ఆకుకూరలు తింటే కంటి చూపు మెరుగవుతుంది. రక్తహీనత తగ్గుతుందనే ఎక్కువగా మాట్లాడుకుంటాం. జీర్ణ సమస్యలు ఉంటే ఫైబర్ అధికంగా ఉండే ఆకు కూరలు తింటే తగ్గుతాయని చెప్పుకొంటాం. ఇలా చెబుతూ పోతే ఆకుకూరలతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గడం, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవడం, రక్తంలో చక్కెరను నియంత్రించుకోవడానికి ఆహారంలో ప్రొటీన్ తప్పనిసరి చేస్తున్నారు. ఈ ప్రొటీన్ కోసం డబ్బు కూడా ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారు.
మార్కెట్లో మాంసం, పాలు, పప్పులు అధిక ధర పలుకుతున్నాయి. మిద్దెతోటలో పప్పులు పండించడం కష్టం. ఇళ్లలో కోళ్లు పెంచుకోవడం కష్టమైన పని. కాబట్టి అధిక ప్రొటీన్ల కోసం తోటకూర పెంపకం ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటికే చాలామంది మిద్దెతోటల్లో తోటకూర పెంచుతున్నారు. కానీ, నాలుగు ఆకులు రాగానే తెంపి వండుకుంటున్నారు. ఆకుల కంటే గింజలు తింటే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉందని చాలామందికి తెలియదు. కాబట్టి ఆకులు తెంపకుండా ఎదగినిస్తే ప్రతి మొక్క గుప్పెడు గింజలనిస్తుంది.
తోటకూర గింజల్లో సుమారు 14 శాతం ప్రొటీన్ ఉంటుంది. 100 గ్రాముల తోటకూర గింజలు తింటే 13.5 గ్రాముల ప్రొటీన్ శరీరానికి అందుతుంది. అర లీటరు పాలు తాగితే ఎంత ప్రొటీన్ శరీరానికి అందుతుందో 100 గ్రాముల తోటకూర గింజల నుంచి అంత అందుతుంది. కాబట్టి తోటకూర ఆకులే కాదు గింజలను తినేలా ప్లాన్ చేసుకోండి. మార్కెట్లో అతి తక్కువకు దొరికే ప్రొటీన్ ఫుడ్‌గా తోటకూర గింజలకు పేరుంది.