యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) గత ఆరేండ్లలో భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసిన డిజిటల్ మౌలిక సదుపాయం. 2020 నుంచి జీరో ఎండీఆర్ విధానం వల్ల చిన్న దుకాణాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారాల వరకు యూపీఐ పూర్తిగా ఉచితం కావడంతో, ఇది పౌరుల రోజువారీ జీవనంలో భాగంగా మారింది. 201920లో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ.21.3 లక్షల కోట్లు ఉండగా, 202425 నాటికి ఇది రూ.260.56 లక్షల కోట్లకు చేరింది. 2026 ఆగస్టులో ఒక్క నెలలోనే రూ.2,450 కోట్లకు పైగా లావాదేవీలు, రూ.29.82 లక్షల కోట్ల విలువతో జరిగాయి. ఈ అపూర్వ వృద్ధికి మూలకారణం యూపీఐ సులభత మాత్రమే కాదు, పూర్తిగా ఉచితం అనే నమ్మకం ప్రజల్లో కలుగడం కూడా.
202125 వరకు యూపీఐ, రూపే కోసం సుమారు రూ.8,730 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామని, ఈ మౌలిక వసతుల నిర్వహణ, సైబర్ భద్రత, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లకు ఏటా రూ.8,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, దీనిని భర్తీ చేయడం కోసం మర్చంట్ డిస్కౌంట్ రేట్ రుసుములు విధించాల్సి వస్తున్నదని ప్రభుత్వం వాదన. యూపీఐని నడిపిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాభాపేక్ష లేని సంస్థ అయినప్పటికీ, గత సంవత్సరంలోనే ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల రూపాయల పన్ను చెల్లించింది. ఇంత భారీ లాభాలు, మిగులు నడుమ, సంవత్సరానికి రూ.8,000 కోట్ల యూపీఐ నిర్వహణ ఖర్చును ప్రభుత్వం భరించలేని సబ్సిడీ భారంగా చూపించడం ఆర్థికంగా బలహీన వాదనగా మారుతుంది.
ఎండీఆర్ మాత్రం 0.4 శాతం అని చిన్నగా వినిపించినా, వ్యాపారుల లాభ మార్జిన్ల దృష్టిలో అది చాలా పెద్దది. మొబైల్ రిటైల్ వ్యాపారాల్లో నికర మార్జిన్ 0.751.5 శాతం కాగా FMCG, కిరాణా రంగాల్లో 1.52 శాతం మధ్యే ఉన్నది. పెట్రోల్ బంక్ డీలర్ల మార్జిన్ సుమారు 0.5 శాతం మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో రూ.10,000 యూపీఐ చెల్లింపుపై రూ.40 ఎండీఆర్ అంటే లాభంలో గణనీయమైన కోత.
అందుకే కొంతమంది పెట్రోల్ డీలర్లు రూ.2,000 దాటిన యూపీఐ చెల్లింపులను స్వీకరించకూడదని ఆలోచిస్తున్నారు. ఇక్కడే మరో ప్రమాదం కనిపిస్తున్నది. 2016 నోట్ల రద్దు తరువాత ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను బలంగా ప్రోత్సహించింది. రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు ఉచితంగా పంపుకొనే అలవాటు ఏర్పడింది. ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్‌పై రుసుములు విధిస్తే, అనేక వ్యాపారులు, వినియోగదారులు తిరిగి నగదు వైపు మళ్లే అవకాశం ఉన్నది. ఇప్పటికే కొందరు దీన్ని డిమోనిటైజేషన్ పార్ట్2గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే నోట్ల రద్దు కాలంలో చిన్న పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కూడా ఎమ్‌డీఆర్ రుసుముల ప్రభావం మళ్లీ చిన్న వ్యాపారులపైనే ఎక్కువగా పడే ప్రమాదం ఉన్నది.ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ డిజిటల్ పేమెంట్ మార్కెట్లలో భారత్ ముందంజలో ఉన్నది. ఇలాంటి ప్రజా మౌలిక సదుపాయాన్ని సంవత్సరానికి కొన్ని వేల కోట్ల అదనపు ఆదాయం కోసం రుసుములతో బలహీనపరచడం, భారత ఫిన్ టెక్ ప్రతిష్టను దెబ్బతీసే నిర్ణయంగా నిలుస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.