ఒక నాయకుడి సంకల్పం..
ఒక నాయకుడి సంకల్పం.. కోట్లాది ప్రజల ఆకాంక్ష.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బాటలు వేసిన నవంబర్ 29.. పదవులను తృణప్రాయంగా వదిలి ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానం.. ప్రతికూలతలను అధిగమిస్తూ సాగిన అలుపెరుగని పోరాటం..
- నాలుగు కోట్ల ప్రజల స్వప్నం సాకారం
- నవంబర్ 29.. ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర
- చరిత్రను మలుపుతిప్పిన కేసీఆర్ నిరాహార దీక్ష
- ఆకాంక్ష నెరవేరే వరకు అలుపెరుగని పోరాటం
- 29న కరీంనగర్లో దీక్షా దివస్ బహిరంగ సభ
కరీంనగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒక నాయకుడి సంకల్పం.. కోట్లాది ప్రజల ఆకాంక్ష.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బాటలు వేసిన నవంబర్ 29.. పదవులను తృణప్రాయంగా వదిలి ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానం.. ప్రతికూలతలను అధిగమిస్తూ సాగిన అలుపెరుగని పోరాటం.. కేంద్రం మెడలు వంచిన నిరాహార దీక్ష.. ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన కేసీఆర్ నాయకత్వ పటిమ.. అమరుల త్యాగాలు, ప్రజల సమష్టి పోరాటంతో సాకారమైన తెలంగాణ స్వప్నం.. నేటి తరానికి అందించాల్సిన ఉద్యమ స్ఫూర్తి లక్ష్యంగా ఈ నెల 29న కరీంనగర్లో దీక్షా దివస్ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహిస్తున్నది.
ఈ సభకు ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతుండగా, సభను విజయంతం చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకత్వం పనిచేస్తున్నది. నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగినా.. ఒక్క కేసీఆర్ నాయకత్వమే గమ్యాన్ని ఎలా ముద్దాడింది? మిగిలిన ఉద్యమాలు, పోరాటాలు ఎందుకు ఆ ఆకాంక్షను మధ్యలోనే వదిలిపెట్టాయి? ఇక్కడే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కేసీఆర్ అసలు చతురత ఉంటుంది.
చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే.. గత ఉద్యమాలకు కేసీఆర్ చేసిన పోరాటాలకు ఎంతో తేడా ఉన్నది. ఒక్కడిగా బయలుదేరి సబ్బండ వర్గాలను సమీకృతం చేసి సాధించిన తెలంగాణ మనకు కనిపిస్తున్నది. జాతీయ రాజకీయాలను ఒక్క వేదిక మీదికి తెచ్చిన రాజకీయ చతురత.. తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగం.. రాష్ట్ర సాధన కోసం నిర్బంధాలను ఎదిరించిన ధీరత్వం కనిపిస్తున్నది. పరాజయాలు, రాజకీయ విమర్శలు, ప్రతికూలతలు ఆరోగ్యకరమైన ముప్పు ఏర్పడినా సాగించిన పోరు ఆయన రాజీలేని సంకల్పాన్ని సూచిస్తున్నది.
ఉద్యమాలు జరిగినా.. నెరవేరని రాష్ట్ర ఆకాంక్ష
1956 నవంబర్ ఒకటిన తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినప్పుడు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పెద్దమనుషుల ఒప్పందం జరిగింది. ఉద్యోగాలు, విద్య, నిధులు, ప్రాంతీయ అభివృద్ధి వంటి అంశాల్లో రక్షణలు కల్పిస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదన్న అసంతృప్తి క్రమంగా పెరిగింది. తెలంగాణకు రావాల్సిన నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, వనరుల వినియోగంలో అన్యాయం జరుగుతున్నదన్న భావన ప్రజల్లో బలపడింది. ఈ పరిణామాలే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు పునాదులయ్యాయి. 1969లో ఆ అసంతృప్తి పెద్ద ఉద్యమంగా విస్ఫోటనం చెందింది.
