యాదాద్రి భువనగిరి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): భు వనగిరిలో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ పీఏసీ(రాజకీయ వ్యవహారాల కమిటీ) సమావేశం హాట్‌హాట్‌గా జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మీటింగ్ ఘాటుగా కొనసాగింది. పలు అంశాలంపై ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనా క్షి నటరాజన్ నేతలకు తలంటినట్లు తెలిసింది. మరికొందరికి చివాట్లు పెట్టినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పదేండ్లపాటు ప్రభుత్వం లేకపోయినా పార్టీని అంటిపెట్టుకొని గెలిపిస్తే తమకు సముచిత స్థానం ఏదంటూ సీనియర్లు నిలదీసినంత పనిచేశారు. పార్టీ కోసం ఆస్తులు ధారపోసినా తమకు న్యాయం జరగంలేదంటూ విన్నవించుకున్నట్లు తెలిసింది. కొత్తగా పార్టీలో చేరిన వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ తమ గోడును వెల్లబోసుకున్నట్లు సమాచారం. దీనిపై మీనాక్షి నటరాజన్ స్పందిస్తూ సీనియర్లకు ప్రాధా న్యం ఇస్తామని చెప్పడంతోపాటు మంత్రులకు సైతం సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది.
మీనాక్షి నటరాజన్ అక్షింతలు..
భువనగిరిలోని వివేరా హోటల్లో సోమవారం కాంగ్రెస్ బీఏసీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి మీనాక్షి నటరాజన్‌తోపాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, వివిధ విభాగాల చైర్మన్లు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. మొదట ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. బీఏసీ సమావేశం కోసం ప్రత్యేకంగా 7 పాయింట్లతో ఓ ఎజెండాను రూపొందించి చర్చించారు. పాయింట్ల వారీగా సమీక్షించారు. గత పీఏసీ సమావేశంలో తీసుకున్న చర్యలు, సర్ ఫేజ్ -2 కార్యాచరణ ప్రణాళిక, పార్టీ కమిటీల పూర్తి, బీఎల్ఏ-2 కార్యకలాపాల పర్యవేక్షణ, తాజా స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం తదితర అంశాలపై చర్చించారు.
అయితే ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ పలు అంశాల్లో నేతలకు అంక్షితలు వేసినట్లు తెలిసింది. పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం, చురుకుగా వ్యవహరించకపోవడంతోపాటు పలు అంశాలపై సీరియస్ అయినట్లు తెలుస్తున్నది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గైర్హాజర్‌పై ఆమె ఆరా తీసినట్లు సమాచారం. ఈ నెల 30 లోపు పెండింగ్‌లో ఉన్న పార్టీ కమిటీలను వంద శాతం పూర్తి చేయాలని మీనాక్షి సూచించారు. సర్‌లో భాగంగా నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దక్షిణ తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టిందని, అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు సమావేశం జరుగుతున్న సమయంలోనే వందేమాతర గీతాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని బీజేపీ నేతలు హోటల్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తుండగా, పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. చివరగా సర్ ప్రక్రియపై వీ-కన్వన్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు.
రాజగోపాల్ రెడ్డి డుమ్మా..
భువనగిరిలో జరిగిన ఉమ్మడి నల్లగొండ సమావేశానికి మూడు జిల్లాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఒక్క రాజగోపాల్ రెడ్డి మాత్రమే డుమ్మా కొట్టారు. ఆయనతోపాటు మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఆయన అనుచరులు, ముఖ్య నేతలు సైతం సమావేశానికి రాలేదు. సమావేశ ప్రాంగణంలో ఈ విషయమే చర్చనీయాంశమైంది. అయితే కొంత కాలం గా తనకు మంత్రి పదవి దక్కలేదని ఆయ న అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల వరుసగా ప్రభు త్వం, ఇతర ముఖ్యులపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఇలాంటి సమయంలో గైర్హాజర్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన కార్యక్రమాల్లోనూ రాజగోపాల్ రెడ్డి గైర్హాజర్ అయిన విషయం తెలిసిందే.