కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 9 : ధాన్యం సేకరణలో అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా డిఫాల్టర్లపై రుద్దుతూ జరిమానా, వడ్డీ పేరిట రాక్షసుల్లా పీక్కుతింటున్నారని కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. కొన్నేండ్లుగా తమ బాధలు ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు కూడా అవకాశమివ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం కరీంనగర్లో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు బీ నర్సింగరావు, టీ కరుణాకర్, శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ పాలకులు మిల్లర్ల పట్ల అనుసరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అస్పష్టమైన విధానంతోనే రైస్‌మిల్లర్లు డిఫాల్టర్లుగా మారుతున్నారని తెలిపారు. టార్గెట్ పెట్టి బియ్యం సేకరించడం సరికాదని అన్నారు. డిఫాల్టర్ల నుంచి వసూలు చేస్తున్న 25 శాతం జరిమానా, 12 శాతం వడ్డీని మాఫీ చేయాలని, నాలుగు వాయిదాల్లో సీఎంఆర్ వసూలు చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో మిల్లర్లు చెల్లించాల్సిన మొత్తం రూ.400 కోట్లు కాగా, తమకు రావాల్సిన మొత్తం రూ.1,500 కోట్ల దాకా ఉంటుందని చెప్పారు. దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సొంత వ్యాపారం నిలిపిపేసి, సీఎంఆర్ మాత్రమే మరాడిస్తున్నా యంత్రాంగం తమపై వేధింపులు ఆపడం లేదని వాపోయారు.
రైతుల నుంచి పూర్తిగా ధాన్యం సేకరించేలా తమను అనేక ఇబ్బందులకు గురిచేస్తుండగా, తమ వద్ద నుంచి మరాడించిన మొత్తం ధాన్యం ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అత్యధిక శాతం బాయిల్డ్ రైస్ మిల్లులుంటే, కేవలం రా రైస్ మాత్రమే కొనుగోలు చేస్తామనడం, 67 శాతం ఔటన్ రావాలని ఆంక్షలు విధించడం మిల్లర్లపై అధికారుల ఒత్తిడి ఏ మేరకు ఉన్నదో అర్థం చేసుకోవాలన్నారు. తమ సమస్యలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో చెప్పుకొన్నా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైస్‌మిల్లర్లతో చర్చలు జరపాలని కోరారు. లేనిపక్షంలో ధాన్యం సేకరణకు దూరంగా ఉంటామని హెచ్చరించారు.