Udaya Bhanu | తెలుగు సినీ పరిశ్రమలో ఇతర భాషల కథానాయికలకు మన తెలుగు నటీమణులు, యాంకర్లు, గాయకులు డబ్బింగ్ చెప్పడం సాధారణమే. అయితే కొన్ని సందర్భాల్లో తాము డబ్బింగ్ చెప్పిన విషయం కూడా ప్రేక్షకులకు తెలియకుండా పోతుంది. తాజాగా సీనియర్ యాంకర్, నటి ఉదయభాను తనకు సంబంధించిన అలాంటి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. యాంకరింగ్‌తో పాటు నటిగా కూడా పలు సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత వివాహం, పిల్లల కారణంగా కొంతకాలం కెరీర్‌కు దూరంగా ఉంది. ప్రస్తుతం మళ్లీ నటిగా రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. తాను నిర్మించిన ‘పంచనామా’ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డబ్బింగ్ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
తాను ప్రముఖ నటి ఛార్మికి ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో డబ్బింగ్ చెప్పినట్లు ఉదయభాను తెలిపింది. అయితే ఛార్మి మాట్లాడే విధానాన్ని అనుకరిస్తూ, తన గొంతును కూడా మార్చుకుని డబ్బింగ్ చెప్పానని చెప్పింది. దీంతో ఆ సినిమాలో ఛార్మికి తాను డబ్బింగ్ చెప్పిన విషయం ప్రేక్షకులకు తెలియలేదని వెల్లడించింది. ఛార్మికి ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో డబ్బింగ్ చెప్పాను. ఆమె మాట్లాడే విధానాన్ని ఇమిటేట్ చేస్తూ డబ్బింగ్ చెప్పాను. ఆమె కొన్ని పదాలను ప్రత్యేకంగా పలుకుతుంది. అలాగే నా గొంతును కూడా మార్చుకుని చెప్పడంతో.. ఆ సినిమాకు నేను డబ్బింగ్ చెప్పానని ఎవరూ గుర్తించలేకపోయారు అని ఉదయభాను చెప్పింది. అంతేకాదు, ఆ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ క్రెడిట్స్‌లో కూడా తన పేరు లేదని ఆమె పేర్కొంది. అందువల్ల తాను ఛార్మికి డబ్బింగ్ చెప్పిన విషయం బయటకు తెలియలేదని తెలిపింది.
ఆ తర్వాత కూడా తనకు చాలామంది డబ్బింగ్ అవకాశాలు ఇచ్చేందుకు సంప్రదించారని, అయితే ఒక్కో పాత్రకు నాలుగు, ఐదు రోజుల సమయం కేటాయించాల్సి వచ్చేదని చెప్పింది. అప్పట్లో తనకు అంత సమయం, ఓపిక లేకపోవడంతో డబ్బింగ్ చెప్పడం కొనసాగించలేదని ఉదయభాను వెల్లడించింది. ఇలా ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో ఛార్మికి తానే డబ్బింగ్ చెప్పిన విషయాన్ని ఇన్నేళ్ల తర్వాత బయటపెట్టింది.
కాగా, ‘శ్రీ ఆంజనేయం’ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. అయితే తనకు డబ్బింగ్ క్రెడిట్ ఇవ్వలేదని ఉదయభాను చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు కృష్ణవంశీ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.