హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తీవ్ర ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ద్రోణి, ఉపరితల ఆవర్తనాలతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురువనున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అ ల్పపీడనం, మరింత బలపడి సోమవారానికి వాయుగుండంగా, మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 23నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్దక్షిణ ఒడిశా తీరాలకు చేరుకోనున్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పింది.
ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ సహా పలు జిల్లాల్లో సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. బుధవా రం నాటికి వాతావరణ పరిస్థితులు మ రింత తీవ్రరూపం దాల్చనుండటంతో ప లు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అంచనా వే సింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల జోరు కొనసాగనున్నట్టు పేర్కొన్నది.