యాదాద్రి భువనగిరి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ):సర్‌లో భాగంగా ఓటరు ముసాయి దా జాబితా విడుదలైంది. సోమవారం జిల్లా అధికారులు జాబితాను ప్రకటించారు. ఆయా మండలాల్లోని కార్యాలయాల్లో జాబితాను ప్రచురించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6,22,561 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 3,09,309 మంది పురుషులు, 313236 మంది మహిళలతోపాటు 16 మంది ఇతరులు ఉన్నారు. భువనగిరి నియోజకవర్గంలో 2,06,009 మంది, ఆలేరులో 2,27,813 మంది ఓటర్లు ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలో 62,393 మంది, నారాయణపురంలో 38,025 మంది, తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరులో 25,192 మంది, అడ్డగూడూరు మండలంలో 21,225 మంది, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేటలో 41,906 మంది ఓటర్లున్నారు.
ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దేందుకు, చనిపోయిన లేదా ఇండ్లు మారిన వారి ఓట్ల తొలగింపు, డూప్లికేట్, డబుల్ ఓట్లను తీసేయడం, కొత్త ఓటర్లను చేర్చేందుకు దేశ వ్యాప్తంగా సర్ కార్యక్రమానికి కేంద్ర ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా షెడ్యూల్ విడుదలైంది. గత నెల 24లోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా, కొన్ని జిల్లాల్లో ఆలస్యం కావడంతో రెండు సార్లు రీషెడ్యూల్ చేశారు. ఈ నెల 11న సర్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. సోమవారం ఓటర్ల జాబితా విడుదల చేశారు. సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. దీంతో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 19న తుది జాబితా విడుదల చేస్తారు.
సూర్యాపేటలో 9,11,945 మంది ఓటర్లు..
సూర్యాపేట జిల్లాలో 9,11,945 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో 4,47,090 మంది పురుషులు, 4,64,806 మంది మహిళలతోపాటు ఇతరులు 49 మంది ఉన్నారు. హుజూర్ నగర్లో 2,27,398 మంది ఓటర్లు, కోదాడలో 2,21,879 మంది, సూర్యాపేటలో 2,20,335 మంది, తుంగతుర్తిలో 2,42,333 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సర్‌లో భాగంగా 26059 మంది మరణించినట్లు గుర్తించారు. వీరిలో 48310 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, 13016 మంది ఇప్పటికే నమోదైనవారు, 6862 మంది గైర్హాజరైనవారు, 2060 మంది ఇతర కారణాల మూలంగా ఫారాలు తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లాలో 13,57,618 మంది ఓటర్లు..
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): సర్ ప్రక్రియ అనంతరం నల్లగొండ జిల్లాలో ఓటర్ల సంఖ్య 13,57,618 తేలింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పిస్తూ వచ్చేనెల 16వ తేదీ వరకు దీన్ని కొనసాగించనున్నారు. తర్వాత అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం చేసిన అనంతరం తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 18వ తేదీన ప్రచురించనున్నారు. అయితే సర్ ప్రక్రియ కంటే ముందు జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 15,16,253 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. దేవరకొండలో గతంలో 2,69,098 ఓట్లు ఉండగా తాజాగా 2,32,283 మంది ఫారాలు రిటర్న్ వచ్చాయి.
ఇక్కడ 36,815 రాలేదు. నాగార్జునసాగర్‌లో మొత్తం 234722 మంది ఓటర్లకుగా గానూ 213408 మంది ఫారాలు సమర్పించగా 21314 మందివి రాలేదు. మిర్యాలగూడలో గతంలో 240574 ఉండగా తాజాగా 209162 మంది ఫారాలు రాగా 31412 మందివి రాలేదు. నల్లగొండలో 249571కి గానూ 217681 రిటర్న్ రాగా 31890 రాలేదు. మునుగోడులో 263757కి గానూ 246722 రిటర్న్ రాగా 17035 ఫారాలు రాలేదు. నకిరేకల్‌లో 258531 మందికి గానూ 238362 రిటర్న్ రాగా 20169 మందివి రాలేదు. జూన్ 25వ తేదీ నుంచి ఈనెల 10 తేదీ వరకు ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి వాటిని తిరిగి ఓటర్ల నుంచి స్వీకరించారు. ఇలా పంపిణీ చేసిన వాటిలో తిరిగి వచ్చిన ఫారాల్లో 13,57,607 ఫారాలను బీఎల్ఓలు వెరిఫై చేశారు.
వీటిల్లో 33,818 ఫారాలు అస్సలు మ్యాపింగ్ కాలేదు. పంపిణీ చేసిన ఫారాల్లో 1,58,635 ఫారాలు తిరిగి రాలేదు. వీటిల్లో చనిపోయిన వారివి 32,517, పర్మినెంట్ షిప్టింగ్ వాళ్లవి 1,00,144, ఇప్పటికే ఎన్రోల్ అయినవి 18834, అందుబాటులో లేనివాళ్లవి 6978, ఇతరులవి 162 ఫారాలు ఉన్నట్లుగా ప్రకటించారు. అయితే ముసాయిదా జాబితాలో ఉన్న ప్రకారం ఓటర్లను 2002 నాటి సర్ జాబితాతో పరిశీలిస్తారు. ఇందులో ఎవరైనా ఓటరు మ్యాపింగ్ సరిగ్గా లేకపోయినా…పేర్లు, అడ్రస్సు లాంటి వాటివి తప్పులు దొర్లినా వారందరికీ మరోసారి నోటీసులు జారీ చేస్తారు. ముసాయిదా జాబితాలోని ఏ ఒక్క ఓటరు ఓటను నోటీసు లేకుండా తొలిగించకూడదని ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు ఇచ్చింది.