రాహుల్ వ్యూహం బూమరాంగ్
డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే తన వైఖరిని మార్చుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ప్రత్యేక విమానాల్లో చెన్నైకి వెళ్లి డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్‌తో సమావేశమయ్యారు.
- బెడిసికొట్టిన ‘ఎట్టప్పన్’ వ్యాఖ్యలు
- డీలిమిటేషన్‌పై కేంద్రానికి మద్దతు ఉపసంహరణకు స్టాలిన్ ససేమిరా
- ఎట్టప్పన్లుగా కాదు.. కట్టబ్రహ్మన్లుగా నిలుస్తామని రాహుల్‌కు కౌంటర్
- ఇండియా కూటమి చర్చలు విఫలం
చెన్నై, నవంబర్ 29: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే తన వైఖరిని మార్చుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ప్రత్యేక విమానాల్లో చెన్నైకి వెళ్లి డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్‌తో సమావేశమయ్యారు. వీరి వెంట బెంగాల్ మాజీ సీఎం మమతాబెనర్జీ, ఇతర ఇండియా కూటమి నేతలు కూడా ఉన్నారు.
అయితే తమ పార్టీ వైఖరిలో మార్పు ఉండదని స్టాలిన్ తెగేసి చెప్పారు. తమిళనాడు ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రాధాన్యమని, ప్రతిపాదిత బిల్లును ఓడిస్తే రాష్ర్టానికి ప్రస్తుతం లభిస్తున్న కనీస రక్షణ కూడా కోల్పోయే ప్రమాదం ఉందని స్టాలిన్ స్పష్టంచేశారు. తాము కట్టబ్రహ్మన్లు (కట్టబొమ్మన్లు)గా నిలుస్తామని, ఎట్టప్పన్లుగా కాదని అంతకుముందు రాహుల్‌గాంధీకి గట్టి కౌంటర్ ఇచ్చారు.
బిల్లును ఓడిస్తే కనీస రక్షణ కూడా పోతుంది..
సమావేశం అనంతరం స్టాలిన్ తన వైఖరిని సమర్థించుకున్నారు. డీలిమిటేషన్ బిల్లును ఓడిస్తే తమిళనాడుకు ప్రస్తుతం ప్రతిపాదనలో లభిస్తున్న కనీస రక్షణ కూడా ఉండదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనను తీసుకురాలేదని చెప్పారు. తమిళనాడు ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టంచేశారు. డీఎంకేకు లోక్‌సభలో 22 మంది రాజ్యసభలో 8 మంది సభ్యులున్నారు.
గాంధీలు చెన్నైకి చేరకముందే..
వాస్తవానికి ఇండియా కూటమి నేతలు చెన్నైకి చేరకముందే స్టాలిన్ తన నిర్ణయాన్ని స్పష్టంచేశారు. ఈ విషయంలో రాజీపడబోమని, చరిత్ర తమను కట్టబొమ్మనులుగా గుర్తించుకుంటుందని, ఎట్టప్పన్లుగా కాదని వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన విజ్ఞప్తికి ఆయన ఈ మేరకు బదులిచ్చారు. ఆదివారం ఉదయం 11.22 గంటలకు రాహుల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తాను, ఇండియా కూటమి సీనియర్ నేతలు చెన్నైకి వెళ్లి స్టాలిన్‌తో సమావేశమై డీలిమిటేషన్, రాజ్యాంగ సవరణ బిల్లులను వ్యతిరేకించాలని కోరనున్నట్టు తెలిపారు.
లోక్‌సభ స్థానాలను 850కి పెంచితే బీజేపీ, ఆరెస్సెస్ తమకు అనుకూలంగా దేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చుకునేందుకు అవకాశం లభిస్తుందని ఆరోపించారు. దీనిపై 24 నిమిషాల తర్వాత స్టాలిన్ స్పందించారు. రాజ్యాంగం, రాష్ర్టాల హక్కుల పరిరక్షణలో డీఎంకే పాత్రను గుర్తించినందుకు రాహుల్‌కు ధన్యవాదాలు చెబుతూనే, తమిళనాడు ప్రయోజనాల విషయంలో తమ పార్టీ రాజీపడబోదని స్పష్టంచేశారు. ‘మేము అనుసరిస్తున్న ఈ మార్గంలో రాజీపడబోం. చరిత్ర మమ్మల్ని కట్టబొమ్మనులుగా గుర్తుంచుకుంటుందని, ఎట్టప్పన్లుగా కాదని నమ్ముతున్నాను’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
కట్టబొమ్మన ఎవరు?ఎట్టప్పన్ ఎవరు?
వీరపాండ్య కట్టబొమ్మన: 18వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అధికారాన్ని, పన్నుల డిమాండ్లను వ్యతిరేకించిన తమిళ పాలెగాడు. బ్రిటిష్ వారితో పోరాడిన ఆయనను 1799లో ఉరితీశారు. తమిళ ప్రజా స్మృతిలో ఆయన ప్రతిఘటనకు ప్రతీకగా నిలిచారు. ఎట్టప్పన్: ఎట్టయపురం సంస్థానానికి చెందిన పాలకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. కట్టబొమ్మనను బ్రిటిష్ వారికి పట్టించడంలో సహకరించాడనే ప్రచారంతో తమిళ రాజకీయ, ప్రజా సంస్కృతిలో ద్రోహానికి ప్రతీకగా మారాడు.
ఈ రెండు పేర్లను ఉపయోగించడం ద్వారా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే వారిని ఎట్టప్పన్లుగా అభివర్ణించిన రాహుల్ గత వ్యాఖ్యకు స్టాలిన్ బదులిచ్చినట్టయింది. గత ఆగస్టులో మామల్లాపురంలో జరిగిన సమావేశంలో రాహుల్‌గాంధీ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే వారిని 21వ శతాబ్దపు ఎట్టప్లన్లుగా అభివర్ణించారు. తమిళ చరిత్రలో ఎట్టప్పన్ పేరును ద్రోహానికి పర్యాయపదంగా ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ఇప్పుడు స్టాలిన్ అదే చారిత్రక పోలికను తిరిగి ఉపయోగించారు.
శరద్ పవార్ కూడా ససేమిరా
ఇండియా కూటమికి అనుకూలంగా ఓటేయడానికి ఎన్సీపీ (ఎస్పీ) అధినేత పవార్ కూడా తిరస్కరించారు. చెన్నైలో డీఎంకే చీఫ్ స్టాలిన్‌ను కలిసి వచ్చిన తర్వాత ముంబైకు విమానంలో చేరుకున్న కూటమి నేతలు అక్కడి నుంచి బస్‌లో బయలుదేరి బ్రీచ్‌కాండీ దవాఖానలో చికిత్స పొందు తున్న ఆయనను ఆదివారం రాత్రి కలుసుకున్నారు. రాహుల్ గాంధీ, ఇండి యా కూటమి నేతలు పరామర్శించి పది నిమిషాలు చర్చించారు. వారి వినతిని తిరస్కరించిన శరద్‌పవార్ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

