Tiger Nuts | ఇటీవలి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అలాంటి సూపర్‌ఫుడ్స్‌లో టైగర్ నట్స్ కూడా ఒకటి. పేరు వింటే ఇవి గింజలని అనిపించినా, వాస్తవానికి ఇవి సైపెరస్ ఎస్క్యులెంటస్ అనే మొక్కకు చెందిన దుంపలు. స్పెయిన్‌లో విస్తృతంగా సాగు చేసే ఈ దుంపలను ఔషధ గుణాల కోసం కూడా ఉపయోగిస్తారు. వీటిని కాల్చి లేదా తేనెతో కలిపి తింటారు. అలాగే చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కూడా టైగర్ నట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఉండే పోషకాలు శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. టైగర్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలు దెబ్బతిని అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఈ ఆక్సిడేటివ్ నష్టాన్ని తగ్గించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా టైగర్ నట్స్ ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఒలేయిక్ యాసిడ్ చర్మానికి తగిన పోషణను అందించి, బాహ్య కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వల్ల చర్మం త్వరగా ముడతలు పడకుండా కాపాడటంలో దోహదపడతాయి. ఎగ్జిమా వంటి కొన్ని చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. టైగర్ నట్స్‌లో పీచు పదార్థం కూడా సమృద్ధిగా ఉంటుంది. సుమారు 30 గ్రాముల టైగర్ నట్స్‌లో దాదాపు 10 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతోపాటు శరీరంలోని వ్యర్థాలు, కొవ్వు, విషపదార్థాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంతో బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అలాగే గుండె ఆరోగ్యం, మధుమేహ నియంత్రణకు కూడా ఫైబర్ మేలు చేస్తుంది.
టైగర్ నట్స్‌తో తయారు చేసే పాలు ఆవు పాలకు మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. శాకాహార జీవనశైలిని అనుసరించే వారు, అలాగే లాక్టోస్ అసహనంతో బాధపడేవారు వీటిని తీసుకోవచ్చు. వీటిలో ఉండే విటమిన్ ఇ, విటమిన్ సి రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. టైగర్ నట్స్‌లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచి, కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మధుమేహంతో బాధపడేవారికి కూడా టైగర్ నట్స్ మంచి స్నాక్‌గా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఇన్సాల్యుబుల్ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో దోహదపడుతుంది.
టైగర్ నట్స్‌లోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా శరీరంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ మధ్య సమతుల్యతను కాపాడటానికి ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా టైగర్ నట్స్ మేలు చేస్తాయి. ఇవి ప్రీబయోటిక్‌లా పనిచేసి పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా నిలుస్తాయి. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. క్రమంగా ఆహారంలో చేర్చుకుంటే గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. తగిన మోతాదులో తీసుకుంటే విరేచనాల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. పోషక విలువల విషయానికి వస్తే.. 30 గ్రాముల టైగర్ నట్స్‌లో సుమారు 120 కేలరీల శక్తి, 19 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 2 గ్రాముల ప్రోటీన్, 7 గ్రాముల కొవ్వు, 10 గ్రాముల ఫైబర్, 1.8 మిల్లీగ్రాముల ఐరన్, 20 మిల్లీగ్రాముల మెగ్నిషియం, 1.1 మిల్లీగ్రాముల జింక్, 215 మిల్లీగ్రాముల పొటాషియం, కొద్దిపాటి విటమిన్ బి6 లభిస్తాయి. ఈ పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.