నగోయా: జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ రెజ్లింగ్ పోటీల్లో ఇండియన్ రెజ్లర్ నితేశ్ సివాచ్(Nitesh Siwach)కు సిల్వర్ మెడల్ దక్కింది. 97 కేజీల గ్రీకో రోమన్ ఫైనల్లో ఇవాళ భారత రెజ్లర్ నితేశ్ ఓటమి పాలయ్యాడు. 0-4 పాయింట్ల తేడాతో అతను ఫైనల్లో జపాన్ ప్లేయర్ యూరి నకాజాటో చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. వాస్తవానికి నితేశ్ గట్టి పోటీ ఇచ్చాడు. గ్రిప్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ జపాన్ ప్లేయర్ ధీటుగా ఎదుర్కొన్నాడు. ఇండియన్ రెజ్లర్‌ను అటాక్ చేయకుండా అడ్డుకున్నాడు. దీంతో 0-4 తేడాతో నితేశ్ ఓడిపోయాడు.
గ్రీకో రోమన్ స్టయిల్ రెజ్లింగ్‌లో గతంలో ఇండియాకు రెండు సార్లు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 1962లో జకర్తాలో జరిగిన గేమ్స్‌లో 52కేజీల విభాగంలో మాల్వా సింగ్, 97 కేజీల విభాగంలో గణపత్ అండాల్కర్ స్వర్ణ పతకాలు గెలిచారు. ఇవాళ జరిగిన ఫైనల్లో నితేశ్ను స్కోరింగ్ చేయకుండా జపనీస్ ప్లేయర్ నిలువరించాడు. ఫస్ట్ బౌట్‌ను 2-0 తేడాతో నకాజాటో ముగించాడు.
లోకల్ ఫెవరేట్ అయిన నకాజాటో సెకండ్ బౌట్లో విజయవంతంగా నితేశ్ను నేలకూల్చాడు. దీంతో అతనికి 4-0 ఆధిక్యం లభించింది. చివరి నిమిషంలో నితేశ్ అటాక్ చేసినా.. నకాజాటో తన డిఫెన్స్ టెక్నిక్‌తో అడ్డుకున్నాడు.