ఒక చిన్నారి దుస్తులపై కనిపించిన రక్తపు మరక.. ఓ పెద్ద మార్పునకు నాంది పలికింది. పీరియడ్స్ వచ్చినప్పుడు శానిటరీ ప్యాడ్ ఉపయోగిస్తున్నావా అని అడిగితే.. ఆ అమ్మాయి అసలు అదేమిటో కూడా తెలియదు అంది. డబ్బులు లేక పాత దుస్తులతోనే రుతుక్రమాన్ని నెట్టుకొస్తున్నామని ఆమె తల్లి చెప్పింది. తన పనిమనిషి, ఆమె కూతురు చెప్పిన ఈ సమాధానాలు ఢిల్లీకి చెందిన పదహారేండ్ల ఖ్యాతి గుప్తాను కదిలించాయి. ఆమెకు సహజంగా అందుబాటులో ఉన్న కనీస సౌకర్యం ఎంతోమంది బాలికలకు ఎందుకు అందడం లేదన్న ప్రశ్నతో ఆమె తండ్రి అరుణ్ గుప్తాను చేరింది. వాళ్ల ఆలోచన ఫలితంగా పుట్టిందే పింకిషే ఫౌండేషన్. రుతుక్రమ పరిశుభ్రత, అవగాహన, గౌరవం కోసం దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యమంగా ఇది కొన్ని లక్షల మంది మహిళలకు చేరువైంది.
కొన్ని సమస్యలు మాట్లాడుకోగలిగేవి ఉంటాయి. వాటి కోసం పోరాటాలు కూడా జరుగుతాయి. వాటి పరిష్కారాల కోసం నిధులు వెచ్చిస్తారు కూడా. కానీ మరికొన్ని సమస్యలు కనీసం చర్చించలేనివి ఉంటాయి. అలాంటి వాటిలో మహిళలకు సంబంధించి రుతుక్రమం ముందు స్థానంలో ఉంటుంది. ఆ సమయపు పరిశుభ్రత, అవసరాలు అన్నీ గోప్యమే. దాన్ని ఆరోగ్యంగా దాటేందుకు రూపాయి వెచ్చించే పరిస్థితీ, వెచ్చించాలన్న దృక్పథం ఉండదు. ఇవన్నీ కలగలిసి పేద కుటుంబాల్లో ఆడవాళ్లకు నెలసరి శాపంగా మారుతున్నది.
ఈ విషయాన్ని పదహారేండ్ల వయసులో తన పనిమనిషి ద్వారా తెలుసుకున్న ఖ్యాతి ఊరికే ఉండలేకపోయింది. అలాంటి వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో 2017లో తన తండ్రితో కలిసి పింకిషే ఫౌండేషన్‌ను ప్రారంభించింది. దాని ద్వారా ఈ తొమ్మిదేండ్ల కాలంలో దేశ వ్యాప్తంగా దాదాపు 70 లక్షలకు పైగా ప్యాడ్లు పంపిణీ చేసింది. వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలతో చేయి కలిపి పన్నెండు లక్షల మందికి పైగా చేరువైంది. దేశవ్యాప్తంగా 29 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 150 జిల్లాల్లో వలంటీర్ల ద్వారా ఈ సంస్థ పనిచేస్తున్నది. వివిధ అవార్డులు సొంతం చేసుకుని నెలసరి సమస్యల కోసం పోరాడే ఎన్జీవోల వరుసలో ముందంజలో నిలిచింది. ఈ నెలసరి అవగాహన, సాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పీరియడ్ బ్యాంక్, పింక్ టాక్, శక్తిశాల పేర్లతో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది.

