వెంగళరావునగర్, ఆగస్టు 4 :ప్రేమ వివాహం చేసుకున్న భార్య తన గత వివాహాల విషయాన్ని దాచిపెట్టి మోసం చేసిందని,బంగారం,నగదు తీసుకెళ్లడంతో పాటు బెదిరింపులకు పాల్పడిందంటూ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన గోసుల లోవ మణికంఠ స్వామికి మెదక్ జిల్లాకు చెందిన సునీత అనే మహిళతో పరిచయం ఏర్పడి,అది ప్రేమగా మారడంతో 2017 ఏప్రిల్ లో ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నారు.
వివాహం అనంతరం కొంతకాలం సజావుగా సంసారం సాగింది. తర్వాత సునీత తన సంపాదన మొత్తాన్ని ఖర్చు చేయడంతో పాటు తన పేరుతో రుణాలు కూడా తీసుకునేలా చేసిందని తన ఇంటి నుంచి సుమారు 10 తులాల బంగారం,రూ.2 లక్షల నగదు తీసుకెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను బెదిరించడంతో పాటు తప్పుడు కేసుల్లో ఇరికిస్తానంటూ భయపెట్టిందని ఆరోపించారు.
తనను వివాహం చేసుకునే ముందు గత వివాహాల విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి మోసం చేసిందని, తర్వాత తన పై మెయింటెనెన్స్,గృహహింస తదితర కేసులు నమోదు చేయించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం మధురానగర్ పోలీసులు భార్యతో పాటు మరో ముగ్గురి పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.