Revanth Reddy | బఫర్ జోన్ అంటరు! రోడ్డు విస్తరణ అంటరు!మూసీ అంటరు! ప్రాజెక్టు అంటరు! పేరేదైనా కానీ పేదలపైనే పగ! అమాయకుల భూమిపైనే కన్ను! కట్టేది ఉంటదో, ఉండదో తెల్వదుగాని.. కొలుచుడు, కూల్చుడే పని. ప్రభుత్వ పెద్దలు చెరువు మధ్యన భవంతులు కట్టుకున్నా, అధికారం అండతో పెద్దపెద్దోళ్లు శిఖంలో లేక్‌వ్యూ సౌధాలు నిర్మించుకున్నా నిద్ర నటిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. బడుగుల బస్తీలపై మాత్రం నిర్దయగా విరుచుకుపడుతున్నది. నెత్తి మీది నీడను, కాళ్లకింది నేలను లాగేసుకుంటున్నది.
జీహెచ్ఎంసీ వస్తది. హైడ్రా వస్తది. జిల్లాల్లో అయితే రెవెన్యూ పటాలం దిగుతది. పట్టణాల్లో అయితే మున్సిపాలిటీ రూపంలో ముంచుకొస్తది. ఎవరొచ్చినా.. వెంట బుల్డోజర్ వస్తది. తెల్లవారకముందే ఇంటిమీదికి పంజా విసురుతది. హతాశులై తేరుకోకముందే శిథిలాల మధ్య కూర్చోబెడుతది. బుల్డోజర్ను నడిపేది ఎవరైనా..కూలుతున్నది మాత్రం గరీబోడి గూడు, గుడిసెలు!బజారున పడుతున్నది పేదోడి బతుకు!
తాము కట్టని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కాంగ్రెస్ రంగులేసుకున్న ప్రభుత్వమిది. ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తమని ఒకవైపు నమ్మబలుకుతూనే.. ఇంకోవైపు వందల సంఖ్యలో ఇండ్లు కూలగొడ్తున్నది.
ఒకనాటి కాంగ్రెస్ మాట.. రోటీ కపడా మకాన్! రేవంత్ సర్కార్ తిరగరాస్తున్న నిర్వచనం..బఫర్, బుల్డోజర్ ఔర్ బర్బాద్!
వరంగల్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హైదరాబాద్/(స్పెషల్ టాస్క్ బ్యూరో);రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి పేదోడిమీద పగబట్టింది. కాంగ్రెస్ కాలనాగై కాటువేస్తూ బుల్డోజర్ కోరలు చాస్తున్నది. అదే పెద్దోడిని మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. తరం మారిన కొద్దీ కాంగ్రెస్ తన రూపును మార్చుకున్నది. రాజ్యాంగం కల్పించిన శ్రేయోరాజ్య ఆదర్శాలపై రేవంత్ బుల్డోజర్ నాట్యం చేస్తున్నది. పేదల ఇండ్లను బుగ్గిపాలు చేస్తున్నది. తల్లిఒడిలో ఆదమరచి నిద్రిస్తున్న పసిపిల్లల కలను ఛిద్రం చేస్తున్నది.
మంచానపడిన వృద్ధులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. ఇవ్వాళ ఖమ్మం..అంతకుముందు సున్నం చెరువు, ఖాజాగూడ చెరువు, వేములవాడ, హైదరాబాద్ ఇలా.. ఆ ప్రాంతం..ఈ ప్రాంతం.. ఈ జిల్లా, ఆ జిల్లా అని లేదు ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు రేవంత్ సర్కార్ వేయితలల విషనాగై తెలంగాణ మీదికి బుల్డోజర్ను విడిచింది. ఇందిరమ్మ రాజ్యమంటే బుల్డోజర్ రాజ్యమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పకనే చెప్తున్నరు. దాదాపు 27 నెలల పాలనలో రేవంత్ హయాంలో సాగుతున్న ఈ విధ్వంస బుల్డోజర్ పాలనను సింహావలోకనం చేసుకొంటే.. కూలిన గోడలు.. కన్నీటి జాడలు.. చితికిన బడుగుల బతుకులే కనిపిస్తాయి.
పేదోళ్ల ఇండ్లు మటాష్!!
22.09.2024 కూకట్పల్లి, మేడ్చల్ జిల్లా పన్ను కడుతున్నా.. కనికరించరే..

