హైదరాబాద్/నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆ రోపణలను చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ స హించేది లేదని, ఎంతటి వారినైనా కోర్టుకు ఈడ్చి బుద్ధి చెబుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు హెచ్చరించారు. గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటే ‘క్షుద్రపూజలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ నీచమైన ఆరోపణలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వారిపై గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా పిటిష న్ దాఖలు చేసిన అనంతరం కోర్టు ప్రాంగణంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కోర్టు తమ పిటిషన్‌ను స్వీకరించిందని, వచ్చే బుధవారం స్టేట్మెంట్లు రికార్డు చేసేందుకు పిలిచిందని వెల్లడించారు.
కాంగ్రెస్ నేతలు ఎన్ని గోబెల్స్ ప్రచారాలు చేసినా, కేసులు పెట్టి వేధించినా తమకు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉన్నదని, పరువు నష్టం కలిగించిన వారికి చట్టపరంగా శిక్ష పడేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు. ప్రజాసమస్యలను పకదారి పట్టించేందుకే ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అసెంబ్లీలోనూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో సభా హకుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినా స్పీకర్ పట్టించుకోవడం లేదని, ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించాల్సిన డిప్యూటీ స్పీకర్‌ను మూడేండ్లు గడిచినా నియమించలేదని తప్పుబట్టారు.
దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు సీఎం రేవంత్‌కు చెంపపెట్టు అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహి స్తూ రాజ్యాంగాన్ని కాలరాస్తున్న రేవంత్, అధికారం చేతిలో ఉన్నదని ఇష్టానుసారం వ్యవహరిస్తే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ కు తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న రా జ్యాంగ హననం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంపై ఆయనకు గౌ రవం ఉంటే వెంటనే పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయిం చి, ప్రజాక్షేత్రంలో ప్రజాతీర్పును ఎదురోవాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు.
హరీశ్‌రావు క్షుద్రపూజలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మె ల్సీ అద్దంకి దయాకర్‌పై దాఖలైన పరువునష్టం దావాను స్వీకరించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం విచారణ చే పట్టింది. ఎవరి మీద ఫిర్యాదు చేశారు? అని జడ్జి శ్రీదేవి కోర్టుకు హాజరైన హరీశ్‌రావును ప్రశ్నించారు. మహేశ్‌గౌడ్‌తోపాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు చెప్పారు. పత్రికలు, ప్రముఖ టీవీల్లో ప్రసారమైన క్లిప్పింగ్స్ కోర్టుకు సమర్పించారా? అని జడ్జి అడుగగా అవునని ఆయన తరఫున న్యాయవాది జీ కిరణ్‌కుమార్ కోర్టుకు తెలిపారు. వాంగ్మూలం నమోదుకు మళ్లీ రా వాలని జడ్జి తెలుపగా హరీశ్‌రావు అంగీకరించారు. 30న వాంగ్మూలం నమోదుకు హాజరుకావాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో సాక్షులుగా ఉన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌లను పిటిషన్లో పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్-356 కింద పరువు నష్టం దావాను సమర్పించడంతో కోర్టు విచారణ ప్రారంభించింది.