RBI | న్యూఢిల్లీ, మే 10: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను కేంద్ర ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల డివిడెండ్‌ను చెల్లించవచ్చని తెలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్లో మోదీ సర్కారు ప్రకటించిన బడ్జెట్లో ఆర్బీఐతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్ రావచ్చని అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను తెచ్చిన బడ్జెట్‌కు సంబంధించి తర్వాతి కాలంలో చేసిన సవరణల్లో ఇది రూ.1.05 లక్షల కోట్లుగా ఉన్నది. నిజానికి తొలుత రూ.48,000 కోట్లుగానే అంచనా వేశారు. అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను ఆర్బీఐ రూ.87,416 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. దీంతో బడ్జెట్ అంచనాలు పెరిగాయి. ఇక ఈసారి అంచనాలో సుమారు లక్ష కోట్లు ఆర్బీఐ నుంచే డివిడెండ్‌గా వెళ్లవచ్చన్నదే ఇక్కడ ప్రాధాన్యతాంశం. మరోవైపు ఈ డివిడెండ్‌ను చెల్లించేందుకు ఆర్బీఐ సైతం తగువిధంగా సిద్ధమవుతున్నట్టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ద్వారా తెలుస్తున్నది.
కేంద్ర ప్రభుత్వానికి ఏటేటా ఆర్బీఐ అంతంత మొత్తాల్లో డివిడెండ్లు చెల్లించడం వెనుక.. ఆర్బీఐ రిజర్వుల్లో ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తులే కీలకంగా నిలుస్తున్నాయి. వడ్డీ ఆదాయం కూడా ప్రధాన భూమికే పోషిస్తున్నది. ఆర్బీఐ రిజర్వుల్లో 70 శాతం విదేశీ కరెన్సీ ఆస్తులే. 20 శాతం దేశీయ ప్రభుత్వ బాండ్లున్నాయి. వీటితోపాటు ఆర్బీఐ నిర్వహించే వివిధ ద్రవ్య కార్యకలాపాలతో వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో ఉంటున్నది. అయితే ఫారెక్స్ మార్కెట్లో ఒడిదొడుకులు.. ఆర్బీఐకి షాక్ ఇస్తున్నాయి. మొత్తానికి అధిక ద్రవ్యోల్బణం, వర్షాభావ పరిస్థితులు, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు సవాల్ విసురుతున్న ప్రస్తుత తరుణంలో ఆర్బీఐ దగ్గర తగినన్ని నగదు నిల్వలుండాల్సిన అవసరం ఉందని ఆర్థిక విశ్లేషకుల మాట.
దేశ ఆర్థిక, ద్రవ్య వ్యవస్థలకు ఆర్బీఐనే వెన్నెముక. అలాంటి ఆర్బీఐని కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటిగా మోదీ సర్కారు చూడటం కలవరపెడుతున్నది. అందుకు ఈ అధిక డివిడెండ్ చెల్లింపులే నిదర్శనం. మోదీ హయాంలో ఆర్బీఐ చెల్లించిన డివిడెండ్లు రూ.6,62,455 కోట్లుగా ఉన్నాయి. 2023-24 డివిడెండ్‌నూ కలిపితే రూ.7 లక్షల కోట్లపైనే. నిజానికి ఆర్బీఐ దగ్గరున్న మిగులు నిల్వలపై ఎప్పట్నుంచో కన్నేసిన బీజేపీ ప్రభుత్వం.. వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే చూస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో, ఆ తర్వాత వచ్చిన ఉర్జిత్ పటేల్‌తో కేంద్రానికి గొడవలు మొదలయ్యాయి. ఇక ఉర్జిత్ పటేల్ రాజీనామా వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది. అలాగే ఆర్బీఐ వ్యవహారాల్లో కేంద్ర జోక్యంపైనా విమర్శలు చెలరేగిన సంగతి విదితమే. కాగా, ఆర్బీఐ దగ్గర ఎన్ని నగదు నిల్వలుంటే అంత మంచిదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆపత్కాలంలో, సంక్షోభ సమయంలో ఈ నగదు నిల్వలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొండంత అండగా ఉంటాయని పేర్కొంటున్నారు. కానీ కేంద్రం ముక్కుపిండి వసూలు చేస్తున్న డివిడెండ్లు.. ప్రమాదం తెచ్చిపెట్టవచ్చని హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయిలో తీసుకుంటున్న డివిడెండ్లు సరికాదన్న అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చుతున్నారు.
Rbi