చిత్రం: డీసీ
నటీనటులు: లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి, సంజయ్ కృష్ణమూర్తి, అవినాష్ రఘుదేవన్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: ముకేశ్
ఎడిటింగ్: ప్రసన్న జీకే
నిర్మాత: కళానిధి మారన్
రచన, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
విడుదల తేదీ: 07-08-2026
సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న లోకేశ్ కనగరాజ్, మెగాఫోన్ పక్కన పెట్టి తొలిసారిగా పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డీసీ’. విలక్షణ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథ
ప్రభుత్వ ఆయుధాలను రవాణా చేస్తున్న వాహనాన్ని దేవదాస్ (లోకేశ్ కనగరాజ్) అండ్ గ్యాంగ్ అత్యంత వ్యూహాత్మకంగా అడ్డగించి లూటీ చేస్తుంది. ఆ లూటీ చేసిన గన్‌తోనే ఒక ఎస్సైని దారుణంగా హత్య చేయడంతో, పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసును సవాల్‌గా తీసుకుని ఓ స్పెషల్ టీమ్‌ను రంగంలోకి దించుతుంది. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో దేవదాస్ గ్యాంగ్ ఒక లాడ్జిలో ఆశ్రయం పొందుతుంది. అక్కడ బార్లో పాడుకునే పార్వతి (సంజయ్ కృష్ణమూర్తి)తో దేవదాస్‌కు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే అనూహ్యంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో పార్వతి మరణిస్తుంది. ఆ తర్వాత పోలీసుల కంటపడకుండా తిరుగుతూ, వేశ్యవాటికలో చిక్కుకున్న చంద్రిక (వామికా గబ్బి)ని దేవదాస్ కలుస్తాడు. అసలు దేవదాస్ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఎస్సైని హత్య చేయాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది? చంద్రికను కలిశాక అతడి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేదే ఈ చిత్ర అసలు కథ.
విశ్లేషణ
“తప్పు చేస్తే దండించడానికి పోలీసులు వస్తారు.. కానీ, ఆ పోలీసులే తప్పు చేస్తే ఎవరిని ప్రశ్నించాలి?” అనే ఆసక్తికరమైన మరియు పవర్ఫుల్ పాయింట్‌తో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ కథను నడిపించారు. ఇదొక క్లాసిక్ రివెంజ్ డ్రామా అయినప్పటికీ, ఇందులో ప్రేమ, స్నేహం, వ్యవస్థలోని లోపాలను చూపించే ప్రయత్నం చేశారు. అయితే కథాకథనాల విషయంలో దర్శకుడు మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంది. సినిమా ప్రథమార్ధం చాలా నెమ్మదిగా, సాగదీతగా అనిపిస్తుంది. ఆయుధాల లూటీ, ఎస్సై హత్య, ఆ తర్వాత దేవదాస్ పరారీ, పార్వతితో నడిచే లవ్ ట్రాక్ వంటి సన్నివేశాలు ప్రేక్షకుడిని పెద్దగా ఆకట్టుకోలేవు. ఎప్పుడైతే పోలీసుల కాల్పుల్లో పార్వతి పాత్ర అంతమవుతుందో, అప్పుడే కథ అసలు రూపం సంతరించుకుని వేగం పుంజుకుంటుంది. ఇక ఇంటర్వెల్ బ్యాక్‌లో వచ్చే యాక్షన్ బ్లాక్ సినిమా స్థాయిని ఒక్కసారిగా పైకి లేపుతుంది. ద్వితీయార్ధమే ఈ చిత్రానికి అసలైన ప్రాణం అని చెప్పవచ్చు. దేవదాస్, చంద్రికల మధ్య నడిచే ఎమోషనల్ సీన్స్ సినిమాను నిలబెట్టాయి. డబ్బు కోసం చంద్రిక వేసే ప్లాన్, పోలీసులకు దొరికిపోయిన దేవదాస్‌ను రక్షించడానికి ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లే సన్నివేశం సినిమాలోనే హైలైట్‌గా నిలుస్తుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే హెవీ యాక్షన్ సీక్వెన్స్, దానికి ముగింపుగా ఇచ్చిన ఎమోషనల్ టచ్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది.
నటీనటుల ప్రతిభ..
దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన లోకేశ్ కనగరాజ్, నటుడిగా తన మొదటి ప్రయత్నంలోనే మంచి పరిణతి చూపించారు. నటనకు పెద్దగా ఎక్స్ప్రెషన్స్ స్కోప్ లేని సీరియస్ రోల్ అయినప్పటికీ, తన బాడీ లాంగ్వేజ్‌తో యాక్షన్ సీన్లలో అదరగొట్టేశారు. ఇక ఈ సినిమాకు అసలైన షో స్టాపర్ మాత్రం వామికా గబ్బి. చంద్రిక పాత్రలో ఆమె జీవించిన తీరు, అభినయం, హావభావాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సెకండాఫ్‌లో ఆమె నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
సాంకేతికంగా
ఈ చిత్రానికి ప్రధాన బలం అనిరుధ్ రవిచందర్ సంగీతం. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎలివేట్ చేసింది. ఇంటర్వెల్ బ్లాక్, పోలీస్ స్టేషన్ సీన్లలో అనిరుధ్ మ్యూజిక్ థియేటర్లలో గూస్బంప్స్ తెప్పిస్తుంది. ముకేశ్ సినిమాటోగ్రఫీ రా అండ్ రస్టిక్ మూడ్‌కు తగ్గట్టుగా చాలా నేచురల్‌గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పిగా ఉంటే సినిమా మరింత వేగంగా ఉండేది. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మరికొంత కసరత్తు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
ప్లస్ పాయింట్స్:
లోకేష్, వామికా గబ్బిల అద్భుతమైన నటన
విరామ సన్నివేశాలు (ఇంటర్వెల్ బ్లాక్)
ద్వితీయార్ధం నడిపిన తీరు
అనిరుధ్ నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
చాలా నెమ్మదిగా సాగే ప్రథమార్ధం
ఆశించిన స్థాయిలో బలమైన ఎమోషన్స్ కొద్దిగా మిస్ అవ్వడం
చివరిగా రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, రా అండ్ రస్టిక్ యాక్షన్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది.