ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ నుంచి వచ్చిన ఓ చిన్న చిత్రం ‘అంఘ్’ ఇప్పుడు ఆస్కార్ వంటి అంతర్జాతీయ యవనికపై సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నది. అక్కడి పర్వత ప్రాంతమైన కోన్యాక్ గ్రామంలోని ఓ స్థానిక కథ భారతీయ సాంస్కృతిక, సామాజిక పరివర్తనకు అద్దంపడుతూ 2027 ఆస్కార్ రేసులో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నది.
కాలగతిలో సమాజం సాంస్కృతిక మార్పుకులోనుకావడం సహజం..అనివార్యం కూడా. ఈ క్రమంలో తరాల మధ్య సాంస్కృతిక సంఘర్షణ ఏర్పడటాన్ని గమనించవొచ్చు. ఇలా ఓ సమాజం ఎదుర్కొన్న సాంస్కృతిక మార్పును ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించిన చిత్రం ‘అంఘ్’. కోన్యాక్ గ్రామంలోని పురాతన సంప్రదాయాలు, తరాల మధ్య మారుతున్న ఆలోచనలను ఈ సినిమా ఒడిసిపట్టింది. 1960ల నాటి కథ ఇది. నాగాలాండ్‌లోని మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని కోన్యాక్ అనే గ్రామంలో కథ నడుస్తుంది. చిత్ర కథానాయకుడు అంగ్బా గ్రామాధికారి. వారసత్వంగా ఆయనకు ఈ పదవి సంక్రమిస్తుంది.
కోన్యాక్ ప్రాంతంలో మతవిశ్వాసాలను కాపాడుకుంటూ ఎక్కడ ఆధునిక పోకడలు దరిచేరకుండా ఆ కుటుంబం సంప్రదాయానికి చిరునామాగా నిలుస్తుంటుంది.ఆ సమయంలో క్రైస్తవ మత విస్తరణతో సమాజంలో ఓ పరివర్తన ప్రారంభమవుతుంది. ఇది అంగ్బా కుటుంబంపై కూడా ప్రభావం చూపిస్తుంది. అతని కుమారుడు కొత్త మతం వైపు ఆకర్షితుడు కావడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. చిత్ర దర్శకుడు థేజా రియో ఓ ప్రాజెక్ట్పనిలో భాగంగా నాగాలాండ్‌లోని మోస్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఈ కథకు బీజం పడింది. అక్కడ ఆయన భిన్న తరాల మధ్య గమనించిన సాంస్కృతిక వైరుధ్యాలు ఈ కథా రూపకల్పనకు ప్రేరణగా నిలిచాయి. ఒకతరంలోని తాత వేటలో నిష్ణాతుడు అయి ఉం టాడు. అతని శరీరంపై పాత కాలానికి చెందిన పచ్చబొట్లు కనిపిస్తాయి. రెండు తరాల తర్వా త ఆయన మనవడు రాక్‌బ్యాండ్ వాయిస్తూ కనిపిస్తుంటాడు. ఇలా గతం, వర్తమానం కలిసిపోయినట్లు, ఒకే ప్రాంతంలో చరిత్రలోని భిన్న కాలాలు జీవించినట్లుగా ఆయనకు అనిపించింది. అదే భావనతో ఆయన ‘అంఘ్’ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రం టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై ప్లాట్‌ఫామ్ కాంపిటీషన్లో ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 11 ఇతర చిత్రాలను అధిగమించి ఈ సినిమా ఘనతను సాధించింది. దీంతో ఆస్కార్ పురస్కారాల్లో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగం కోసం అకాడమీ పరిశీలనకు ఎంపికయ్యే అర్హతను సాధించింది. ఇటీవల మారిన అకాడమీ అర్హత నిబంధనల ప్రకారం కొన్ని ప్రముఖ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అత్యున్నత జ్యూరీ పురస్కారం గెలుచుకున్న చిత్రాలు, తమ దేశం అధికారికంగా ఆస్కార్‌కు పంపకపోయినా ఉత్తమ విదేశీ సినిమా విభాగానికి అర్హత సాధించవొచ్చు.
‘అంఘ్’ సినిమాలో ప్రొఫెషనల్ నటుల కంటే స్థానికులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. కోన్యాక్ భాషలోనే చిత్రీకరణ చేశారు. ముఖ్యంగా 16ఎమ్ఎమ్ ఫిల్మ్‌పై చిత్రీకరణ కూడా ఈ సినిమా ప్రత్యేకతల్లో ఒకటి. సినిమాటోగ్రాఫర్ ఆడమ్ పీట్కోవిచ్తో కలిసి రియో ఈ ప్రయోగం చేశారు. 1960 దశకం నాటి నాగాలాండ్ మిషనరీలు, అక్కడ సాంస్కృతిక చిహ్నాలకు, పాత ఫొటోలు, ఫుటేజీలను పరిశీలించి నాటి కాలమాన పరిస్థితులను పునఃసృష్టించే ప్రయత్నం చేశారు.
ఒకప్పుడు అస్సాం రాష్ట్రంలో ఉన్న నాగాలాండ్ 1963లో విడిపోయి స్వతంత్య్ర రాష్ట్రంగా ఏర్పడింది. తదనంతరం ఆ ప్రాంతంలో రాజకీయంగా, సామాజికంగా గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటికే అక్కడ విస్తరిస్తున్న క్రైస్తవం ప్రజల ఆచార, సంప్రదాయాలపై ప్రభావాన్ని చూపించింది. కొన్ని ఆచారాలు పూర్తిగా కనుమరుగైపోగా..కొన్ని కుటుంబాల వారసత్వంగా మాత్రమే మిగిలిపోయాయి. ఈ అసాధారణ మార్పులను దర్శకుడు థేజా రియో వెండితెర దృశ్యమానం చేశారు. మొత్తానికి నాగాలాండ్ ప్రపంచ వేదిక వరకు ‘అంఘ్’ ప్రయాణం భారతీయ సినిమా తాలూకు వైవిధ్యానికి ప్రతీకలా నిలుస్తున్నది. ఇప్పటికే భారత్ ఆస్కార్ అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం ‘గోంధల్’ ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో తాజా నిబంధనల ప్రకారం ఒకే దేశానికి చెందిన రెండు చిత్రాలు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో పోటీపడే అవకాశం ఏర్పడింది.