ఈ ఉద్యమానికి రాజకీయ రూపం కల్పించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రజాసమితి ఏర్పడింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని 14 స్థానాల్లో 10 స్థానాలను గెలుచుకొని ప్రజాసమితి తన రాజకీయ బలాన్ని చాటింది. అనంతర పరిణామాల్లో ప్రజాసమితి కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఉద్యమం క్రమంగా బలహీనపడింది. ఆ తర్వాత తెలంగాణ జనసభ, విద్యార్థి సంఘాలు, మేధావుల వేదికలు, సాంస్కృతిక సంస్థలు తమవంతు ప్రయత్నాలు కొనసాగించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (టీఎల్‌ఎస్వో) తెలంగాణ ఫోరం (టీఎఫ్ఎస్) వంటి విద్యార్థి వేదికలు, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాలు ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. అయినా ఆ ఆకాంక్షను నేరవేర్చలేకపోయాయి.
ఒక పార్టీ ఆవిర్భావం.. ఉద్యమానికి కొత్త దిశ
నాలుగు కోట్ల ప్రజల అవసరాన్ని, ఆకాంక్షను గుర్తించిన కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా ఉన్న ఆయన, ఆ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్)ను స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ సాధనే పార్టీ ఏకైక లక్ష్యమని ప్రకటించారు. అప్పటికే ఉన్న రాజకీయ పదవులు, అవకాశాలను పక్కనపెట్టి కొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టడం ఆయనలోని రాష్ట్ర సాధన సంకల్పానికి నిదర్శనంగా ఆ నాటి మేధావులు పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వాన్ని తీసుకున్నారు. తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, ఉద్యమకారులు ఉద్యమానికి మేధోపరమైన, సాంస్కృతిక బలాన్ని సమకూర్చడంలో కేసీఆర్ ముఖ్యభూమిక పోషించారు.
పదవుల కంటే రాష్ట్ర సాధనే పరమావధి
కేసీఆర్ ఉద్యమ ప్రస్థానంలో అత్యంత ప్రత్యేకమైన అంశం.. తెలంగాణ సాధన కోసం రాజకీయ పదవులను, అధికార అవకాశాలను కూడా సాధనాలుగానే పరిగణించడం. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో ఆశించిన పురోగతి లేకపోవడంతో 2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. కరీంనగర్ లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడం తెలంగాణ వాదానికి ప్రజల్లో ఉన్న బలాన్ని చాటింది. 2008లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఆశించిన ఫలితాలు పూర్తిస్థాయిలో రాకపోయినా తెలంగాణ డిమాండ్‌ను రాజకీయ ఎజెండా నుంచి తొలగించనివ్వలేదు. 2009 ఎన్నికల్లోనూ పార్టీకి ఎదురైన రాజకీయ సవాళ్లను అధిగమిస్తూ ఉద్యమాన్ని కొనసాగించారు. రాష్ట్ర సాధన విషయంలో రాజీపడకుండా, పట్టుదలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు.
ప్రాణాలను పణంగా పెట్టిన పోరాటం
2009 నవంబర్ 29 తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని, పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్ష ప్రారంభానికి ముందే తన నిర్ణయాన్ని రాష్ట్రపతికి తెలియజేసి, నవంబర్ 29 నుంచి నిరాహార దీక్ష చేపడుతానని ప్రకటించి, దీక్షకు బయలుదేరిన ఆయనను మార్గమధ్యంలో అలుగునూర్ వద్ద పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. నిరసనను అణచివేయాలన్న ఉద్దేశంతో జరిగిన అరెస్టు.. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. దీక్ష ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
తొలుత దీక్షకు సంబంధించి కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నా, తెలంగాణ ప్రజల ఒత్తిడి, ఉద్యమకారుల ఆందోళనల మధ్య ఆయన దీక్షను కొనసాగించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ అంతటా ఆందోళన వ్యక్తమైంది. ఒక నాయకుడు చేపట్టిన నిరాహార దీక్ష.. కొద్ది రోజుల్లోనే కోట్లాది ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా మారింది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్న కొద్దీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. చివరకు 2009 డిసెంబర్ 9న అర్ధరాత్రి అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో తెలంగాణ అంతటా సంబురాలు మిన్నంటాయి. కేసీఆర్ దీక్ష విరమించారు. నవంబర్ 29న ప్రారంభమైన కేసీఆర్ దీక్ష.. డిసెంబర్ 9న కేంద్ర ప్రకటనకు దారితీయడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది.
