సిటీబ్యూరో, ఆగస్ట్ 4 (నమస్తే తెలంగాణ): ప్రాణాంతకమైన, విషపూరిత రసాయనాలతో కల్తీ మసాలాలు తయారుచేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మసాలా తయారీదారుల గుట్టును హైదరాబాద్ హెచ్ ఫాస్ట్ పోలీసులు మంగళవారం రట్టుచేశారు. హెచ్ ఫాస్ట్ పోలీసుల దాడుల్లో సుమారు 25.3టన్నుల కల్తీ మసాలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీజీఐసీసీసీ కార్యాలయంలో పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ హెచ్-ఫాస్ట్ కంట్రోల్ ఫోన్ నెంబర్కు ఒక పౌరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ విచారణలో మైలార్దేవ్పల్లి, బాలాపూర్ ప్రాం తాల్లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలను గుర్తించారు. అక్కడ సోదాలు నిర్వహించగా 11రకాల మసాలాలను కల్తీ చేస్తున్నట్లు తేలింది. పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో రెండు కేసులు, బాలాపూర్ పోలీసుస్టేషన్లో ఒక కేసు నమోదు చేశారు. ఈ కల్తీ తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్న రాహుల్ భట్టీ, విశాల్ పన్వర్, దూల్చంద్ కచ్చావర్లను అరెస్ట్ చేశారు. వారిపై తొలిసారిగా బీఎన్ఎస్ సెక్షన్ 110 హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. పోలీసు లు స్వాధీనం చేసుకున్న మసాలాలలో వాము, జీలకర్ర, ఆవా లు, లవంగాలు, సాజీరా, సోంపు, జీలకర్రపొడి, మెం తులు, తెల్లనువ్వులు, షైనింగ్ పౌడర్, రైస్ బ్రాస్ ఆయిల్, సింథటిక్, బట్టల రంగులు ఉన్నాయని సీపీ తెలిపారు.
ఈ మసాలాలను మెరిపించేందుకు కల్తీ వ్యాపారులు బట్టలకు ఉపయోగించే రంగులు, టాల్కమ్ పౌడర్, సింథటిక్ కలర్లు ఉపయోగించి నాసిరకం మసాలాలను తయారు చేసి అధిక ధరలకు మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తక్కువ కాలంలో పెద్దమొత్తంలో సంపాదించాలనే దురాశతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని పోలీసులు చెప్పారు. ఈ తయారీ కేంద్రాల నుంచి లభించిన సమాచారంతో మరో 13చోట్ల పోలీసులు సోదాలు నిర్వహించి తయారీకి సిద్ధంగా ఉన్న 89.15టన్నుల కల్తీ ముడిసరుకు స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఇలా తయారు చేసిన కల్తీ మసాలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో విక్రయిస్తూ అక్రమ సంపాదనకు అలవాటుపడ్డారని సీపీ పేర్కొన్నారు.
ఆహారాన్ని కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. కల్తీ మసాలాలను తయారుచేసిన ముగ్గురు వ్యాపారులపై బీఎన్ఎస్ సెక్షన్ 110 కింద అభియోగాలు నమోదు చేశామని, ఈసెక్షన్ కింద మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుందని సీపీ తెలిపారు. కల్తీ ఆహార పదార్థాలపై అనుమానం ఉంటే వెంటనే 8712661212 అనే హెచ్ఫాస్ట్ హెల్ప్లైన్కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ తెలిపారు.