హీరో కేసీఆర్.. విలన్ కాంగ్రెస్
‘చరిత్రలోని ప్రతి కథలో హీరోలు, విలన్లు ఉంటారు.. రామాయణంలో రాముడు హీరో అయితే విలన్ రావణుడు.. మహాభారతంలో హీరోలు పాండవులు, విలన్లు కౌరవులు.. అట్లనే తెలంగాణ పోరాట చరిత్రలో కేసీఆర్ హీరో అయితే.. విలన్ కాంగ్రెస్.
- ఆత్మగౌరవం.. పౌరుషమనే ఆయుధాలే ఆలంబనగా దీక్షా దివస్
- ఆ 11 రోజులూ తెలంగాణ చరిత్రలో సముజ్వల ఘట్టం
- కరీంనగర్లో భూకంపం పుట్టించింది కేసీఆర్
- భిక్షతో కాదు.. దీక్షతో తెలంగాణ సాధించిండు
- పద్మవ్యూహాన్ని ఛేదించి.. 32 పార్టీలను ఒప్పించిండు
- చావునోట్లో తలపెట్టి..ఢిల్లీని శాసించి రాష్ట్రాన్ని తెచ్చిండు
- మూడు తరాలను ముంచిన వంచక పార్టీ కాంగ్రెస్
- అలుగునూర్ దీక్షా దివస్ స్ఫూర్తి సభలో బీఆర్ఎస్
- వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగ ప్రసంగం
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తేతెలంగాణ): ‘చరిత్రలోని ప్రతి కథలో హీరోలు, విలన్లు ఉంటారు.. రామాయణంలో రాముడు హీరో అయితే విలన్ రావణుడు.. మహాభారతంలో హీరోలు పాండవులు, విలన్లు కౌరవులు.. అట్లనే తెలంగాణ పోరాట చరిత్రలో కేసీఆర్ హీరో అయితే.. విలన్ కాంగ్రెస్. ఎన్ని యుగాలు, తరాలు మారినా ఇదే నిజం.. చరిత్రకెక్కిన సత్యం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్ఘాటించారు. ఆత్మగౌరవం.. పౌరుషం అనే ఆయుధాలను ఆలంబనగా చేసుకొని నవంబర్ 29న దీక్షకు పూనుకున్న సందర్భమే దీక్షా దివస్‌గా అభివర్ణించారు.
సబ్బండ జనులను కదిలించిన ఆ 11రోజులూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో మహోజ్వల ఘట్టమని పేర్కొన్నారు. వందలాది బిడ్డలను బలితీసుకున్న దయ్యం.. వేదికలెక్కి వేదాలు చెబుతున్నదని విరుచుకుపడ్డారు. జై తెలంగాణ అనని బానిసలు అధిపతులుగా ఉండటం దురదృష్టకరమన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించిన కేసీఆర్ దీక్షా దివస్ స్ఫూర్తి సభలో అశేషంగా తరలివచ్చిన ప్రజానీకాన్ని ఉద్దేశించి కేటీఆర్ భావోద్వేగంతో ప్రసంగించారు. కేసీఆర్ దీక్షకు దారితీసిన పరిస్థితులను వివరించారు. నాడు కాంగ్రెస్ చేసిన కుట్రలను ఎండగట్టారు.
మన కథ చెప్పుకునేందుకే దీక్షా దివస్
కరీంనగర్ మట్టిని నాడు బొట్టుగా పెట్టుకొని దీక్షకు బయలుదేరిన.. అలుగునూరు గడ్డపై ఏర్పాటు చేసిన దీక్షా దివస్ స్ఫూర్తి సభకు పోటెత్తిన జనసంద్రాన్ని చూస్తే ఎంతో సంతోషం కలుగుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. మన తెలంగాణ కథ మనం చెప్పుకోవాల్సిన తరుణమే దీక్షా దివస్ అని చెప్పారు. బక్కపలుచని యోధుడు తన జాతి దాస్యశృంఖలాలను తెంపిన కథ.. పుడమికే పూనకాలు తెప్పించిన భూమిపుత్రుడి కథ.. శిఖరాలను అధిరోహించిన అద్భుత కథ మన జాతి కథ’అని వివరించారు. చరిత్రను మలుపుతిప్పిన రోజు.. తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదిన రోజు దీక్షా దివస్’ అని చెప్పారు.
