‘గ్రేటర్ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తా.. కేబీఆర్ చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లను ట్రాఫిక్ రహిత కూడళ్లుగా మారుస్తా’.. ఏడాది పాలన ఉత్సవాలను పురస్కరించుకుని హెచ్సిటీ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి..
సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): అయితే రూ. 1090కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన జరిగి 14 నెలలు కావొస్తున్నా.. ఒక్క పిల్లర్ గుంతకు నోచుకోలేదు. అధికారుల తొందరపాటు, పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ఈ ప్రాజెక్టు ఇప్పుడు న్యాయపరమైన చికుల్లో కూరుకుపోవడం గమనార్హం. భూ సేకరణ అత్యంత క్లిష్టంగా మారడంతో ప్రభుత్వానికి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా ప్రాజెక్టు మారింది. వాస్తవ విషయం ఏమిటంటే అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లుగా తాజాగా ప్రాజెక్టు వ్యయం రూ.1090 కోట్లు ఉంటే…భూ సేకరణకు రూ.1543కోట్ల మేర ఖర్చు కానున్నదని అధికారులు తేల్చారు. ప్రాజెక్టు ఖర్చు విషయంలో ప్రభుత్వ పరిపాలన అనుమతులు ఒకలా ఉంటే.. భూ సేకరణకు అయ్యే నిధుల అంశంలో స్పష్టత లేకపోవడం. వీవీఐపీ కారిడార్‌లో 428 ఆస్తుల స్వాధీనం అధికారులకు సవాల్‌గా మారింది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా శంకుస్థాపన చేసినా, నేటికీ ఆ ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దంపడుతున్నది.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
కేబీఆర్ పారు చుట్టూ ట్రాఫిక్ నివారణ కోసం ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్‌లను నిర్మించేందుకు సరారు కూడా పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేయడం, భూ సేకరణపై స్పష్టత లేకుండా ఆగమేఘాల మీద టెండర్లు పిలిచి ఏజెన్సీని ఖరారు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం, యుటిలిటీల బదలాయింపుకు కలుపుకుని మొత్తం వ్యయం రూ, 1090 కోట్లు కాగా, ఒక కేబీఆర్ పారు చుట్టూ ఆరు జంక్షన్ల వద్ద చేయాల్సిన స్థల సేకరణతో పాటు ఇతర ప్రాంతాలైన విరంచి హాస్పిటల్, ఎన్ఎఫీ సీ, టీవీ 9 జంక్షన్లతో కలుపుకొని కేవలం స్థల సేకరణకు రూ. 1543.82 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు లెకలేశారు. కానీ జీహెచ్ఎంసీ వద్ద అంత పెద్ద ఎత్తున వెచ్చించేందుకు నిధులు లేవు. స్థల సేకరణకు ప్రత్యేకంగా సరారు నిధులు కేటాయిస్తే తప్ప.. స్థల సేకరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
టీడీఆర్‌లకు భూ యాజమానులు ససేమిరా అంటున్న పరిస్థితి. ముఖ్యంగా హెచ్సిటీ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు పారు చుట్టూ మొత్తం పది ప్రాంతాల్లో స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ఇప్పటికే మారింగ్ కూడా పూర్తయినా, ఆశించిన స్థాయిలో స్థల సేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. పారు చుట్టూ కొందరు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులకు చెందిన ఆస్తుల నుంచి స్థలాన్ని సేకరించాల్సి ఉంది. కేబీఆర్ చుట్టూ బల్దియా అధికారులు చేపట్టిన స్థల సేకరణ ప్రక్రియను సవాలుచేస్తూ పలువురు కోర్టుమెట్లు ఎక్కారు. పారు చుట్టూ చేపట్టాల్సిన పనులకు గతంలోనే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసినప్పటికీ సరార్ నుంచి అనుమతి కూడా లభించినా, హెచ్ సిటీ పనులు ముందుకు సాగటం లేదు ఆది నుంచి లోపాలే..!
భూ సేకరణపై విధి విధానాలు రూపొందించకపోవడం, కేబీఆర్ పార్కు చుట్టూ సినీ, రాజకీయ ప్రముఖులు ఉండడం భూ సేకరణపై ఎలాంటి స్పష్టత లేకుండా ముందుకు సాగారు. ఫలితంగా క్షేత్రస్థాయిలోకి దిగిన అధికారులకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టును ఇప్పటికే వ్యతిరేకించి కేబీఆర్ పార్క్ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ సినీ హీరో అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి , ఇదే కోవలో పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాన్ని నిలువరించేలా, పర్యావరణాన్ని పెంపొందించాలని ఎన్జీటీలో నమోదైన కేసు పెండింగ్‌లో ఉంది. అంతేకాకుండా ఆపార్టీ నేతకు తోడుగా ఓ న్యూస్ యాజమాన్యం, బసవ తారకం క్యాన్సర్ దవాఖాన సమీపంలో మరో యజమానులు వేర్వేరుగా న్యాయస్థానం మెట్లు ఎక్కారు. దీంతో ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టలెకేఏ అవకాశాలు లేవని అధికార వర్గాలు చెబుతుండడం గమనార్హం. అధికారులు మాత్రం వివాదం లేని ఒకటి, రెండు చోట్ల జంక్షన్లలో పనులు మొదలు పెట్టి ప్రాజెక్టు పురోగతిలో ఉన్నట్లు చూపించేందుకు చకచకా అడుగులు వేస్తుండడం గమనార్హం.
ఫలించని కమిషనర్ ప్రయత్నం
కేబీఆర్ పారు చుట్టూ హెచ్సిటీ పనులకు సంబంధించి స్థల సేకరణకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ చేసిన ప్రయత్నం కూడా ఫలితాలనివ్వలేదు. మాజీ మంత్రి, అధికార పార్టీ నేత జానారెడ్డికి చెందిన ఆస్తి నుంచి ఈ ప్రాజెక్టు పనులకు స్థలాలను సేకరించాల్సి ఉంది. ఇందుకు సంప్రదించి నేరుగా కమిషనర్.. జానారెడ్డితో సంప్రదింపులు జరిపినా, నేటికీ స్థల సేకరణపై క్లారిటీ రాలేదు. ఇతర సినీ ప్రముఖులకు చెందిన ఆస్తుల నుంచి కొంతవరకు స్థలాలను సేకరించినా, వాటికి సంబంధించి స్థల యజమానులకు ఎలాంటి అభ్యంతరాల్లేకపోయినా, ప్రైవేటు వ్యక్తులు కోర్టును ఆశ్రయించటం కూడా ఓ సమస్యగా మారింది. హెచ్ సిటీ పనులపై కమిషనర్ ఇప్పటి వరకు పలుసార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలనలు జరపటంతో పాటు ప్రతి మంగళవారం ప్రధాన కార్యాలయంలో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేందుకు ఈ ప్రయత్నాలేమీ ఫలితాలనివ్వడం లేదు.