ఖ్యాతి వాళ్ల నాన్న అరుణ్ గుప్తాతో ఈ విషయాన్ని పంచుకుంది. ఆయన ఐబీఎమ్, డెల్లాంటి ఐటీ సంస్థల్లో సుమారు రెండు దశాబ్దాలు పనిచేశారు. కూతురు చెప్పిన విషయం నిజంగా ఆలోచించ దగ్గదే అనుకున్నాడు. ఆ దిశగా కూతురితో కలిసి కొన్ని ప్రణాళికలు వేశారు. తొలిగా ఒక ఫేస్బుక్ పేజీని తెరిచారు. కేవలం ఆరు నెలల్లో దానికి 2 లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 50 చోట్ల వలంటీర్ల సాయంతో క్షేత్ర స్థాయిలో పనిచేసే పింక్ సర్కిల్స్‌ను ప్రారంభించారు. మెడికల్ షాపుల ముందు నిలబడి అందులోకి వెళ్లే వాళ్లని శానిటరీ ప్యాడ్లు దానం చేయమని అడిగేవారు ఇందులో పనిచేసేవారు. వాటిని తీసుకెళ్లి ఆ ప్రాంతం చుట్టు పక్కల ఉన్న మురికివాడల్లో పంచేవారు. అంతేకాదు, పాత పేపర్లు దానం చేయమని కూడా అడిగేవారు. ‘కాగజ్ కీ ప్యాడ్’ పేరుతో రూపొందించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇళ్లు, కార్యాలయాల్లోని పాత పేపర్లని వలంటీర్లు జమ చేస్తారు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ప్యాడ్లు కొని పేదలకు పంచి పెడతారు.
పింకిషే చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్యాడ్ బ్యాంక్ ఒకటి. ప్యాడ్లు కొనలేని బాలికలు, మహిళలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించడం దీని ప్రధాన ఉద్దేశం. పాఠశాలలు, అవసరమైన ప్రాంతాల్లో ప్యాడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడంతో పాటు, కొన్ని చోట్ల ప్యాడ్ విక్రయ యంత్రాలను కూడా పెడుతున్నారు. అంతే కాదు, శానిటరీ న్యాప్కిన్లను సరిగ్గా ఎలా ఉపయోగించాలి… అనే విషయాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు.
పీరియడ్స్ గురించి తల్లిదండ్రులతో మాట్లాడటానికి సంకోచించే బాలికలు చాలామంది. పాఠశాలలో తమ సందేహాలను అడగడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ మౌనాన్ని తొలగించేందుకు పింకిషే చేపట్టిన కార్యక్రమం సఖి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులకు రుతుక్రమ ఆరోగ్యంపై శిక్షణ ఇచ్చి.. విద్యార్థినులకు సరైన సమాచారాన్ని అందించేలా తీర్చిదిద్దుతున్నారు. వాళ్లే ఇక్కడ సఖి… అన్నమాట. రుతుచక్రం ఎలా జరుగుతుంది? పీరియడ్స్ సమయంలో ఎలాంటి పరిశుభ్రత పాటించాలి? ఏవి అపోహలు? ఏవి వాస్తవాలు? లాంటి విషయాలను బాలికలకు సులభంగా అర్థమయ్యేలా వీళ్లు వివరిస్తారు.

శక్తిశాల కార్యక్రమం ద్వారా ఒక పాఠశాలను ఎంచుకుంటారు. అక్కడి నుంచి జిల్లా మొత్తం మీద రుతుక్రమ ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తారు. తాజా వివరాల ప్రకారం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లోని ఆరు జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను మార్గదర్శకులుగా, విద్యార్థినులను ‘సఖి’లుగా తీర్చిదిద్దుతున్నారు. ప్యాడ్ బ్యాంకులు, ప్యాడ్ విక్రయ యంత్రాలతో పాటు ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నారు.
ముఖ్యంగా.. పీరియడ్స్ కేవలం అమ్మాయిల విషయం కాదని అబ్బాయిలకూ చెప్పేలా నాటకాల్లాంటివి రూపొందించి ప్రదర్శిస్తారు. అలాగే పింక్ టాక్ పేరిట… నెలసరి గురించి అవగాహన కల్పించేలా, ఆలోచనలు పంచుకునేలా టాక్‌షోను కూడా నడుపుతున్నారు. నిజమే, అసలు దాని గురించి మాట్లాడటం మొదలైతే, మార్పు మొదలైనట్టే మరి! అందుకే, పింకిషే ఫౌండేషన్ ప్రయాణం కేవలం ప్యాడ్ల పంపిణీ కథ కాదు.. ఒకప్పుడు మౌనంగా దాచిన అంశాన్ని ఆరోగ్యం, గౌరవం, హకుల గురించి బహిరంగంగా మాట్లాడే స్థాయికి తీసుకువచ్చిన మార్పు కథ.