మునుగోడు, మార్చి 08 : డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాకు 1.5 టీఎంసీ నీరు, అలాగే నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి 0.5 టీఎంసీ నీరు అందించాలని మొదట ప్రణాళిక రూపొందించబడింది. ఈ నీరు మునుగోడు ప్రాంతంలోని రైతులకు అత్యంత కీలకమైన సాగునీటి వనరు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని సాంకేతిక మార్పులు మునుగోడు రైతులకు తీవ్ర అన్యాయం చేసే పరిస్థితి కనిపిస్తోందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. శివన్నగూడెం వద్ద ఉన్న కాల్వలో ముందుగా 436 మీటర్ల లెవెల్ వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేయబడింది. కానీ ఇప్పుడు అదే కాల్వలో రెగ్యులేటర్‌ను 440 మీటర్ల లెవెల్‌కు మార్చడం జరిగింది. ఈ మార్పు వల్ల ముందుగా రోజుకు సుమారు 6 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించే అవకాశం ఉండగా, ఇప్పుడు అది కేవలం 1,200 క్యూసెక్కుల వరకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.
దీని ప్రభావం చాలా తీవ్రమైందని, మునుగోడు నియోజకవర్గంలోని సుమారు 2 లక్షల ఎకరాల సాగుభూమికి సరైన నీరు అందకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ఇది రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితి అన్నారు. ఇప్పటికే మునుగోడు ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారని, తాగునీటిలో అధిక ఫ్లోరైడ్ కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అలాంటి పరిస్థితిలో సాగునీరు కూడా తగ్గిపోతే ఇది మునుగోడు ప్రజలకు మరో పెద్ద అన్యాయం అవుతుందన్నారు. అందుకే తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే సంబంధిత అధికారులను గట్టిగా కోరుతున్నట్లు వెంటనే ఈ విషయంపై సాంకేతికంగా సమీక్ష చేసి, ముందుగా ఉన్న విధంగా నీటి ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మునుగోడు రైతుల హక్కు అయిన సాగునీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకూడదని, మునుగోడు ప్రజల హక్కుల కోసం తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు.