Ram Charan and NTR | మల్టీప్లెక్స్ రంగంలోకి టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే అగ్ర కథానాయకులు మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas), అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ (AAA Cinemas), విజయ్ దేవరకొండ ఏవీడీ సినిమాస్ (AVD Cinemas) రవితేజ ఏఆర్టీ సినిమాస్(ART Cinemas) పేర్లతో థియేటర్ల వ్యాపారంలో విజయవంతంగా రాణిస్తుండగా, ఇప్పుడు వారి బాటలోనే ఈ ఇద్దరు మెగా, నందమూరి హీరోలు కూడా అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు కేవలం సినిమాలతోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ బిజినెస్‌పై మన హీరోలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అగ్ర హీరోలతో మల్టీప్లెక్స్‌ల ఏర్పాటులో భాగస్వామ్యంగా ఉన్న ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ తోనే రామ్ చరణ్ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఏఆర్సీ (ARC) పేరుతో ఓ అత్యాధునిక హంగులతో కూడిన మల్టీప్లెక్స్‌ను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఎవరి భాగస్వామ్యం లేకుండా సొంతంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఒక ప్రీమియం మల్టీప్లెక్స్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అటు రామ్ చరణ్ కానీ, ఇటు ఎన్టీఆర్ టీమ్ కానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఈ రూమర్స్ నిజమైతే మాత్రం బాక్సాఫీస్ వద్దే కాకుండా థియేటర్ల వ్యాపారంలోనూ టాలీవుడ్ హీరోల మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారడం ఖాయం.