తెలంగాణలో కొత్త రాజకీయం
దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర రాజకీయ చిత్రమే పూర్తిగా మారిపోనున్నది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు, 119గా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు 179 వరకు పెరుగనున్నాయి.
- 27కు పెరుగనున్న మంత్రులు
- అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో పూర్తిగా మార్పులు
- 26 లోక్‌సభ, 179 అసెంబ్లీ స్థానాలు
- మహిళలకు 9లోక్‌సభ, 60 అసెంబ్లీ సీట్లు
- లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా మహిళా కోటా
- ఎస్సీలకు నాలుగుకు చేరనున్న సంఖ్య
- ఎస్టీలకు ప్రస్తుతం ఉన్నట్టే 2 సెగ్మెంట్లు
- మరో 3 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం
హనుమకొండ, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర రాజకీయ చిత్రమే పూర్తిగా మారిపోనున్నది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు, 119గా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు 179 వరకు పెరుగనున్నాయి. కొత్తగా మహిళలకు 60 అసెంబ్లీ స్థానాలు, 9 లోక్‌సభ స్థానాలు రిజర్వు కానున్నాయి. వచ్చే ఎన్నికల్లోనే ఈ మేరకు మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గ సగటు ఓటర్ల సంఖ్య, పరిధి తగ్గనున్నది. రాష్ట్రంలో ఎన్నికయ్యే చట్టసభల సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుంది.
నియోజకవర్గాల పునర్విభజనతో అన్ని రాజకీయ పార్టీల్లోని కొత్త నాయకులకు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే అవకాశం దక్కనున్నది. ఏండ్లుగా పోటీ చేసేందుకు ఎదురుచూస్తున్న వారికి రాజకీయంగా ప్రాధాన్యం పెరుగనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 3 లోక్‌సభ, 19 అసెంబ్లీ రిజర్వుడ్ స్థానాలు ఉన్నాయి. 15శాతం కోటా నేపథ్యంలో పునర్విభజన తర్వాత ఎస్సీలకు 4 లోక్‌సభ, 27 అసెంబ్లీ స్థానాలు రిజర్వు కానున్నాయి. ప్రస్తుతం ఎస్టీలకు రెండు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. పునర్విభజన తర్వాత లోక్‌సభ సెగ్మెంట్లలో మార్పులు ఉండకపోవచ్చు. అసెంబ్లీ స్థానాలు గరిష్ఠంగా 15 వరకు పెరిగే అవకాశం ఉన్నది.
లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా మహిళా కోటా
గత పునర్విజన ప్రక్రియలో అత్యధిక జనాభా ప్రాతిపదికన, ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ప్రాతినిధ్యం ఉండేలా ఎస్సీ, ఎస్టీ సీట్లను కేటాయించారు. కొత్త ప్రక్రియలోనూ ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది. నియోజకవర్గ పునర్విభజనలో తొలుత ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సీట్లను ఖరారు చేస్తారు. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ సీట్లను నిర్ధారిస్తారు. అత్యధిక మహిళా జనాభా ఉన్న సెగ్మెంట్లకు కాకుండా, ప్రతి లోక్‌సభ సెగ్మెంట్లోనూ సమానంగా ప్రాధాన్యం ఉండేలా మహిళా కోటా సీట్లను ఎంపిక చేయనున్నారు. పెరుగనున్న 26 లోక్‌సభ సెగ్మెంట్లలో గరిష్ఠంగా 9 సీట్లు మహిళకు దక్కనున్నాయి. 179 అసెంబ్లీ స్థానాల్లో 60 సీట్లు మహిళా కోటా కింద కేటాయిస్తారు.
గ్రేటర్ పరిధిలోనే అధికం!
2009 పునర్విభజనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య తగ్గి రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 8, హైదరాబాబాద్‌లో 2 అసెంబ్లీ సీట్లు పెరిగాయి. ఇప్పుడూ అదే జరుగనున్నది. 2011 జనాభా ప్రాతిపదికగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులో పేర్కొన్నది. ప్రస్తుత పునర్విభజనలోనూ అధిక జనాభా ఉన్న మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలోనే అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా పెరుగనున్నాయి.
గత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో లోక్‌సభ, అసెంబ్లీ సెగ్మెంట్లు పూర్తిగా మారాయి. 2009కి ముందు ఒక మండలంలోని గ్రామాలు వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉండేవి. మండలాల విషయంలోనూ ఇలాగే జరిగింది. 2009 పునర్విభజనలో వీటిని మార్చారు. రెవెన్యూ మండలం మొత్తం ఒకే అసెంబ్లీ సెగ్మెంట్లో, అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా పునర్విభజన జరిగింది. ఇపుడు మండలం మొత్తం ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే నిబంధన కొనసాగనున్నది.
27 మంది మంత్రులు
రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యుల్లో 15 శాతం మంది మంత్రులుగా ఉండాలని రాజ్యాంగపరంగా నిబంధన ఉన్నది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 119 ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా గరిష్ఠంగా 18 మందిని మంత్రులుగా నియమించుకొనే అవకాశం ఉన్నది. పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఎమ్మెల్యేల సంఖ్య 179కి పెరుగుతున్న నేపథ్యంలో మంత్రుల సంఖ్య 27కు పెరుగనున్నది.
