అర్వపల్లి, ఆగస్టు 12 : జాజిరెడ్డిగూడెంలో అక్రమంగా ఇసుక డంపు చేసిన వారిపై కేసులు నమోదు చేసి, వారి లైసెన్స్ ను రద్దు చేయాలని, అలాగే అక్రమ ఇసుక డంపులను సీజ్ చేయాలని డిప్యూటీ తాసీల్దార్ అశ్వినికి సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వినతి పత్రం అందజేసింది. ఈ సందర్బంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి డివిజన్ కార్యదర్శి గంట నాగయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి కాలం అయిపోయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక క్వారీల నిర్వహణ ఉంది. పూడిక పేరుతో అక్రమ ఇసుక రవాణా చేస్తూ కాంట్రాక్టర్లు, మైనింగ్ అధికారులు, టిజి ఎం.డి.సి, అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తూ గుట్టలు గుట్టలుగా ఇసుక డంపులు చేసి అర్ధరాత్రుల్లో అక్రమంగా ఇసుకను నడుపుతున్నారన్నారు. ఏడు టిప్పర్లకి ఒకే నెంబర్ తో నడుస్తున్న అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వ అనుమతి అయిపోయిన ఇసుక క్వారీలో జెసిపి పెట్టి అర్ధరాత్రిలో ఇసుకని తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్, టీజీఎండీసీ అధికారులు జేసీబీలతో డంపులను చేసి ఇసుక కాంట్రాక్టర్ల లైసెన్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పూడిక, ప్రాజెక్టుల పేరుతో కాసుల వేట నడుస్తుందన్నారు. ఇసుక రవాణా టీజీఎండిసి పర్యవేక్షణలో ఉండాలి కానీ ఇసుక పూడిక తీత పనులు కాంట్రాక్టర్ లు తనకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులతో టిప్పర్లతో అక్రమంగా నడుపుతున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణా చిన్న స్థాయి ప్రజాప్రతినిదుల నుండి మంత్రుల సహకారాలు పుష్కలంగా ఉన్నాయి. తక్షణమే టీజీఎండిసి, జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులు బాధ్యత తీసుకుని అక్రమంగా డంపు చేసిన ఇసుక డంపును సీజ్ చేసి, దీనిలో భాగస్వాములైన మైనింగ్ అధికారులపై, టీజీ ఎండీసీ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి సబ్ డివిజన్ కార్యదర్శి బొడ్డు శంకర్, జిల్లా నాయకులు పోలేబోయిన కిరణ్, దేషోజు మధు, ఎస్డీఎల్సీ నాయకులు పోలేబోయిన పెద్ద లింగయ్య, గ్రామ కార్యదర్శి వడకల బయన్న, పోలేబోయిన మధుకర్, ధర్మాజీ, పలాస వెంకన్న పాల్గొన్నారు.

అక్రమ ఇసుక డంపులను సీజ్ చేయాలి : సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి