిన్న విరామాలతో చదువుకోవాలని, ‘నేను పరీక్ష బాగా రాస్తాను’ అనే సానుకూల ఆలోచనతో ప్రిపేర్ కావాలని సూచించారు.