రామగిరి, సెప్టెంబర్ 24 : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (MGU)లో విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. యూనివర్సిటీలో అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి విద్యార్థులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇంటిగ్రేటెడ్ ఐఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న నితిన్ అనే విద్యార్థికి కుడి కాలు విరిగింది. దీంతో చికిత్స కోసం అతడిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదే ఉద్యోగి గతంలోనూ మద్యం మత్తులో యూనివర్సిటీకి వచ్చిన ఘటనపై అధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం. తాజా ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, సెక్యూరిటీ ఆఫీసర్‌ను విధుల నుండి తొలగించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.