ముంబై: బీహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడించిన జేఎస్పీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత్రి సునేత్రా పవార్‌ను కలిశారు. ముంబైలోని ఆమె నివాసంలో వారిద్దరూ సమావేశమయ్యారు. (Sunetra Meets Prashant) అయితే రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్, సునేత్రా పవార్‌ను కలుసుకోవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆమె భర్త, నాటి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన తర్వాత వారిద్దరూ సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది. కొన్ని నెలల క్రితం జరిగిన మొదటి భేటీపై సునేత్రా కుమారుడు, ఎన్సీపీ నేత పార్థ్ పవార్ వివరణ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ తమ కుటుంబానికి సుపరిచితులేనని ఆయన తెలిపారు.
కాగా, గతంలో నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకుల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్, సునేత్రా పవార్‌తో భేటీ కావడంపై బీజేపీకి చెందిన రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవంకులే స్పందించారు. మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో ఎలాంటి విభేదాలు తలెత్తేలా లేదా కూటమిలో చీలికకు దారితీసేలా వ్యవహరించవద్దని ఆమెకు సూచించారు. ‘ఇది వారి పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం. అయితే, ‘మహాయుతి’ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు, మిత్రపక్షాల మధ్య అనుమానాలు కలిగించేలా లేదా ఏ పార్టీకైనా నష్టం కలిగించేలా ఎటువంటి చర్య తీసుకోకూడదు. ప్రతి ఒక్కరూ మహాయుతి నియమావళికి కట్టుబడి ఉండాలి’ అని ఆయన అన్నారు.