11 రోజుల దీక్ష.. మహోజ్వల ఘట్టం..
నాడు కేసీఆర్ 11 రోజులు చేసిన దీక్ష చరిత్రలో ఉజ్వలమైన ఘట్టంగా నిలిపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. నవంబర్ 29, 2009 నాడు కరీంనగర్ గడ్డపై భూకంపం పుట్టించిన నాయకుడు కేసీఆర్.. ఒకే ఒక్క నినాదం నిప్పురవ్వలా ఎగిసిపడ్డది.. అదే కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ శవయాత్రనా? తెలంగాణ జైత్రయాత్రనా? ఏదో ఒకటి తేలాలని చెప్పారు. ఇదే కరీంనగర్ గడ్డ నుంచి సిద్దిపేటకు దీక్షకు వెళ్తున్న సందర్భం.. 17 ఏండ్ల తర్వాత కదలాడుతున్నదని పేర్కొన్నారు.
దీక్షకు ఒక్కరోజు ముందు నవంబర్ 28, 2009 నాడు అయ్యప్ప స్వాములతో కలిసి పడిపూజ చేసిన తర్వాత స్వాముల ఆశీర్వాదం తీసుకొని కేసీఆర్ బయల్దేరారని గుర్తుచేశారు. తీగలగుట్టపల్లి నుంచి బయల్దేరిన కేసీఆర్ వాహనాలను దారి మళ్లించి.. వెంట వచ్చిన పార్టీ నాయకుల వాహనాలను నిలువరించి అలుగునూరులో కేసీఆర్‌ను అరెస్ట్ చేసి, ఖమ్మం జైలుకు తరలించారని చెప్పారు. కేసీఆర్ నడిపించిన స్వరాష్ట్ర పోరాటాన్ని కండ్లారా చూసిన మనమందరం ధన్యులమని వ్యాఖ్యానించారు. ఉద్యమం పతాక శీర్షికకు పోయిందని, కేసీఆర్ అరెస్ట్ అయ్యారని మదనపడి ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి, కామారెడ్డిలో పోలీసు కిష్టయ్య బలిదానాలు విని కేసీఆర్ వలవల ఏడ్చారని గుర్తుచేశారు.
‘చస్తే నేను చస్తా.. తెలంగాణ కోసం పిల్లలు బలిదానం కావద్దు.’ అని ప్రాధేయపడ్డారని చెప్పారు. మొండి పట్టుదల, ఉక్కు సంకల్పంతో 11 రోజులు అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా దీక్షబూని తెలంగాణ సమాజాన్ని కదిలించారని గుర్తుచేశారు. ‘ఆరో రోజూ నిమ్స్ మేం నిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లగా ఒక ఐజీ ఇంటెలిజెన్స్ అధికారి మీ నాయిన 24 గంటల్లో బ్రెయిన్‌డెడ్ అయితడని, ఢిల్లీలో పట్టించుకోవడం లేదని 48 గంటల్లో చనిపోతారని బెదిరించారని, నీ భర్త మరణిస్తారని మా అమ్మను భయపెట్టిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ సమాజం లేచి కూర్చున్నది దీక్ష విరమించమంటే సచ్చినా సరే వెనక్కి తగ్గలేదని.. మొండిధైర్యంతో చావునోట్లో తలపెట్టి.. యావత్ తెలంగాణ జాతిని ఒకటిగా నిలబెట్టి దేశాన్ని ఆకర్షించేలా సత్యాగ్రహానికి పూనుకున్నారని వివరించారు.
అమరుల ఆత్మక్షోభించేలా సీఎం తీరు
చంపినోడే సంతాప సభలు పెట్టినట్టు.. అమరుల ఆత్మలు క్షోభించేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారమున్నదని కేటీఆర్ నిప్పులుచెరిగారు. ‘ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందే తెలంగాణ తిరుగబడ్డది..1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం మొదలైంది.. ఆ రోజూ కర్కశ కాంగ్రెస్ సిటీ కాలేజీలో ఆరుగురు పిల్లలను కాల్చిచంపింది.. ఉన్న తెలంగాణను ఊడగొట్టి బలవంతంగా ఏపీలో విలీనం చేసిన ద్రోహి కాంగ్రెస్ అని విరుచుకుపడ్డారు.
జయశంకర్ మాటల్లో చెప్పాలంటే.. మూడు తరాలను ముంచిన వంచకపార్టీ కాంగ్రెస్.. ఎన్ని యుగాలు మారినా తెలంగాణ కథలో హీరో కేసీఆర్.. విలన్ కాంగ్రెస్సే’ అని పునరుద్ఘాటించారు. ‘ఇది నేను చెప్పలే.. రేవంత్‌రెడ్డే చెప్పిన్రు..సోనియమ్మ వందల మందిని బలితీసుకున్న దేవత అని అన్నడు.. మన బిడ్డలను బలితీసుకున్న దయ్యం వేదాల గురించి మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు. తెలంగాణ అమరుల గురించి కాంగ్రెస్ మాట్లాడితే అలాగే ఉంటుందని చెప్పారు. శ్రీకాంతాచారి, యాదయ్య, కిష్టయ్య, ఇషాన్‌రెడ్డి, సువర్ణ. వేణుగోపాల్‌రెడ్డి ఇలా ఎందరో బిడ్డల ఉసురు తీసింది కాంగ్రెస్ అని విరుచుకుపడ్డారు.
కృష్ణుడిలా ఊహకందని వ్యూహాలను రూపొందించిండు. తెలంగాణ కురుక్షేత్రంలో రథం నడిపి.. రణం చేసి అర్జునుడిలా పద్మవ్యూహాన్ని ఛేదించిండు. 32 పార్టీలను ఒప్పించి ఢిల్లీ మెడలు వంచి..యాచించకుండా శాసించి తెలంగాణను సాధించింది కేసీఆరే. మనం గుర్తుచేసుకోవాల్సింది ఏందంటే నవంబర్ 29.. దీక్షా దివస్ లేకుంటే డిసెంబర్ 9 ప్రకటన లేదు..డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు.. గులాబీ జెండా ఎగురకపోతే తెలంగాణ లేదు.. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ లేదు.. తెలంగాణ ముఖ్యమంత్రి పదవే లేదు.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేసీఆర్ దీక్షతోనే ఢిల్లీ దిగొచ్చింది..
ఢిల్లీ దిగొచ్చి 2009 డిసెంబర్ 9న అర్ధరాత్రి 11:30 గంటలకు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చదువుతుంటే ప్రతిహృదయం భావోద్వేగంతో పులకించి పోయిందని కేటీఆర్ చెప్పారు. దేశానికి అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చినట్టే.. కేసీఆర్ దీక్షతో తెలంగాణకు అర్ధరాత్రి ఊపిరివచ్చిందని పేర్కొన్నారు. అవమానాలు, ఎదురుదెబ్బలు, ఐదు దశాబ్దాల పోరాట చరిత్రలో మొదటిసారి ఒక విజయం లభించింది.. ఎన్నాళ్లో ఎదురుచూసిన స్వప్నం సాకారమైన క్షణం వచ్చిందన్నారు..
