లక్నో: బీజేపీ పాలిత ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ నిరుద్యోగులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల 3,000 మందికిపైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందచేసిన కొన్ని రోజులకే ఉద్యోగాల కోసం పరుగులు తీసే యువతను ఉద్దేశించి పాఠక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
ఒక సభను ఉద్దేశించి పాఠక్ ప్రసంగిస్తూ యువత ఉద్యోగాల కోసం ప్రయత్నించే బదులు ఈ-రిక్షాలను నడుపుకుంటే మంచిదని సలహా ఇస్తున్న వీడియో ఒకటి వెలుగు చూసింది. కేవలం ఉద్యోగం కోసం వెంపర్లాడకండి. నాలుగు గంటల పాటు రిక్షా నడపండి. మధ్యాహ్న సమయాన్ని మీ పిల్లలతో గడపండి అంటూ ఆయన నిరుద్యోగులకు హితవు చెప్పారు. ఈనెల 23న లక్నోలో భారత్ ట్యాక్సీ సేవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. యువతకు స్వయం ఉపాధి ఒక ప్రత్యామ్నాయమని పాఠక్ సూచించినట్టు సమాచారం.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. యువతకు మీరిచ్చే నిర్మాణాత్మక సలహా ఇదేనా అంటూ వారు ఆయనపై విమర్శలు గుప్పించారు. దేశంలోని యువత ఎదుర్కొంటున్న సవాళ్లకు దూరంగా చాలా మంది నాయకులు తమ పిల్లలను విదేశాల్లో చదువుకోవడానికి పంపారని నెటిజన్లు విమర్శించారు. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ నేత పుష్పేంద్ర సరోజ్ ఎక్స్ వేదికగా పాఠక్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.