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని నల్లచెరువు సమీపంలో పట్టాలు కలిగిన భూముల్లో ఏర్పాటు చేసిన రేకులషెడ్లపైకి కూడా ప్రభుత్వం హైడ్రాను ప్రయోగించింది. ఆస్తి పన్ను చెల్లిస్తూ.. నల్లా, విద్యుత్తు కనెక్షన్ కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వం అమానవీయంగా కూల్చివేతలకు పాల్పడటం దారుణమని బాధితులు విలపించారు.
22.09.2024 నల్లచెరువు, కూకట్పల్లి ముగ్గురు ఆడ పిల్లలు.. అన్యాయం చేయొద్దు

నల్లచెరువు సమీపంలో ఓ ఖాళీ స్థలాన్ని కిరాయికి తీసుకొన్న రవి.. కోటి రూపాయల పెట్టుబడితో అక్కడ ఓ షాపు నిర్మించాడు. అయితే, హఠాత్తుగా వచ్చిన హైడ్రా అధికారులు ఆ షాపును కూల్చేశారు. తనకు ముగ్గురు ఆడకూతుళ్లు ఉన్నారని, తమ జీవనాధారాన్ని పోగొట్టవద్దని వేడుకున్నా కనికరించలేదు.
15.06.2025 వేములవాడ, సిరిసిల్ల జిల్లా విధ్వంస విస్తరణ

వేములవాడలో రోడ్ల విస్తరణ పేరిట రేవంత్ ప్రభుత్వం ప్రజల ఇండ్లు, దుకాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేసింది. ఆలయ సమీపంలో దశాబ్దాలుగా చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు రోడ్డునపడ్డారు. పరిహారం ఇవ్వకుండానే తమ బతుకులతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బాధితులు మండిపడుతున్నారు.
22.09.2024అమీన్పూర్, సంగారెడ్డి జిల్లా గుమ్మడికాయ కూడా చెక్కుచెదరలే…

కడుపు కట్టుకొని, పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ముతో సొంతింటి కల నెరవేర్చుకున్న మధ్యతరగతి ప్రజల కలలను కాంగ్రెస్ సర్కార్ కాలరాస్తున్నది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడలో సత్యనారాయణ అనే ఉద్యోగి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకోగా.. గృహప్రవేశమైన ఆరు రోజులకే హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఏండ్ల కల నేలమట్టమైంది. గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ కూడా అట్లాగే ఉన్నదంటూ బాధితుడు చూపుతున్న ఫొటో ఇది.
11.02.2025 దేవేంద్రనగర్, మేడ్చల్ జిల్లా ఖాళీ చేస్తాం సారూ.. ఆగుండ్రీ

మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని దేవేంద్రనగర్లో బడుగు జీవుల బతుకులను హైడ్రా కుప్పకూల్చింది. చిన్నచిన్న రేకులషెడ్లు, అట్ట గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారిని తరిమేసింది. ‘కొంత సమయం ఇస్తే ఖాళీ చేస్తాం.. కాస్త ఆగుండ్రి సార్లూ’ అని ఆ బడుగులు చేసిన విజ్ఞప్తులను పెడచెవిన పెట్టి కర్కశంగా వ్యవహరించింది.
27.08.2024, ఖమ్మం నమ్మినం.. నట్టేట మునిగినం

ఖమ్మం మున్సిపాలిటీ పరధిలోని పేదల రేకుల షెడ్లపైకి సర్కార్ బుల్డోజర్లను పంపింది. బతుకుదెరువును దూరం చేయొద్దని వేడుకున్నా కనికరించలేదు. బుల్డోజర్లకు అడ్డంపోయిన వారిని ఈడ్చిపారేశారు. కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట మునిగినమని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
28.08.2024 ఆదర్శనగర్, మహబూబ్‌నగర్ దివ్యాంగుల ఆశ్రమాన్నీ వదలి పెట్టలె

అడవుల నరికివేత నుంచి ఆదివాసీల భూములను లాక్కొనే వరకూ వెళ్లిన కాంగ్రెస్ సర్కార్ చివరకు దివ్యాంగులనూ విడిచిపెట్టలేదు. మహబూబ్‌నగర్ జిల్లా ఆదర్శనగర్‌లో అధికారులు పలు ఇండ్లను నేలమట్టం చేశారు. దివ్యాంగుల ఆశ్రమాన్ని కూడా పడగొట్టడంతో వాళ్లు రోడ్డునపడే దుస్థితి దాపురించింది.
01.10.2024 శంకర్‌నగర్, సైదాబాద్ బాపూ.. ఎన్ని రాళ్లు పేరిస్తే ఇల్లవుతుందో?

సైదాబాద్‌లోని శంకర్‌నగర్‌లో మూసీపరీవాహక ప్రాంతంలోని 150 ఇండ్లను అధికారులు నేలమట్టం చేశారు. రోజంతా బుల్డోజర్లు, జేసీబీల హోరుతో పిల్లలు భయభ్రాంతులకు లోనయ్యారు. వస్తువులను తీసుకొంటామని బాధితులు అడిగినా అధికారులు పట్టించుకోలేదు. తమ పుస్తకాలు తీసుకొంటామని చిన్నారులు వేడుకొన్నా కనికరించలేదు.
31.01.2024 ఖాజాగూడ ఖాజాగూడపై కర్కశం

పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చి షెడ్లలో తలదాచుకొన్న బడుగుల జీవితాలను అధికారులు రోడ్డున పడేశారు. ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పేరిట 15 రేకుల షెడ్లను బుల్డోజర్లతో కూల్చేయడంతో కట్టుబట్టలతో, వస్తువులను చేతబట్టుకొని పలు కుటుంబాలు గుండెలవిసేలా రోదించాయి.
24.01.2025 వరంగల్ బీఆర్ఎస్ లీడర్‌దా.. కూల్చేయ్!

