తాండూర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర ( Gas price ) పెంచడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారమవుతున్నదని సీపీఎం మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యుడు దాగాం రాజారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అదివారం తాండూర్లో రోడ్డుపై వంట వార్పు చేసి నిరసన( CPM Protest) తెలిపారు.
ఈ సందర్భంగా రాజారాం మాట్లాడుతూ గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.60, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.115 లు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే , దేశ సంపదను అంబానీ, అదాని వంటి కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ పేద ప్రజలపై అదనపు భారాలు మోపుతుందని విమర్శించారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని అన్నారు. తక్షణమే పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని, నిత్యవసర వస్తువుల ధరల అదుపుకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గం నానయ్య, వేల్పుల శంకర్, లక్ష్మి, సుమ, నాయకులు పాల్గొన్నారు.