స్ఫూర్తి సభలో కేటీఆర్ రణగర్జన
తెలంగాణ ఉద్యమ చరిత్రలో అలుగునూరుకు ప్రత్యేక స్థానం ఉన్నది. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ముందు చోటుచేసుకున్న పరిణామాలు, ఆయన అరెస్టు, ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎగసిపడిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోయాయి.
- పార్లమెంట్లో ఉన్నది మోదీ, సోనియా, బాబు తొత్తులే
- తెలంగాణపై మోదీ మనసులో విషం ఉన్నది నిజం కాదా?
- రాష్ట్ర విభజనను పాకిస్థాన్‌తో పోల్చితే గల్లా పట్టి అడుగలేరా?
- ఎవరి భిక్షతోనో కాదు.. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ వచ్చింది
- తెలంగాణ కురుక్షేత్రంలో రథం నడిపింది..రణం చేసింది కేసీఆరే
- జై తెలంగాణ అనని బానిసలు రాష్ట్రానికి అధిపతులుగా ఉన్నరు
- కేసీఆర్ సీఎంగా ఉంటే ఎవరైనా నీళ్లెత్తుకెళ్లే ధైర్యం చేస్తుండెనా?
- ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్
- అల్గునూర్ దీక్షా దివస్ స్ఫూర్తిసభలో భావోద్వేగ ప్రసంగం
కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ నిర్వహించిన స్ఫూర్తిసభ తండోపతండాలుగా తరలివచ్చినవారితో పోటెత్తింది. కరీంనగర్ జిల్లా అల్గునూర్ గడ్డపై ఉద్యమం నాటి రోజులను తలపించేలా జనప్రవాహం అలుగుదుంకింది. సభకు ముఖ్యఅతిథి గా హాజరైన కేటీఆర్, రాష్ట్ర సాధన పోరాటాన్ని మలుపుతిప్పిన కేసీఆర్ దీక్షా దివస్ సంకల్పాన్ని కండ్లకు కట్టినట్టు వివరించారు. ఢిల్లీ పార్టీలకు తలవంచకుండా తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని, రాష్ట్ర హక్కుల కోసం పోరాడే శక్తిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ఉద్యమ చరిత్రలో అలుగునూరుకు ప్రత్యేక స్థానం ఉన్నది. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ముందు చోటుచేసుకున్న పరిణామాలు, ఆయన అరెస్టు, ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎగసిపడిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోయాయి. ఆ చారిత్రక ఘట్టాలకు వేదికైన అలుగునూరులోనే ఆదివారం దీక్షా దివస్ సభ నిర్వహించడంతో ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొన్నది.
ఈ సభకు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉప్పెనలా కదిలివచ్చారు. ఎక్కడచూసినా గులాబీ జెండాలు, జై తెలంగాణ నినాదాలు, కేసీఆర్-కేటీఆర్‌కు మద్దతుగా వినిపించిన నినాదాలతో అలుగునూరు పరిసరాలు మార్మోగాయి. నాటి ఉద్యమంలో ప్రజలు ఎలా స్వచ్ఛందంగా తరలివచ్చారో.. అదే తరహాలో ఈ సభకు కూడా కదిలిరావడం ప్రత్యేకంగా కనిపించింది. ఇది కేవలం ఒక రాజకీయ సభకు వచ్చిన జనసందోహం మాత్రమే కాదని.. అలుగునూరుతో, కేసీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని చాటుకోవాలన్న ఆకాంక్ష కూడా ఇందులో కనిపించిందని సభికుల స్పందనను బట్టి అర్థమైంది.

కండ్ల ముందు కదలాడిన ఉద్యమ చరిత్ర
దీక్షా దివస్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎల్ఈడీ తెరపై కేసీఆర్ అరెస్టుకు సంబంధించిన ఆనాటి దృశ్యాలను ప్రదర్శించగా, సభలో భావోద్వేగ వాతావరణాన్ని నింపింది. తెలంగాణ కోసం సాగిన పోరాటం, ఆ సమయంలో ఎదురైన నిర్బంధాలు, అమరుల త్యాగాలు సభికులను కదిలించాయి. కేటీఆర్ కూడా తన ప్రసంగంలో ఈ ఘటనలను ప్రస్తావిస్తూ కరీంనగర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ జిల్లా ఉద్యమానికి ఊపిరిలూదిన నేల అని, సింహగర్జన చేసిన కొదమసింహాల గడ్డ అని అభివర్ణించారు. కేటీఆర్ భావోద్వేగంతో మాట్లాడుతుంటే సభికులు నిశ్శబ్దంగా వింటూ కనిపించారు. నినాదాలతో హోరెత్తిన సభలో ఆయన భావోద్వేగ ప్రసంగం సాగినప్పుడు నెలకొన్న నిశ్శబ్దం ప్రత్యేకంగా నిలిచింది.
