– SIR ప్రక్రియను నిలిపివేయాలి
– తొలగించిన అర్హుల ఓట్లను పునరుద్ధరించాలి
– అక్టోబర్ 1న వామపక్షాల ఆధ్వర్యంలో నల్లగొండలో నిరసన
– ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
రామగిరి, సెప్టెంబర్ 30 : ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవీ బాధ్యతల నుండి తొలగించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి. ఓటు హక్కు పరిరక్షణలో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని, SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, అర్హులైన పౌరుల ఓట్లను పునరుద్ధరించాలన్నారు. అక్టోబర్ 1న నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ సెంటర్లో వామపక్ష,ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం నల్లగొండలోని సిపిఐ జిల్లా కార్యాలయం మగ్దుమ్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల సంఘం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు.
పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రంలో ఓట్లను తొలగించి బిజెపి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణలోనూ SIR ప్రక్రియలో భాగంగా వివిధ కారణాలతో భారీ సంఖ్యలో ఓటర్ల వివరాలు పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలోనూ సుమారు 2 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణ చేపడుతున్నారని, తమకు అందిన సమాచారం ప్రకారం సుమారు 45 వేల మందికి నోటీసులు అందినట్లు వారు తెలిపారు. మిగిలిన వారికి నోటీసులు అందకపోవడం, విచారణ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, సిపిఐ (ఎం) జిల్లా నాయకులు హషం, పుచ్చకాయల నర్సిరెడ్డి, నల్పరాజు సైదులు, టిజెఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన నాగేశ్వరరావు,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, టి.వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి కె ఎస్ రెడ్డి పాల్గొన్నారు.