న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)ను రద్దు చేయాలని, ఈ ప్రక్రియలో భాగంగా తొలగించిన పేర్లను పునరుద్ధరించాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీనియర్ న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు, పౌర సమాజ సభ్యుల బృందం సోమవారం డిమాండ్ చేసింది. కలిసికట్టుగా ఉందాం అనే నినాదంతో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నవారు రాబోయే ఎన్నికలను ప్రీ-సర్(సర్కు ముందు) ఓటర్ల జాబితాల ఆధారంగా నిర్వహించాలని డిమాండ్ చేయడంతో పాటు ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘం(ఈసీ) తీసుకున్న నిర్ణయాల రాజ్యాంగబద్ధత, చట్టబద్ధతపై స్వతంత్ర విచారణ జరపాలని కోరారు.
ఈసీ పనితీరు కళంకితమైనదని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. అంతేగాకుండా ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చూసిన తీరు వల్ల పౌరులు ముందుకు రావడం అవసరమైందని ఆయన నొక్కి చెప్పారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలకు ఆటంకం కలిగితే ఇక ప్రజాస్వామ్యంలో మిగిలేది ఏముంటుంది? అని ఆయన ప్రశ్నించారు. సర్లో భాగంగా పెద్ద ఎత్తున పేర్లను తొలగించడం, చేర్చడం అనే అంశం సుప్రీంకోర్టు ముందు పలుమార్లు ప్రస్తావించినట్టు ఆయన చెప్పారు. అది తప్పని ఇప్పుడు రుజువైందని, అప్పటి నుంచి అనేక ఎన్నికలు జరిగాయని సిబల్ అన్నారు.
సర్కి సంబంధించిన నిర్ణయాలు ఎన్నికల సంఘం తీసుకోలేదని, ప్రధాన ఎన్నికల కమిషనర్ ద్వారా బలవంతంగా అమలు అయ్యాయని, అందువల్ల వాటికి చట్టబద్ధత లేదని పేర్కొంటూ ఆ నిర్ణయాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఈసీ ఉత్తర్వులుగా సుప్రీంకోర్టు పరిగణించిన అంశాలు అసలు దాని నిర్ణయాలు కావని, వాటిని సీఈసీ ఏకపక్షంగా తీసుకుందని సుప్రీంకోర్టుకు స్పష్టం చేయాలని ఆయన చెప్పారు. సర్ ప్రక్రియ ముస్లింల ఓటు హక్కును తొలగించే లక్ష్యంతోనే జరిగిందా అని ప్రశ్నించగా తార్కిక వైరుధ్యాలు అనే ప్రమాణాన్ని సరిగ్గా ఆ ఉద్దేశంతోనే రూపొందించారని ఆయన అన్నారు.