కేటీఆర్ ప్రశ్నలు.. సభికుల సమాధానాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కేటీఆర్ సభికులతో నేరుగా సంభాషించారు. నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు.. ఇప్పుడు పెన్షన్ వస్తుందా? అని ప్రశ్నించగా, సభికుల నుంచి లేదనే సమాధానం వచ్చింది. మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, రైతులకు రూ.15 వేల రైతుభరోసా, కౌలు రైతులకు సాయం, రైతు కూలీలకు నెలకు రూ.వెయ్యి, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి హామీలు ఇచ్చారు. వాటి అమలు ఏమైంది? వస్తున్నాయా? అనిప్రశ్నించగా.. లేదులేదు అంటూ సభికులు ముక్తకంఠంతో సమాధానాలు చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాల హామీపై కూడా యువతను ప్రశ్నించారు. నమ్మించి నయవంచన చేసే ప్రభుత్వాల హామీలపై యువత ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ కథానాయకుడు ఎవరు?
ప్రసంగంలో కేటీఆర్ అడిగిన మరో ప్రశ్న సభలో విశేష స్పందనను రేకెత్తించింది. ‘తెలంగాణ కథలో హీరో ఎవరు?’ అని ఆయన ప్రశ్నించగా, సభికుల నుంచి ‘కేసీఆర్’ అంటూ సమాధానం మార్మోగింది. తెలంగాణ చరిత్రను మనమే చెప్పుకోవాలని, మన పోరాటాలు, త్యాగాలు, సాధించిన విజయాలను మరుగున పడనివ్వకూడదని అన్నారు. నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు.. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు.. గులాబీ జెండా ఎగురకుంటే తెలంగాణ లేదన్న భావనను తన ప్రసంగంలో బలంగా వినిపించారు. ఈ విషయాలను వివరించినప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. తెలంగాణ సాధనలో కేసీఆర్ పోరాటం, అమరుల త్యాగాలు, ప్రజల భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ.. రాష్ట్ర చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు
తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ర్టానికి సంబంధించిన నీటి హక్కులు, సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సమస్యలు, ఉద్యోగాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలను ప్రస్తావించారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తగిన న్యాయం చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని విమర్శిస్తూ.. రాష్ట్ర హక్కుల కోసం బలమైన రాజకీయ స్వరం అవసరమని ప్రజలకు వివరించిన తీరు వారిని ఆలోచింపజేసింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలని, పార్లమెంట్‌లోనూ, రాష్ట్రంలోనూ తెలంగాణ హక్కుల కోసం పోరాడే శక్తిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ సుమారు 45 నిమిషాలపాటు ప్రసంగించినా సభికులు చివరి వరకూ ఆసక్తిగా ఆలకించడం విశేషం.
ఆటపాటలతో ఉద్యమ స్ఫూర్తి
దీక్షా దివస్ సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ గాయకుడు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆలపించిన ఉద్యమ గీతాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలం నాటి పోరాట స్ఫూర్తిని గుర్తుచేస్తూ ఆయన పాడిన పాటలకు సభికుల నుంచి మంచి స్పందన లభించింది.
వేదికపైకి రాగానే కేరింతలు.. సీఎం కేటీఆర్ నినాదాలు
కేటీఆర్‌కు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆయన వేదికపైకి చేరుకోగానే జై కేసీఆర్.. జై కేటీఆర్ అంటూ నినాదాలు మార్మోగాయి. పలువురు సీఎం కేటీఆర్ అంటూ నినదించడంతో సభా ప్రాంగణం ఉత్సాహంతో ఊగిపోయింది. కేటీఆర్ మాట్లాడుతున్నంతసేపూ సభికుల నుంచి స్పందన కనిపించింది. ఆయన వేసిన పంచ్ డైలాగులు, చమత్కారాలు, సందర్భానుసారంగా చేసిన వ్యాఖ్యలకు ప్రజలు కేరింతలు కొట్టారు. కేటీఆర్ ప్రసంగం సాగుతున్న సమయంలో ‘తండ్రికి తగ్గ తనయుడు’ అన్న వ్యాఖ్యలు సభికుల నుంచి వినిపించాయి. కేసీఆర్ ఉద్యమ వారసత్వాన్ని కేటీఆర్ తనదైన శైలిలో కొనసాగిస్తున్నారన్న అభిప్రాయం పలువురి మాటల్లో వ్యక్తమైంది.

అమరుల త్యాగాలకు అశ్రునివాళి.. ఉద్యమ ద్రోహంపై ఆవేదన
తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అసువులు బాసిన అమరవీరులను కేటీఆర్ స్మరించుకున్నారు. వారి త్యాగాలను కేవలం నివాళులతో సరిపెట్టకుండా.. తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుపాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం యువత ప్రాణత్యాగాలకు సిద్ధపడే పరిస్థితి రావడానికి నాటి కాంగ్రెస్ పాలకుల వైఖరి, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం కారణమని వివరించారు. తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోయిన తర్వాతే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదిలిందని ఉద్వేగంతో చెప్పారు. అమరుల కుటుంబాల త్యాగాలు, వారి కన్నీళ్లను మరచిపోవద్దని, ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

