రంగారెడ్డి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటర్ల ముసాయిదా జాబితా నేడు విడుదలైంది. గతంలో రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 24,12,652 ఓటర్లకు తగ్గింది. 12,87,091 ఓట్లు గల్లంతయ్యాయి. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో పట్టణ ప్రాంత ఓట్లే గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్ శివారుల్లో విస్తరించి ఉన్న జిల్లాలో వలస ఓటర్లు అధికంగా ఉండటంతో ఎస్ఐఆర్ ద్వారా ఈ ఓట్లన్నీ కోల్పోవల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 12,12,381 పురుషుల ఓట్లుండగా.. 12,00,062 స్త్రీలు., 209 థర్డ్ జండర్స్ ఓట్లున్నాయి.\

వికారాబాద్లో..
వికారాబాద్, ఆగస్టు 17, (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదులో భాగంగా సోమవారం ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. 2011 ఓటరు జాబితా ప్రకారం వికారాబాద్ జిల్లాలో 10,17,671 మంది ఓటర్లుండగా.. ప్రస్తుతం 8,07,374 మంది ఓటర్లకు తగ్గింది. 2,10,297 ఓట్లు గల్లంతయ్యాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 2,10,297 ఓట్లకు సంబంధించి ఏఎస్డీ(గైర్హాజరు, వలస వెళ్లినవారు, మరణించినవారు) ఓట్లు ఉన్నట్లు గుర్తించి తొలగిస్తూ ముసాయిదాను ప్రకటించారు. తాండూరు నియోజకవర్గంలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి.

అభ్యంతరాలు, మార్పుల సవరణ కోసం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాస్థాయిలో ఓటరు ముసాయిదా జాబితాలు విడుదల అయినందున ప్రతి ఓటరు తమ పేరు, ఇతర వివరాలను ఓటరు లిస్టులో పరిశీలించుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు నారాయణరెడ్డి, దీపక్తివారీ సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులున్నా, మార్పులు, సవరణలు ఉన్నట్లయితే సంబంధిత ఎన్నికల అధికారిని సంప్రదించి సెప్టెంబర్ 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముసాయిదా జాబితాపై అందిన క్లెయిమ్లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి తుది ఓటరు జాబితా రూపొందిస్తామని తెలిపారు. తొలగించిన ఓట్లకు సంబంధించి నేటి నుంచి నోటీసులు జారీ చేయనున్నట్లు.. సంబంధిత ఓటర్లు సరైన రుజువులు చూపిస్తే జాబితాలో ఉంచి, మిగతా ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.