Accident | రాంచీ: జార్ఖండ్‌కు చెందిన రాజా కుమార్ వర్మ (26), వినయ్ యాదవ్ (23) వియత్నాంలోని డా లాట్ (Da Lat) నగరంలో జరిగిన బైక్ యాక్సిడెంట్లో మరణించారు. వీరు యోగా నేర్పేందుకు జార్ఖండ్ నుంచి వియత్నాం వెళ్లారు. వీరు యోగా క్లాసులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో వీరి బైక్ బురద రోడ్డుపై జారి పడి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వర్మ అక్కడికక్కడే మరణించగా, యాదవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత మరణించారు.
రాంచీకి చెందిన రాజా కుమార్ వర్మ, జమ్‌షెడ్‌పూర్‌కు చెందిన వినయ్ యాదవ్ తమ కుటుంబాలను పోషించుకునేందుకు ఉపాధి కోసం యోగా నేర్పేందుకు రెండేండ్ల క్రితం వియత్నాం (Vietnam)కు వెళ్లారు. వీరి మృతదేహాలను భారత్‌కు తీసుకురావాలంటే సుమారు రూ. 20 లక్షల ఖర్చు అవుతుంది. దీంతో ఆ ఖర్చును భరించే స్తోమత తమకు లేదని కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై రాజా కుమార్ వర్మ తల్లి రూపా వర్మ, సోదరడు శుభం వర్మ, కుటుంబ సభ్యులు రాజ్యసభ ఎంపీ మహువా మాజీని కలిసి విన్నవించారు. ఈ విషయంపై రాంచీ డిప్యూటీ కమిషన్ మంజునాథ్ భజంత్రీతో మాట్లాడారని తెలిపారు.
వారి మృతదేహాలను జార్ఖండ్‌కు తీసుకువస్తామని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ (Sanjay Prasad Yadav) మీడియాకు వెల్లడించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, నిబంధన ప్రకారం వారికి సహాయం, పరిహారం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. విదేశాల్లో పనిచేస్తూ మరణించే వలస కార్మికుడి కుటుంబానికి జార్ఖండ్ ప్రభుత్వ పథకం కింద రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.