‘మీకోసం కలగని సాకారం చేసుకోవడం గొప్ప విషయం కాదని, జాతి కలను సాకారం చేసిన వారిని దక్షిణాఫ్రికాలో అయితే నెల్సన్ మండేలా అంటరు.. తెలంగాణలో అయితే ఒక కేసీఆర్ అంటరు.. దటీజ్ కేసీఆర్’ అని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఎవరూ పడితే వారు మాట్లాడుతున్నరు.. చంద్రబాబు లాంటి సమైక్యవాదులందరూ ఒక్కటై రాజీనామాలు మొదలు పెట్టిన్రు.. కాంగ్రెస్‌ను బెదిరిస్తే 12 రోజుల తర్వాత ప్రకటనను వాపస్ తీసుకున్నారని గుర్తుచేశారు. ఆ తర్వాత వందలమంది బలిదానాలు, సకల జనుల సమ్మెలు.. జేఏసీల ఏర్పాటుతో ప్రతి ఊరూ ఉద్యమకేంద్రంగా మారిందని పేర్కొన్నారు.
14 ఏండ్ల పోరాటంతోనే కల సాకారం
తెలంగాణ మట్టిలోనే పోరాటమున్నది.. ఇక్కడి నేలలోనే తెగించి కొట్లాడే తెగువ ఉన్నది.. 60 ఏండ్లు పరాయిపాలనలో మగ్గిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘ షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, సర్వాయిపాపన్న, పండుగ సాయన్న, రాంజీగోండు, కుమ్రం భీమ్..చాకలి ఐలమ్మ, భీమ్‌రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, అనభేరి లాంటి వీరులను కన్నది తెలంగాణ గడ్డ కదా..విప్లవాల ఖిల్లా కదా..మరీ మన రాష్ట్రం మనం సాధించుకోవడానికి 60 ఏండ్లు ఎందుకు పట్టిందో ఆలోచించుకోవాలని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సన్నాసులవల్లే తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైందని వివరించారు. కేసీఆర్ 14 ఏండ్లు పోరాడి తెలంగాణను సాధించి అప్పజెప్పారని పేర్కొన్నారు.
2001 ఏప్రిల్ 27న పార్టీ స్థాపించి దండి గుండె, మొండిధైర్యంతో కేసీఆర్ ముందుకు నడిచినప్పుడు ఆయనతో పిడికెడు మందే ఉన్నారని గుర్తుచేశారు. మఖలో పుట్టింది పుబ్బలో పోతుందన్నరు.. కానీ 14 ఏండ్లు ధైర్యంగా పోరాడారని చెప్పారు. అవమానాలు, అపశకునాలను ఎదుర్కొని అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని నడిపిన ఘనత ఆయనకే దక్కిందని కేటీఆర్ పేర్కొన్నారు. శ్రీకృష్ణుడిలా ప్రత్యర్థుల ఊహకందని వ్యూహాలు రచించి, అర్జునుడిలా పద్మవ్యూహాన్ని ఛేదించి..తెలంగాణ కురుక్షేత్రంలో రథం నడిపి.. రణం చేసింది కేసీఆరే.. ఢిల్లీలో ఎక్కని మెట్లులేవు.. మొక్కని గడప లేదు.. 32 పార్టీలను ఒప్పించి, లేఖలు సాధించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుకున్నది సాధించారని స్పష్టంచేశారు.
ఒక బక్క పలుచని యోధుడు మహారుషిలా తపస్సు చేస్తూ మరణం అంచుల్లోకి పోతుంటే అగ్నిగుండమై భగభగమండింది తెలంగాణ.. యూనివర్సిటీలు యుద్ధభూములైనయ్.. విద్యార్థులు పోరాట వీరులైన్రు.. పల్లెల్లో రైతులు.. పట్నంలో విద్యార్థులు.. నల్లకోటు వేసుకున్న లాయర్లు.. తెల్లకోటు ధరించిన డాక్టర్లు.. కంపెనీల్లోని కార్మికులు..ఆఫీసుల్లోని ఉద్యోగులు.. ఆడబిడ్డలు.. చివరికి ఎన్నారైలు అందరూ మా రాష్ట్రం మాకిస్తరా? లేదా? చస్తరా? అని బరిగీసి కొట్లాడిన అరుదైన సందర్భమది.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Congress
- deeksha divas
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

