యాదాద్రి భువనగిరి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : పేదల పొట్ట కొట్టడం కాంగ్రెస్ సర్కార్కు అలవాటుగా మారింది. దశాబ్దాలుగా ఉం టున్న ఇండ్లు, భూములపై హస్తం ప్రభుత్వం కన్ను పడింది. ఏ ప్రభుత్వమూ చేయని దాష్టీకాన్ని ఒడిగట్టి జనం నోట్లో మట్టికొట్టింది. కనీసం నోటీసు లేకుండా ఉన్నపళంగా నిషేధిత జాబితాలో పొందుపర్చింది. వేలాది ఇండ్లు, భూములను పీవోబీలో చేర్చి జనం గుండెల్లో గునపం దించింది. ఆరు నెలలైనా కనీసం పేదలకు న్యాయం చేసేలా ఒక్క చర్య కూడా తీసుకోకుండా జనం ఉసురు తీసుకుంటున్నది. శుష్కప్రియాలు, శూన్య హస్తాలు అన్న చందంగా హస్తం సర్కారు వ్యవహరిస్తుండటంతో జనం దుమ్మెత్తిపోస్తున్నారు.
ఆస్తుల బదిలీ నిలిపివేత..
కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ సర్కార్ ఈ దాష్టీకానికి ఒడిగట్టింది. నాలుగైదుసార్లు చేతులు మారిన ఇండ్లు సైతం పీవోబీలో చేర్చారు. అప్పులు చేసి కొన్న ఇండ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో పెట్టడంతో పేదల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అవసరార్థం అమ్ముకోలేని దుస్థితికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణమైంది. ఇండ్లు, భూములపై హక్కులు లేకుండా దాష్టీకాన్ని ప్రదర్శించింది. ఈ జాబితాలో చేర్చిన ఆస్తులకు ఎలాంటి బదిలీలు, సేల్ డీడ్లు, రిజిస్ట్రేషన్లు చేయకుండా నిలిపేసింది. ఏదైనా ఆరోగ్య సమస్యలు, ఇంట్లో ఆడ బిడ్డల పెండ్లిళ్లు, పిల్లల చదువులకు విక్రయించడమో లేదా బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకునే వీలు లేకుండా చేసింది.
చెప్పులరిగేలా తిరిగినా..!
ఒక్కో పైసా వెనకేసుకొని కొన్న ఇండ్లు, భూములను నిషేధిత జాబితాల్లో చేర్చడంతో జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పీవోబీలో పెట్టడంతో ఆస్తుల విలువ పడిపోయే అవకాశం ఉండటంతో టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లోనే స్థానిక గ్రామాల ప్ర జలు ఆందోళన బాట పట్టారు. రోడ్డెక్కి ధర్నా లు, నిరసనలు చేపట్టారు. భువనగిరి మండలంలోని వడాయిగూడెంలో లాంటి గ్రామాలకు గ్రామాలే పీవోబీలో చేర్చడంతో ఊరి జనమంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. తాసీల్దార్ మొదలుకొని కలెక్టర్ వరకు వినతిపత్రాలు అందజేశారు. అయినప్పటికీ ప్రభు త్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
హైలెవల్ కమిటీ ఏమాయే..?
యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు ఇతర చోట్ల భూములు, ఇండ్లు నిషేధిత జాబితాలో చేర్చడంపై ప్రభుత్వం అప్పట్లోనే స్పందించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చ జరిగింది. ఓ సభ్యు డు అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానమిచ్చారు. “బాధితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిషేధిత జాబితా అంశంపై రెండు, మూడు రోజుల్లో హైలెవల్ కమిటీ వేస్తాం” అని ప్రకటించారు. మంత్రి చెప్పి.. ఐదారు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు కమిటీ పత్తాలేదు. ఇతర రాష్ర్టాల్లో విధివిధానాలను అధ్యయనం చేసి, మంత్రి మండలిలో చర్చిస్తామని, ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసినా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో..
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసింది. ప్రభుత్వ భూముల్లో కొంత విస్తీర్ణాన్ని కాలనీలు, బస్తీలకు కేటాయించింది. ప్రభుత్వ స్థలాలు లేని చోట్ల ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేసి వేలాది మంది పేదలకు పంపిణీ చేసింది. వీటిల్లో పేదలు ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నారు. కొందరు అవసరాల నిమిత్తం అమ్ముకున్నారు. ఈ క్రమంలో చాలా మేరకు ఇండ్లు పలుమార్లు చేతులు మారాయి. స్థానికంగా ఉండే పేదలు, ఇతరులు కొనుగోలు చేయడం, అమ్మడం వంటివి జరిగాయి. దీంతో ఇంటి నంబర్లు, విద్యుత్తు, నల్లా, బోర్లకు అనుమతులు తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఈ ఇండ్లను సెక్షన్ 22ఏలో చేర్చారు. దీంతో ప్రభుత్వం పంపిణీ చేసిన సర్వే నంబర్లలోని స్థలాలు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయాయి. ఇవే కాకుండా కొన్ని చోట్ల ప్రైవేట్ స్థలాల్లోని ఇండ్లు కూడా ఈ జాబితాలో చేరాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 39,648 ఇండ్లు, 28,549 ఎకరాలు పీవోబీలో పొందుపరిచారు. ఇది అప్పట్లోనే పెను సంచలనంగా మారింది. అత్యధికంగా భువనగిరిలో 5వేల ఇండ్లు, తుర్కపల్లిలో 4803 ఇండ్లను 22ఏలో చేర్చారు.