హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన నిషేధిత భూముల వివాదం క్లైమాక్స్‌కు చేరిందా? రూ.లక్షల కోట్ల విలువైన భూములను కొట్టేయాలన్న ప్రభుత్వ పెద్దల ప్లాన్ నెరవేర బోతున్నదా? ఇందులో భాగం గానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22ఏ సమస్య పరిష్కారానికి ‘ఏడు కండీషన్లు’ పెట్టారా? పరిష్కారం పేరుతో భారీ భూ దందాకు వేసిన పన్నాగం పట్టాలెక్కుతున్నదా? ఇందుకు అసెంబ్లీ వేదిక కానున్నదా? అంటే సచివాలయ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. ముఖ్యనేత, నంబర్ 2 నేత కూడబలుక్కొని నిషేధిత జాబితా ముసుగులో భారీ భూ దందాకు స్కెచ్ వేశారని స్పష్టం చేస్తున్నారు. దీనికి అసెంబ్లీ సాక్షిగా ముహూర్తం ఖరారు చేశారని పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే యూఎల్సీ, అసైన్డ్, జీవో 59తోపాటు ఇతర భూ సమస్యల దరఖాస్తుల క్లీయరెన్స్‌కు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితా ప్రకంపలను సృష్టిస్తూ, సామాన్యుల కంటిపై కునుకులేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారి సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ‘కండీషన్స్ అప్లయ్’ అంటూ కొర్రీలు పెడుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘22ఏ’ వివాదంపై శనివారం అసెంబ్లీలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘంగా స్పందించారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘22ఏ నిషేధిత భూముల సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉన్నది. ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయితే ఈ సమస్య పరిష్కారం కావాలంటే కొన్ని సమస్యలపై అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి క్లియర్ చేస్తేనే నిషేధిత సమస్య పరిష్కారమవుతుంది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేస్తారు’ అని ప్రకటించారు.
1. యూఎల్సీ భూముల దరఖాస్తుల క్లియరెన్స్.
2. అసైన్డ్ భూముల పరిష్కారం. వాటికి యాజమాన్య హక్కులు కల్పించాలి.
3. జీవో 59 దరఖాస్తుల పరిష్కారం
4. ఎల్బీనగర్, మునుగోడుతోపాటు ఇతర ప్రాంతాలకు జీవో 118తో పరిష్కారం
5. ఇందిరమ్మ హౌసింగ్‌బోర్డుకు కేటాయించిన స్థలాల పరిష్కారం.
6. నాలా కన్వర్షన్ కాకుండా వెంచర్లు వేసిన భూముల పరిష్కారం.
7. సింగరేణి ప్రాంతంలోని భూముల పరిష్కారం కోసం జీవో 76 పరిష్కారం.
నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు మంత్రి చెప్పిన ‘కండీషన్స్ అప్లయ్’ వ్యాఖ్యలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షల కోట్ల విలువైన భూములను హస్తగతం చేసుకునేందుకే వీటిని తెరపైకి తీసుకొచ్చారనే ఆరోపణలున్నాయి. ఏ భూముల్లో అయితే లాభం ఉంటుందో ముందుగానే చూసుకొని ఆ భూముల సమస్యను పరిష్కరించే దిశగా పావులు కదిపినట్టుగా తెలుస్తున్నది. ఇందులో భాగంగానే గతంలో ఎలాంటి వివాదంలోనూ లేని భూములను ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చి, కండీషన్స్ పేరుతో భారీ నాటకానికి తెరలేపారనే విమర్శలున్నాయి. ఆ ఏడు నిబంధనల్లోని భూముల విలువ రూ.లక్షల కోట్లలో ఉంటుందని అంచనా. అయితే కండీషన్స్ అప్లయ్ వెనుక కుట్రకోణం దాగి ఉన్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల కోసం ఆ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నది. ఇక ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. యూఎల్సీ, అసైన్డ్ భూములపై ఇప్పటికే కొందరు సర్కార్ పెద్దల కన్ను ఉన్నదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పుడు కండీషన్ల సమస్యల పరిష్కారం ముసుగులో పెద్దలు వారి భూములను సైతం క్లియర్ చేసుకుంటారని అనుమానిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భూముల చుట్టూ పరిభ్రమిస్తున్నదంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తున్నది. ఈ విమర్శలకు తగ్గట్టుగానే కాంగ్రెస్ సర్కారులోని ముఖ్యనేత, మరో నేత ఇద్దరు కూడబలుక్కొని భూములపై కన్నేశారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా అసైన్డ్, యూఎల్సీ, జీవో 59 పరిధిలోని భూములపై కన్నేసినట్లుగా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లుగా అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా యూఎల్‌సీకి సంబంధించి సుమారు 17వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు లెక్కలున్నాయి. జీవో 59 కింది రెగ్యులరైజ్ కోసం భారీగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే అసైన్డ్ భూములకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు, బిగ్‌బ్రదర్స్ కలిసి పేదల వద్ద తక్కువ ధరకే కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నట్టు అరోపణలున్నాయి.
ఇప్పుడు ఆ భూములకు యాజమాన్య హక్కులు కల్పించి, సమస్యల పరిష్కారం పేరుతో ఆ భూములను అధికారికంగా వారి ఖాతాలో వేసుకునేందుకు తెరవెనుక కుట్రలు రచిస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా జీవో 59 పేరుతో ఇప్పటికే ఆక్రమించుకున్న విలువైన భూములను సైతం క్రమబద్ధీకరించుకునేందుకు కుట్రలు జరుగుతున్నట్టుగా ఆరోపణలున్నాయి. దీంతోపాటు ఎల్బీనగర్ ప్రాంతంలో కోట్లు విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు జీవో 118 పరిష్కారానికి తెరతీశారనే ఆరోపణలున్నాయి. మొత్తంగా 22ఏ నిషేధిత వివాదంపై సర్కారు పెద్దల అడుగులు, మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు గమనిస్తే ఇదంతా పక్కా ప్లాన్‌తోనే, ముందస్తు కుట్రతోనే చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట రాత్రికి రాత్రే కోటికి పైగా ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. ఆ తర్వాత వాటి పరిష్కారం పేరుతో ప్రభుత్వ పెద్దల గుప్పిట్లో ఉన్న విలువైన భూములను అధికారికంగా హస్తగతం చేసుకునేందుకు ప్రణాళిక రచించి అమలు చేస్తున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు.