హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న వారి జాబితా చాండాడంత ఉన్నట్టు తెలుస్తున్నది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలను చేజికించుకునేందుకు ఏకంగా 50మందికి పైగా సీనియర్లు, కీలక నేతలు పోటీ పడుతున్నారు. నవంబర్ నాటికి గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం ముగుస్తుండటం, మార్చి నెలలో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
వీటికి అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలా? లేక ముందు పేర్లను ఖరారు చేసి తర్వాత నామినేటెడ్ కోటాను తేల్చాలా అని కాంగ్రెస్ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తున్న ది. మొత్తం కోటాలో రెండు బీసీ, రెండు ఓసీ, ఒక స్థానాన్ని ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి కేటాయించాలనే ప్రాథమికంగా చర్చ జరుగుతున్నది. దీంతో గవర్నర్ కోటాలోని మూడు స్థానాల్లోనే రెండు బీసీలకు, మరొకటి ఎస్సీ లేదా ఎస్టీకి ఇచ్చి సామాజిక సమతుల్యతను కాపాడాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. ఈ పరిణామాల మధ్య గతంలో బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో సభ్యులుగా ఎంపికై, కాంగ్రెస్ గూటికి చేరిన బస్వరాజు సారయ్య, దయానంద్ సైతం తమ పదవులను రెన్యువల్ చేయించుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గాల పరిధిలోని ఆరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. త్వరలో జరగబోయే కోర్ ఏరియా మున్సిపల్ ఎన్నికలు, గ్రామీణ స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలపై ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి సమర్థులైన, గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని భావిస్తున్నారు. ఈ రెండు గ్రాడ్యుయేట్ స్థానాలను ఓసీ వర్గాలకు కేటాయించే అవకాశం ఎకువగా కనిపిస్తుండగా, రెండూ రెడ్డి సామాజికవర్గానికే దకుతాయా, లేక ఒక స్థానాన్ని రెడ్డి వర్గానికి ఇచ్చి మరొకటి ఇతర ఓసీ వర్గానికి ఇస్తారా? అనే చర్చ నడుస్తున్నది.
పదవుల పంపకాల్లో పాత కాంగ్రెస్ నేతలకు 70శాతం, కొత్త వారికి 30శాతం లెక్కన సీట్లు కేటాయించినట్టు ఏఐసీసీ సూచించినట్టు తెలిసింది. దీంతో తనకు అనుకూలంగా ఉండే పాత కాంగ్రెస్ నేతలపై సీఎం ఫోకస్ చేస్తున్నట్టు తెలిసింది. గవర్నర్ కోటా పదవుల కోసం ఇద్దరు కీలక ప్రభుత్వ సలహాదారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన హరర వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడే గాక ఢిల్లీ అధిష్ఠానంతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తున్నది.
మైనారిటీ వర్గానికి చెందిన షబ్బీర్ అలీ కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ, రేవంత్‌రెడ్డి మా త్రం టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పట్ల ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది. కొత్వాల్ నిఖార్సైన కాంగ్రెస్ పాత నేత కావటం, రేవంత్‌రెడ్డికి సన్నిహితుడి అయినందున రేసులో ఆయనే ముందున్నట్టు చెప్తున్నారు. అయితే ఇటీవలే మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవితోపాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వడంతో, మళ్లీ అదే కోటాలో మరో మైనారిటీ నేతకు అవకాశం అసాధ్యం అనే ఆలోచనతో ఉన్న కొత్వాల్ ఎమ్మెల్సీ కంటే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది.
మరోవైపు ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు పోటీ పడుతున్నట్టు తెలిసింది. ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నట్టు తెలిసింది. మొదటినుంచి రేవంత్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న ఆయన తొలుత ఆలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పెద్ద రెడ్లతో పోటీపడలేక వెనుకబడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం చీఫ్ పీఆర్వోగా చేరారు.
అనంతర కాలంలో ఆయనకు ఆర్టీఐ కమిషనర్‌గా బాధ్యతలు ఇచ్చారు. ఇటీవల ఆయన సీఎంను కలిసి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరినట్టు తెలిసింది. సీఎం కూడా కొంత సానుకూలతను వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. బోరెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. గతంలో ఆర్టీఐ కమిషనర్‌గా పనిచేసిన పీవీ శ్రీనివాస్ వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ టికెట్‌ను ఆశిస్తున్నట్టు చెప్తున్నారు. ఇక టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం.
నల్లగొండ గద్దర్ అలియాస్ కాసాల నర్సిరెడ్డి తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎంని కీర్తిస్తూ ఆయన పాడిన పాటలు రాజకీయ సభల్లో మారుమోగుతున్నాయి. నర్సిరెడ్డి, ఇక శాసనమండలిలో అడుగుపెట్టాలని తహతహలాడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. గవర్నర్ కోటాలో తన పేరును పరిశీలించాలని ఆయన సీఎంను కోరుతున్నట్టు తెలిసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఆయనకు సాన్నిహిత్యం ఉంటడం దీనికి మరింత ఊతమిస్తున్నది.
గవర్నర్ కోటా పదవుల కోసం అన్ని సా మాజిక వర్గాల నుంచి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. బీసీ వర్గం నుంచి బస్వరాజు సారయ్య, మధుయాషీ, కొండా ము రళి, ఈరవత్రి అనిల్ పో టీలో ఉన్నారు. ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, దొమ్మాట సాంబయ్య, ప్రీతమ్ తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. ఓసీ సామాజికవర్గం నుంచి దయాసాగర్, రోహిణ్‌రెడ్డి ఆశలు పెట్టుకోగా, మహిళా విభాగంలో సునీతా ముదిరాజ్, ఎర్రబెల్లి స్వర్ణ పోటీ పడుతున్నారు.
ఎస్టీ సామాజికవర్గం నుంచి బెల్లయ్య నాయక్ తన పేరును గట్టిగా ప్రతిపాదిస్తున్నారు. మరోవైపు వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానాన్ని పటేల్ రమేశ్‌రెడ్డి, సర్వోత్తమ్‌రెడ్డి, గుత్తా అమిత్, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, కైలాశ్ నేత, లోకేశ్ యాదవ్, మెండెం కిరణ్ తదితరులు ఆశిస్తున్నారు. మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి స్థానానికి మన్నె జీవన్‌రెడ్డి, శివసేనారెడ్డి, బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి, సామా రామ్మోహన్‌రెడ్డి, గౌరు సతీశ్ లాబీయింగ్ కొనసాగిస్తున్నట్టు తెలిసింది.