అన్ని అనుమతులు ఉన్నా.. ఆక్రమించిన స్థలం కాకున్నా.. బీఆర్ఎస్కు చెందిన నాయకుడు అన్న ఒకే ఒక్క కారణంతో కొడకండ్ల సదాంత్కు చెందిన బేకరీని అధికారులు కూల్చేశారు. ఎందుకు కూలుస్తున్నారని కారణం అడిగినప్పటికీ చెప్పలేదు. దళిత బిడ్డ షాపును కూల్చడంపై స్థానికులు మండిపడ్డారు.
30.03.2025 కంచగచ్చిబౌలి, హైదరాబాద్ హెచ్‌సీయూ ఆగమాగం

సుమారు 400 ఎకరాల అటవీ భూములను ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు కంకణం కట్టుకున్న రేవంత్ ప్రభుత్వం.. హైదరాబాద్‌కు ఆక్సీజన్లాంటి కంచగచ్చిబౌలిలోని అడవిని విధ్వంసం చేసింది. ఇందుకోసం రాత్రికి రాత్రే వందలాది బుల్డోజర్లను దింపి, 100 ఎకరాల అడవిని నేలమట్టం చేసింది. పర్యావరణ విధ్వంసానికి పాల్పడింది. వన్యప్రాణులకు ఆవాసాలను దూరం చేసింది.
23.09.2024మల్లాపూర్, హైదరాబాద్ కేసీఆర్ అన్నా.. నువ్వు రావాలి

పొట్ట పోసుకోవడానికి ఓ కుటుంబం చెప్పుల దుకాణాన్ని నడిపించుకొంటూ ఉంటే, హైడ్రా బుల్డోజర్లు ఆ షెడ్డును నేలమట్టం చేశాయి. దీంతో గుండెలవిసేలా రోదించిన ఆ తల్లీ కొడుకులు.. ‘కేసీఆర్ అన్నా ఎక్కడున్నావ్.. నువ్వు రావాలి’ అంటూ మొరపెట్టుకొన్నారు.
04.02.2025 చారగొండ, నాగర్‌కర్నూల్ చిన్నారినీ ఎత్తిపారేశారు

బైపాస్ నిర్మాణంలో భాగంగా కూల్చివేతలు చేపట్టారు. అయితే ప్రత్యామ్నాయం చూపకుండా ఇండ్లు కూల్చడానికి వీల్లేదని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించి… అర్ధరాత్రి ఇండ్ల కూల్చివేత చేపట్టింది. తమ ఇండ్లు కూల్చొద్దని
వేడుకుంటున్న పెద్దలతో పాటు చిన్నారులను కూడా పోలీసులు ఇలా ఈడ్చివేశారు. ‘మేడమ్.. ప్లీజ్.. మా ఇల్లు కూల్చొద్దు’ అని
ఓ చిన్నారి వేడుకొన్నా వదల్లేదు.
పెద్దోళ్ల కబ్జాలు సేఫ్!!
పొంగులేటీ.. ఈ ఇంద్రభవనాలేంటీ?

హిమాయత్‌సాగర్‌కు ఆనుకొని ఉన్న ఈ అద్భుతమైన ఇంద్ర భవనాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన సోదరుడికి చెందినవి. ఎరుపు రంగు రూఫ్టైల్స్తో మెరిసిపోతున్న విలాసవంతమైన నిర్మాణం పొంగులేటిది కాగా.. నలుపు రంగు షెడ్స్ ఉన్నవి ఆయన సోదరుడివి. వాస్తవానికి ఈ గెస్ట్‌హౌస్‌లు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నా.. హైడ్రా బుల్డోజర్లు అటువైపు చూడనే చూడవు!!
‘పట్నం’ వారి పోకడ ఇది

నీటి మధ్యలో ఐల్యాండ్. అందులో ఎంతో అందమైన భారీ భవంతి. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి చెందిన అద్భుతమైన విల్లా ఇది. లేక్‌వ్యూ పాయింట్ కోసమని చెరువు గట్టున విల్లా కట్టుకోవడం చూసే ఉంటాం. అయితే, ఆయన ఏకంగా హిమాయత్‌సాగర్ ఎఫ్‌టీఎల్‌లోనే గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. అయినా బుల్డోజర్లు అటువైపునకు కనెత్తి కూడా చూడట్లేదు.
వివేకమైన Vస్తరణ స్టోరీ!

ఎర్రని నేలల్లో, పచ్చటి చెట్ల మధ్య తెల్లని పాలరాతి భవనంలా మెరిసిపోతున్న ఈ భారీ ఫామ్‌హౌస్ మంత్రి వివేక్ వెంకటస్వామిది. దశాబ్దాల కిందటనే పూర్తిగా బఫర్‌జోన్‌లో ఈ ఫాంహౌస్ నిర్మాణం జరిగింది. కొంతకాలం కిందట మరో బహుళ అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించారు. అదైతే పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. అయినా హైడ్రా అధికారులు వివేకంతో ఆలోచించట్లేదు.