PM Modi | ప్రధానిగా ఉన్న పదేండ్ల కాలంలో ఏ రోజూ ప్రెస్‌మీట్ పెట్టని మోదీ, ఎన్నికల పుణ్యమా అని తెలుగు చానల్స్‌కు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నంబర్ వన్ చానల్ అని చెప్పుకొనే ఒక చానల్‌కు ఇటీవల మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారు. వారు 20 ప్రశ్నలు పంపిస్తే, వాటిలో ఎనిమిది తీసేసి 12 ప్రశ్నలకు ఓకే చేశారు. దాదాపు గంటపాటు సాగిన ఇంటర్వ్యూను పీఎం మీడియా విభాగం సెన్సార్ చేసి అరగంటకు కుదించింది. దాన్ని సదరు చానల్‌కు తిరిగి అందజేసినట్టు సమచారం. ‘చారాణ కూరకు బారాణ మసాలా’ అన్నట్టు.. ఆ చానల్ ఏమో భారీ ప్రోమో తయారు చేసుకుంది.
తనను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల కంటే తన మేనకోడలు నవ్వినందుకే ఎక్కవ బాధపడుతున్నట్టు బీజేపీ నాయకురాలు డీకే అరుణ వాపోయారు. తన తండ్రి నర్సిరెడ్డిని నాడు రేవంత్‌రెడ్డి మామ జైపాల్‌రెడ్డి రాజకీయంగా దెబ్బతీస్తే, నేడు తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. అయినా తాను భయపడటం లేదని కానీ, రేవంత్‌రెడ్డి తననుద్దేశించి చులకనగా మాట్లాడినప్పుడు వేదికపైనే ఉన్న తన మేనకోడలు, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కనీసం ఖండించకపోగా.. నవ్వినందుకే బాధేసిందని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో తనకు మేనత్త ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం చేసుకొని.. ఇప్పుడు నోరు మెదపకపోవడం అన్యాయమని అన్నారు. అంటే, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీలో ఉండి కూడా.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసిన తన మేనకోడలికి డీకే అరుణ మద్దతుగా నిలిచారన్నది నిజమేనన్నమాట.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి సర్కార్ కూలిపోతుందని బీజేపీ ఎంపీ అర్వింద్ జోస్యం చెప్పారు. కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుకుంటే నెల రోజులు కూడా అవసరం లేదన్నారు. ఒకవేళ అర్వింద్ చెప్పిందే జరిగితే తర్వాతి సీఎం ఎవరనే దానిపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. కాగా, తనతో పాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డికే ఉందని ఇదివరకే ప్రకటించిన రేవంత్ తన ఛాయిస్‌ను బయటపెట్టారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తాను సీరియస్‌గా తీసుకోవడం లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. అది సరే మరి మీరెప్పుడు సీఎం అవుతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మీడియా అడిగితే.. ఆ సబ్జెక్టుకు ఈ ఎన్నికలతో సంబంధం లేదన్నారే తప్ప అలాంటిదేమీ లేదని ఖండించలేదంటే.. ‘దాల్ మే కుచ్ కాలా..’ ఉన్నట్టే!
పోలింగ్ ముగిసిందంటే అభ్యర్థులు ఇరవై రోజుల దాకా అతాపతా ఉండరు. తిరిగి వారి దర్శన భాగ్యం కలిగేది 20 రోజుల తర్వాత కౌంటింగ్‌కు ముందురోజే. ఎన్నికల బడలిక నుంచి సేద తీరేందుకు సుదూర తీరాలకు ట్రావెలింగ్, హోటళ్లను కొందరు ముందే బుక్ చేసుకోగా, కొందరేమో చేయాల్సిందంతా చేసేశాం.. ‘ఇక మీ దయ’ అంటూ భగవంతుడిపై భారం వేసి తీర్థయాత్రలకు బయలుదేరనున్నారు. ఇది ప్రతి ఎన్నికలలో జరిగేదే. కానీ, ఈ సారి పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటంతో ప్రచార రథాలు, మైకులు, డీజేలు, జెండాలు, కరపత్రాలు, పోస్టర్లు తదితర సామగ్రి సమకూర్చినవారు.. అభ్యర్థుల నుంచి ముందే డబ్బులు రాబట్టుకునే పనిలో పడినట్టు సమాచారం. ‘టూర్‌కు వెళ్లకముందే.. గవి ఇచ్చి పోరాదే’ అని వెంటపడినట్టు ఓ అభ్యర్థి వాపోయారు.
– వెల్జాల