వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 20 : దవాఖాన స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో ముగ్గురు రోగులు సహా 8 మందికి గాయాలైన ఘటన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఆదివారం జరిగింది. ఉదయం 9 గంటల సమయంలో ఆరోగ్యశ్రీ వార్డులో స్లాబ్ పెచ్చులు ఊడి సీలింగ్ పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కింద కూలిపోయింది. ఈ ప్రాంతంలో పక్షవాతంతో చికిత్స పొందుతున్న మస్తాన్, సారయ్య, ఆయాసంతో చికిత్స పొందుతున్న స్వప్నకు తీవ్ర గాయాలయ్యాయి. అటెండెంట్లు ఓంకార్, ఎల్లమ్మ, భిక్షపతి, వార్డును శుభ్రం చేస్తున్న శానిటేషన్ ఉద్యోగులు పుష్ప, సౌందర్య స్వల్పగాయాలతో బయటపడ్డారు.
వెంటనే స్పందించిన హాస్పిటల్ సిబ్బంది క్షతగాత్రులకు వైద్యసేవలు అందించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి గాయాపాలైన వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను మరో వార్డుకు తరలించి, వార్డును ఖాళీ చేయించారు. ఊడిపడిన కాంక్రీట్ ముక్కలు నేరుగా వ్యక్తులపై పడిఉంటే ప్రాణహాని కలిగి ఉండేదని వైద్యాధికారులు చెబుతున్నారు.