రియాద్: భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒమన్‌కు చెందిన కో-పైలట్‌పై తోటి పైలట్ ఒకరు పలు ఆరోపణలు చేశారు. ఆయనను ‘మత తీవ్రవాది’గా అభివర్ణించారు. (Omani co-pilot) ఒమన్ జాతీయుడైన ఆ కో-పైలట్ సుమారు ఎనిమిది నెలల కిందట ఫ్లైదుబాయ్‌లో చేరాడని, రోజంతా విపరీతంగా ప్రార్థనలు చేసేవాడని, మహిళలతో కరచాలనం చేయడానికి నిరాకరించేవాడని చెప్పారు. భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసిన వ్యక్తి ఒమన్‌లో జన్మించాడని, ఆ కో-పైలట్‌కు ఒమన్ పౌరసత్వం ఉన్నదని ఆ దేశ అధికారి ఒక వార్తా సంస్థకు తెలిపారు. అయితే ఆ వ్యక్తి పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు.
కాగా, సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో ఆ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన అనంతరం, ఆ ఇద్దరు పైలట్లు ఆసుపత్రిలో చేరినట్లు సౌదీ అధికారులు ధృవీకరించారు. భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, ఫ్లైదుబాయ్ ఫ్లైట్‌ను కూల్చివేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒమన్ కో-పైలట్‌పై ప్రాథమిక విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. తదుపరి విచారణ కోసం అతడ్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు అప్పగించే అవకాశం ఉన్నదని వివరించారు.
మరోవైపు ఈ సంఘటనకు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్నదా?, ఇది ముందుగానే ప్రణాళిక చేసిందా? దీని వెనుక ఉన్న పరిస్థితులు, ఉద్దేశ్యాలపై యూఏఈ కూడా ప్రత్యేకంగా విచారణకు ఆదేశించింది. తమ దేశంలో నమోదైన విమానాలలో జరిగే నేరాలకు, దేశ భూభాగం వెలుపల జరిగినా కూడా, యూఏఈ చట్టం వర్తిస్తుందని ఆ దేశ అధికారులు తెలిపారు.
అయితే ఆ విమానంలోని ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఇజ్రాయెలీలు ఉండటంతో ఈ సంఘటనను ‘జిహాదీ ఉగ్రవాద దాడి’ ప్రయత్నంగా ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో తమ దేశానికి చెందిన మొస్సాద్, షిన్ బెట్‌తో సహా భద్రతా, నిఘా సంస్థలను దర్యాప్తు కోసం ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక వార్తా సంస్థకు తెలిపారు. యూఏఈలో జరిగే విచారణలో ఇజ్రాయెల్ అధికారులు పాల్గొంటారని, ఆ విమానంలో ఏమి జరిగిందో అన్నది తెలుసుకుంటారని ఆయన అన్నారు.