నిజామాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిరుద్యోగుల ఆశలను కాంగ్రెస్ సర్కార్ తుంచేస్తోంది. నేడు, రేపు అంటూ 27 నెలలుగా మాయ మాటలు చెబుతూ వస్తోన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ జారీ కాలేదు. గత ప్రభుత్వంలో వెలువడిన ఉద్యోగ నియామక ప్రక్రియనే కొనసాగించి చేతులు దులుపుకున్నది. తూతూ మంత్రంగా వివిధ కార్పొరేషన్లలో ఒకట్రెండు నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ వాటికి అతీగతీ లేకుండా పోయింది. కాంగ్రెస్ హయాంలో కేసీఆర్ జారీ చేసిన నోటిఫికేషన్లకు ఫలితాలు అందించి తమ ఘనతగానే డాంభికాలు చెప్పుకుంటోంది.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటుగా సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సైతం 70వేల ఉద్యోగాలిచ్చామంటూ ప్రచారం చేసుకుంటూ నిరుద్యోగ యువతను గందరగోళంలో నెట్టి వేస్తున్నాడు. అధికారంలోకి వస్తే టీజీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చింది. తెలంగాణ అంతటా ఎన్నికల ప్రచారంలో యూత్‌ను ఆకట్టుకునేందుకు లేనిపోని అవాస్తవాలు రంగరించి చెప్పింది. సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినప్పటికీ అతీగతీ లేదు. ప్రశ్నిస్తే దాడులు, పోలీస్ కేసులతో పాటుగా నిరుద్యోగులను జైళ్లకు పంపుతూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలపై యువత తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరో ఆర్థిక సంవత్సరం కాల గర్భంలో కలువనుంది. 2025-26లో నిరుద్యోగ భర్తీ లేకుండానే ముగింపునకు చేరింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం జాబ్ క్యాలెండర్ అనుసరించి 13 నుంచి 20 నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ జారీ కాలేదు. నియామకాలు లేకపోవడం వల్ల పరోక్షంగా ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం జరుగుతోంది. వారికి రావాల్సిన ప్రమోషన్లు ఆగి పోతున్నాయి.
నిరుద్యోగ భృతి విధానాన్ని రూపొందించడంలోనూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడం లేదు. ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతిని అందిస్తామని హామీ ఇచ్చింది. ఏడు జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్సైంజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. స్కిల్ సెంటర్ల ఏర్పాటు పత్తా లేదు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ధ్యేయం ఆచరణకు దూరంగా ఉండిపోయింది. విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు, రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణాల భరోసా వంటి హామీలు నీటిపై రాతల్లాగా మారాయి.
ప్రతి విద్యార్థికి రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ఉచిత వైఫై, యూనివర్సిటీల రీసెర్చ్ స్కాలర్స్‌కు నెలకు రూ.10వేల ఫెలోషిప్ వంటి హామీల అమలుపై నీలినీడ అలుముకుంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందడంలో ఆలస్యం, క్యాడర్ స్ట్రెంత్ విభజనపై స్పష్టత లేకపోవడం, విభాగాల పునర్వ్యవస్థీకరణ జరగకపోవడం వంటి కారణాలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన బ్యాగ్ లాగ్ పోస్టుల భర్తీపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
ఒకే సంవత్సరం 2లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీ ప్రసంగాలకే పరిమితమైంది. ఉద్యోగాల భర్తీపై స్పష్టత లేక పోవడమే కాకుం డా వివిధ శాఖల్లో ఇప్పటికే ఖాళీగా ఉన్న వేలాది పోస్టుల కూ నియామక ప్రక్రియ మొదలవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2024 చివ రి నాటికి 9వేల మంది ఉద్యోగ విరమణ పొందగా 2025 ఆర్థిక సంవత్సరం చివరికి మరో 9వేల మంది రిటైర్డ్ అయ్యారు.
2026 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మరో 10వేల మంది రిటైర్డ్ అవుతున్నారు. వేలల్లో ఖాళీలు ఏర్పడినప్పటికీ కొత్తగా ఒక్క జాబ్ నోటిఫికేషన్ జారీ చేయడం లేదు. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సెప్టెంబర్ 17 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించినప్పటికీ గాలి మాటలే అయ్యాయి.
ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందడంలో ఆలస్యం, క్యాడర్ స్ట్రెంత్ విభజనపై స్పష్టత లేకపోవడం, విభాగాల పునర్వ్యస్థీకరణ జరగకపోవడం వంటి కారణాలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన బ్యాగ్ లాగ్ పోస్టుల భర్తీపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ వర్గాలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయకుండా పక్కన పడేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఢోకాపై నిరుద్యోగ యువతీ, యువకులు రగిలి పోతున్నారు. మాటిచ్చి నిలువునా మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.