కేసీఆర్‌కే ఎలా సాధ్యమైంది?
ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం, ఉద్యమానికి ఒక నిర్దిష్ట రాజకీయ కేంద్రాన్ని కల్పించడం, రాష్ట్ర సాధన అంశాన్ని ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంచడంలో ఒక స్పష్టమైన లక్ష్యం కనిపించింది. ఒకసారి ఉద్యమం చేసి విరామం తీసుకునే విధానానికి భిన్నంగా.. సభలు, సమావేశాలు, నిరసనలు, రాజీనామాలు, దీక్షలు, రాజకీయ ఒత్తిళ్లతో ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించడం వెనుక నిరంతర పోరాటం స్ఫూర్తి కనిపించింది. ముఖ్యంగా నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమంపై ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలువడం వెనుక కేసీఆర్ రాజీలేని సంకల్పాన్ని చాటింది. చివరకు 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ, ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందింది. మార్చి ఒకటిన రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చింది. 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఆవిర్భవించింది. దశాబ్దాల పోరాటం ఫలించి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది.
దీక్షా దివస్.. తరతరాలకు అందించాల్సిన స్ఫూర్తి
నిజానికి నవంబర్ 29న కేవలం ఒక రాజకీయ కార్యక్రమంగా లేదా ఒక పార్టీకి సంబంధించిన రోజుగా చూడొద్దని మేధావులు చెప్తున్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష.. తెలంగాణ ఉద్యమాన్ని దేశవ్యాప్త చర్చలోకి తీసుకెళ్లింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడానికి దారితీసిన ఒత్తిడిని సృష్టించింది. నేటి తరంలో చాలామంది తెలంగాణ ఏర్పడిన తర్వాతే పుట్టి పెరిగారు. వారికి రాష్ట్ర సాధన వెనుక ఉన్న పోరాటాల తీవ్రత, విద్యార్థులు ఎదుర్కొన్న కష్టాలు, ఉద్యోగులు చేసిన త్యాగాలు, ఉద్యమకారుల నిర్బంధాలు, అమరుల బలిదానాలు పూర్తిస్థాయిలో తెలియకపోవచ్చు. అందుకే ఈ చరిత్రను నేటితరానికి తెలుపాలన్న లక్ష్యంతోనే.. ఈ నెల 29న దీక్షా దివస్ పేరుతో కరీంనగర్లో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహిస్తుండటం స్పూర్తి దాయకమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం వెనక్కి తగ్గినా.. ముందుకు సాగిన ఉద్యమం
డిసెంబర్ 9 ప్రకటనతో తెలంగాణ సాధన పూర్తయినట్టు భావించిన తరుణంలోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర నిరసనలు, ప్రజాప్రతినిధుల రాజీనామాలు, రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో కేంద్రం మాట మార్చింది. డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసింది. అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉన్నదని తెలుపడంతో తెలంగాణ ప్రజల్లో తీవ్ర నిరాశ, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కేంద్రం వెనక్కి తగ్గినప్పటికీ కేసీఆర్ ముందుకుసాగారు.
ఉద్యమం మరింత విస్తృత రూపం దాల్చేందుకు వ్యూహ రచన చేశారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (టీజేఏసీ) ఏర్పాటు చేశారు. అక్కడితో ఆపకుండా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలను ఒకే వేదికపైకి తెచ్చారు. కేసీఆర్ సూచనల మేరకు జరిగిన మిలియన్ మార్చ్, రైల్ రోకోలు, వంటావార్పులు, నిరసనలు ఉద్యమానికి కొత్త ఊపునిచ్చాయి. 2011 సెప్టెంబర్ 13న ప్రారంభమైన సకల జనుల సమ్మె 42 రోజులపాటు కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ సిబ్బంది, న్యాయవాదులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారిని ఉద్యమంలో భాగస్వాములు చేయడంలో కేసీఆర్ విజయం సాధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

