డీలిమిటేషన్‌కు రంగం సిద్ధం
డీలిమిటేషన్ బిల్లును కేంద్రం మరోసారి తీసుకురాబోతున్నదన్న ఊహాగానాల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలను వచ్చే వారం తిరిగి సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- 30 నుంచి లోక్‌సభ, 2 నుంచి రాజ్యసభ సమావేశాలు
- నోటిఫికేషన్ విడుదల చేసిన ఉభయ సభల అధిపతులు
- అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాల కోసమేనని ఎక్స్‌లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన
- డీలిమిటేషన్ బిల్లు కోసమేనని మీడియాలో వార్తలు
- నియోజకవర్గాల పునర్విభజనపై ఇటీవలే షా వ్యాఖ్యలు
- 15-18 ఓట్ల మార్జిన్‌తో గట్టెక్కుతామని ఆశాభావం
- నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర క్యాబినెట్ భేటీ
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): డీలిమిటేషన్ బిల్లును కేంద్రం మరోసారి తీసుకురాబోతున్నదన్న ఊహాగానాల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలను వచ్చే వారం తిరిగి సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30న లోక్‌సభ, వచ్చే నెల 2న రాజ్యసభను సమావేశపరచాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేసినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉభయ సభల సమావేశాలు డిసెంబర్ 3న ముగిసే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
ఈ మేరకు సమావేశాలపై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, ప్రైవేట్ మెంబర్ బిల్లులకు అవకాశం ఉండదని వారిద్దరూ తెలిపారు.2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ బిల్లు, ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లు (జమిలి) రెండింటికీ పార్లమెంటరీ ఆమోదం పొందాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యచరణను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా పార్లమెంటును సమావేశపరిచి డీలిమిటేషన్‌తో పాటు మహిళా బిల్లును ఆమోదింపజేయడానికి ఎన్డీయే కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి.
అందుకే షార్ట్ పీరియడ్ నోటీసు
గత ఏప్రిల్‌లో డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు.. బిల్లు ఆమోదం పొందేందుకు ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైంది. బిల్లును ప్రవేశపెట్టే సమయంలో సభలో 528 మంది సభ్యులు ఉన్నారు. అంటే కావాల్సిన మెజారిటీ 352. బిల్లుకు 298 మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. ఫలితంగా అవసరమైన సంఖ్యాబలం దక్కకపోవడంతో సభలో ఆ బిల్లు వీగిపోయింది. అయితే, వివిధ రాష్ర్టాల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుకు అవసరమైన మద్దతు కూడగట్టొచ్చన్న భావనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది. దీన్ని ధ్రువపరుస్తూ ఇటీవలే కేంద్రహోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కావాల్సిన మెజారిటీ కంటే తమకు 15-18 ఓట్లు ఎక్కువగానే ఉన్నట్టు ఓ అంతర్గత మీడియా భేటీలో పేర్కొన్నారు. డీలిమిటేషన్ బిల్లు ద్వారా ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను గరిష్ఠంగా 850కి పెంచాలని కేంద్రం భావిస్తున్నది. ఈ ఏడాది ఆగస్టు 13న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, సమావేశాలను అధికారికంగా ముగించినట్లు (ప్రొరోగ్) ప్రకటించలేదు. 106 రోజులు గడిచినా ఇప్పటివరకూ ఆ ప్రకటన రాలేదు. ప్రొరోగ్ చేయని సందర్భంలో సమావేశాల కాలాన్ని పొడిగించాలన్నా లేదా ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలన్నా కనీసం 48 గంటల ముందు సభ్యులకు నోటీస్ ఇస్తే సరిపోతుంది. ఈ క్రమంలోనే స్వల్పకాల వ్యవధి ఉండగానే కేంద్రం నుంచి ఇప్పుడు ఈ ప్రత్యేక సమావేశాల ప్రకటన వచ్చినట్టు తెలుస్తున్నది.
ప్రత్యేక మెజార్టీ అవసరం
డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అలా రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టే బిల్లులకు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. సభలో సభ్యుల హాజరు సగానికి (50%) పైగా ఉండాలి. హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆ బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 540 మంది ఎంపీలు సభకు హాజరైతే.. వారిలో 361 మంది తప్పనిసరిగా బిల్లుకు మద్దతు తెలపాలి. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభ ముందుకు వస్తుంది. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 244 మంది సభ్యులు సభకు హాజరైతే.. 163 మంది బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా మారుతుంది. అధికార ఎన్డీయేకి ఉభయ సభల్లో ఇప్పుడు అంత బలం లేదు.
ఎన్డీయే బలమెంత??