2009లో భారీ మార్పులు
2009 పునర్విభజనలోనే లోక్‌సభ, అసెంబ్లీ సెగ్మెంట్ల స్వరూపాల్లో భారీగా మార్పులు జరిగాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు ఏర్పాటయ్యాయి. వీటిలో వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ ఎస్సీ క్యాటగిరీకి, ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎస్టీకి రిజర్వు అయ్యాయి. 2009 ఎన్నికల ముందు జనరల్ క్యాటగిరీలో ఉన్న వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ ఎస్సీ క్యాటగిరీకి మారింది. జనరల్ క్యాటగిరీలో ఉన్న ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం ఎస్టీకి మారింది. పెద్దపల్లి, నాగర్‌కర్నూలు పునర్విభజనకు ముందు, తర్వాత ఎస్సీ క్యాటగిరీలోనే కొనసాగాయి.
2009 ఎన్నికలకు ముందు ఉన్న హనుమకొండ, సిద్దిపేట (ఎస్సీ), మిర్యాలగూడ, భద్రాచలం(ఎస్టీ) స్థానాలు రద్దయ్యాయి. వీటి స్థానంలో మల్కాజిగిరి, చేవెళ్ల, జహీరాబాద్, భువనగిరి, మహబూబాబాద్ (ఎస్టీ) కొత్తగా ఏర్పాటయ్యాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీగా మార్పులు వచ్చాయి. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 సీట్లు రిజర్వు అయ్యాయి. పునర్విజన ప్రక్రియలో అత్యధిక జనాభా ప్రాతిపదికతోపాటు ప్రతి ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రాతినిధ్యం ఉండేలా ఎస్సీ, ఎస్టీ సీట్లను కేటాయించారు. నియోజకవర్గాల పునర్విభజనలో గతంలో ఉన్నవి రద్దయ్యాయి. కొత్త పేర్లతో ఏర్పాటయ్యాయి.
కొత్తగా ఏర్పడిన అసెంబ్లీ సెగ్మెంట్లు
కొత్తగా ఏర్పడినవి: బెల్లంపల్లి(ఎస్సీ), నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, ధర్మపురి(ఎస్సీ), రామగుండం, వేములవాడ, మానకొండూరు(ఎస్సీ), పటాన్చెరు, దుబ్బాక, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్‌పేట, జూబ్లీహిల్స్, నాంపల్లి, గోషామహల్, బహదూర్‌పుర, నారాయణపేట, దేవరకద్ర, నాగార్జునసాగర్, హుజూర్నగర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, భూపాలపల్లి,
- పినపాక(ఎస్టీ), వైరా(ఎస్టీ), అశ్వారావుపేట(ఎస్టీ),
- ఎస్సీలోనే కొనసాగుతున్నవి: చెన్నూరు, జుక్కల్, వికారాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, అచ్చంపేట, స్టేషన్ ఘన్‌ఫూర్.
- జనరల్ కేటగిరీ నుంచి ఎస్సీకి మారినవి : చొప్పదండి, జహీరాబాద్, చేవెళ్ల, అలంపూర్, తుంగతుర్తి, నకిరేకల్, వర్ధన్నపేట, మధిర, సత్తుపల్లి.
- ఎస్టీలోనే కొనసాగుతున్నవి: ఖానాపూర్, బోథ్, దేవరకొండ, ములుగు, ఇల్లందు, భద్రాచలం.
- జనరల్ నుంచి ఎస్టీకి మారినవి : డోర్నకల్, మహబూబాబాద్.
- ఎస్సీ రిజర్వు నుంచి జనరల్ : గజ్వేల్, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, ఆలేరు, పరకాల, పాలేరు.
- ఎస్సీ నుంచి ఎస్టీకి: ఆసిఫాబాద్
- పూర్తిగా రద్దయిన స్థానాలు: లక్సెట్టిపేట, డిచ్పల్లి, నిజామాబాద్, బుగ్గారం, ఇందుర్తి, మేడారం(ఎస్సీ), మెట్పల్లి, నేరెళ ్ల(ఎస్సీ), కమలాపూర్, రామాయంపేట, దొమ్మాట, హిమాయత్‌నగర్, ఆసిఫ్‌నగర్, మహారాజ్‌గంజ్, అమరచింత, చలకుర్తి, రామన్నపేట, చెన్నూరు, హనుమకొండ, వరంగల్, శాయంపేట, చేర్యాల, బూర్గంపాడు (ఎస్టీ), సుజాతనగర్.
గతంలో నాలుగుసార్లు పునర్విభజన
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన 1952, 1963, 1973, 2007లో జరిగింది. అసోం, జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేకంగా ఇటీవల నియోజకవర్గాల పునర్విభజన నిర్వహించారు. గతంలో జరిగిన దానికి భిన్నంగా ఈసారి పునర్విభజనలో లోక్‌సభ, అన్ని రాష్ర్టాల్లో అసెంబ్లీలో సీట్లు భారీగా పెరుగనున్నాయి. 33 శాతం సీట్లు మహిళలకు రిజర్వు కానున్నాయి. 1973 నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మొదలు పెట్టింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ అసెంబ్లీ సీటుతో ముగించింది. 2009లో దీనికి వ్యతిరేక దిశలో సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మొదలు పెట్టి ఇచ్చాపురం అసెంబ్లీ స్థానంతో ముగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో నియోజకవర్గాల క్రమసంఖ్య పరంగా సిర్పూర్ మొదటి స్థానం, భద్రాచలం 119వ సెగ్మెంట్‌గా ఉన్న. ప్రస్తుత విధానం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

