YouTuber : యూట్యూబర్ రమానందన పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్గా మారింది. సెప్టెంబర్ 7న తన జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పోస్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారని రమానందనపై ఆరోపణలు ఉన్నాయి.
ఓ బాధితుడు యూకే ఉద్యోగం కోసం సుమారు రూ.15 లక్షలు చెల్లించానని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్లోని ఇబ్రహీంపట్నం పోలీసులు లుకవుట్ సర్క్యులర్ జారీచేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 7న హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను గుర్తించి ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు.
ప్రధానంగా ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ వ్యవహారాలపైనే ఆమెను ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అయితే ఈ కన్సల్టెన్సీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దాని వ్యవహారాలన్నీ తన భర్త మధుకర్ చూసుకుంటారని నందన గతంలోనే చెప్పారు. తనపై తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తాజా పోస్టులో ఆమె కేసు వివరాలను ప్రస్తావించకుండా.. సెప్టెంబర్ 7న తాను నేలపై కాలుమోపినప్పుడు నా జీవితంలో కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నా’ అని మాత్రమే పేర్కొన్నారు.