నారాయణఖేడ్, సెప్టెంబర్ 30 : కని పెంచి పెద్ద చేసిన కొడుకులు పట్టించుకోవడం లేదనే మనస్థాపంతో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కె)లో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నర్సారెడ్డి(85), అంజమ్మ(82) దంపతులకు సిద్ధారెడ్డి, కిష్టారెడ్డి, సంగారెడ్డి ముగ్గురు కొడుకులు ఉన్నారు. కిష్టారెడ్డి హైదరాబాద్లో నివాసముండగా మిగతా ఇద్దరు గ్రామంలోనే ఉంటున్నారు.
ఇదిలా ఉండగా గ్రామంలో ఉంటున్న ఇద్దరు కొడుకులు తల్లిదండ్రులను పట్టించుకోకపోగా ఇంట్లోంచి వెళ్లగొట్టారు. దీంతో కొంత కాలంగా గ్రామంలోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరి పోషణ హైదరాబాద్లో ఉంటున్న రెండవ కొడుకు కిష్టారెడ్డి చూసుకుంటున్నాడు. వృద్ధ దంపతుల పేర ఉన్న వ్యవసాయ భూమి మొదటి, మూడవ కొడుకుల పిల్లలకు రాసిచ్చినట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇద్దరు వృద్ధ దంపతులు తమ వ్యవసాయ భూమిలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బుధవారం ఉదయం ఇద్దరి మృతదేహాలను బావిలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ శ్రీనివాస్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి విచారణ జరిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.