Abhijeet Dipke : సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో సోనమ్ వాంగ్‌చుక్ త్యాగాన్ని మర్చిపోలేమని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే అన్నారు. తమ ఉద్యమంలో ఆయన కీలకంగా వ్యవహరించారని ప్రశంసించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఉద్యమంలో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సీజేపీ ఉద్యమానికి బలం పోసింది. అనంతరం విద్యార్థుల ఆందోళన, సోనమ్ దీక్ష విరమణ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి పరిణామాల గురించి తెలిసిందే. అయితే, సోనమ్ వాంగ్చుక్కు, సీజేపీకి, అభిజీత్ దీప్కేకు మధ్య విబేధాలు తలెత్తాయనే ప్రచారం తాజాగా జరుగుతోంది.
ఇదే అంశంపై అభిజీత్ దీప్కేను మీడియా ప్రశ్నించింది. వాంగ్‌చుక్‌తో విబేధాలు వచ్చాయా అని అడిగింది. దీనికి అలాంటిదేమీ లేదని దీప్కే సమాధానం ఇచ్చారు. ‘‘ఉద్యమం సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ సార్ చేసిన త్యాగాన్ని ఎలా మర్చిపోగలం. ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. 26 రోజులు నిరాహార దీక్ష చేశారు. తన ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టి, దేశాన్ని మేల్కొల్పారు. తన జీవితం గురించి ఆలోచించకుండా దేశ యువతను వీధుల్లోకి వచ్చేలా చేశారు. ఆయన నిరాహార దీక్ష లేకుండా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సాధ్యమయ్యేది కాదు. సోనమ్ దీక్ష విరమించాలని నేను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశాను. మీరు దీక్ష విరమించినా ఆందోళన కొనసాగిస్తానని ఆయనతో చెప్పా. ఆయన తన దీక్ష విరమించిన రోజు నేను ఎంతో ఉపశమనం పొందా’’ అని దీప్కే వ్యాఖ్యానించారు. అలాగే, కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత జేపీ నద్దా సమక్షంలో సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడంపై మీరేమైనా అసంతృప్తికి లోనయ్యారా అంటూ కూడా దీప్కేను మీడియా ప్రశ్నించింది.
దీనికి దీప్కే మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో నేనేమీ నిరాశకు లోను కాలేదు. కానీ, కేంద్ర మంత్రులు జేపీ నద్దా, జితేంద్ర సింగ్‌లు సోనమ్ వాంగ్చుక్ను కలిసేందుకు అనుమతించి, నన్ను అనుమతించలేదనే నేను నిరాశకు లోనయ్యా. ఆయనను కలిసేందుకు నాకు అనుమతి లభించలేదు. ప్రతిపక్ష ఎంపీలు ఆయనను కలిసేందుకు ప్రయత్నించినా వారిని కూడా అనుమతించలేదు. మరి మంత్రుల్ని మాత్రం ఎందుకు అనుమతించారు?’’ అని దీప్కే ప్రశ్నించారు. ఏదేమైనా వాంగ్‌చుక్ తన నిరాహార దీక్ష విరమించినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ భవిష్యత్తుకు ఆయన జీవితం ఎంతో ముఖ్యం అని దీప్కే అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి సీజేపీని ఒక రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశం తనకు లేదన్నాడు. రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నికల్లో పోటీ చేయడం కంటే.. రాజకీయాల్లో మార్పు తేవడమే తమ లక్ష్యమన్నారు.