లోక్‌సభలో ఎన్డీయేకి ప్రస్తుతం 319 (20 మంది టీఎంసీ ఎంపీలు, ఆరుగురు శివసేన ఎంపీలతో కలిపి) మంది సభ్యుల మద్దతు ఉంది. శరద్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ-ఎస్పీ)కి చెందిన 8 మంది ఎంపీలు కూడా బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే, బలం 327కు చేరుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి నుంచి డీఎంకే బయటకు వచ్చింది. ఆ పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నారు.
ఒకవేళ, ఆ పార్టీ బిల్లుకు మద్దతు ఇస్తే, ఎన్డీయే బలం 349కి చేరుతుంది. అయినప్పటికీ, బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కేంద్రానికి మరో 12 ఓట్లు అవసరమవుతాయి. బిల్లు ప్రవేశపెట్టే రోజున సభకు హాజరయ్యే సభ్యుల సంఖ్య, తటస్థ పార్టీలతో సంప్రదింపులతో పాటు క్రాస్‌ఓటింగ్ తమకు కలిసివచ్చే అవకాశమున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కాగా, రాజ్యసభలో ఎన్డీయేకు 151 మంది సభ్యుల మద్దతు ఉంది.
విపక్షాల డిమాండ్ ఏంటి?
నిర్దేశిత బిల్లులకు తమ మద్దతు ప్రకటించాలంటే తమ నాలుగు డిమాండ్లకు కేంద్రం ఒప్పుకోవాలని ఇండియా కూటమి, ఆప్ తదితర పక్షాలు చెప్తున్నాయి. ప్రతిపక్షాల డిమాండ్ల ప్రకారం.. ప్రస్తుతం లోక్‌సభ స్థానాలను 543గానే కొనసాగిస్తూనే, అన్ని రాష్ర్టాల అసెంబ్లీ స్థానాలను యథావిధిగా ఉంచాలి. 2023లోని నారీశక్తివందన్ అభియాన్ (మహిళా రిజర్వేషన్లు)ను ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లోని 182 సీట్లలో అమలు చేయాలి. వచ్చే 25 ఏండ్లపాటు ఇది ఇలాగే కొనసాగేలా రాజ్యాంగ సవరణ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే, సదరు బిల్లులకు మద్దతు ప్రకటిస్తామని తేల్చి చెప్తున్నాయి. కాగా, ఈసారి మహిళా రిజర్వేషన్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదింపజేసుకొంటామని ఓ సభలో అమిత్ షా తేల్చిచెప్పారు.
డైవర్షన్ డ్రామానా?
ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకొచ్చిన ‘సర్’ ప్రక్రియపై ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రజా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతుండడం, తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనడం, అంతర్జాతీయ రాజకీయాలలో పెనుమార్పులు, వాతావరణ మార్పును నిరోధించడంపై కీలక చర్చలు విఫలమవడం వంటి సమస్యలతో దేశమంతా అల్లకల్లోలంగా మారింది. ఇలాంటి సమయంలో డీలిమిటేషన్ బిల్లును కేంద్రం మళ్లీ చర్చలోకి తీసుకురావడంపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల నుంచి ప్రజలు, పార్టీల దృష్టి మరల్చడానికే ఈ డైవర్షన్ డ్రామాకు తెరతీసిందని అభిప్రాయపడుతున్నారు. అందుకే, పార్లమెంట్లో స్పష్టమైన మెజార్టీ సాధించకుండానే మళ్లీ ఇలాంటి డీలిమిటేషన్ పాట పాడుతున్నదని చెప్తున్నారు.
నేడు కేంద్ర క్యాబినెట్ భేటీ
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర క్యాబినెట్ భేటీ జరుగనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో డీలిమిటేషన్‌పై ప్రత్యేకంగా చర్చించనున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు, ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం కూడా జరుగనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
గుడ్డిగా వ్యతిరేకించడం తగదు:సూలే
మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుపై ఎన్సీపీ(ఎస్పీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే మెతక వైఖరిని ప్రదర్శించారు. ఆ బిల్లు వివరాలు తెలియకముందే దాన్ని వ్యతిరేకించడం తొందరపాటు అవుతుందని ఆమె అన్నారు. డీలిమిటేషన్ కోసం ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విపక్షాలు విస్తృతంగా వ్యతిరేకత తెలుపుతున్న తరుణంలో ఆమె నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
‘ముందు ఈ బిల్లు రానివ్వండి. బహుశా డీలిమిటేషన్ బిల్లులో మంచి విషయాలు ఏమైనా ఉండవచ్చు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఒక బిల్లు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా కేవలం ప్రతిపక్షంలో ఉన్నామన్న కారణంతో దాన్ని వ్యతిరేకించడం లేదా అధికారంలో ఉన్నామన్న కారణంతో గుడ్డిగా సమర్థించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి తగదు. ప్రతి విషయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఆ బిల్లులో మంచి అంశాలు కూడా ఉండవచ్చు అని సూలే అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

