Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ (ఏకే 47) సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కుటుంబ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను ముందుగా 2026 వేసవిలో విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత విడుదల తేదీని అక్టోబర్ 2కి మార్చారు. అనంతరం అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ విడుదల తేదీపై మరోసారి సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్టోబర్ 9న సినిమా విడుదల కాని పక్షంలో ప్రత్యామ్నాయంగా అక్టోబర్ 16 తేదీని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వారాంతంలోనే ‘జైలర్ 2’, ‘రణబాలి’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు.. ‘జైలర్ 2’ను తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ పంపిణీ చేయనున్న నేపథ్యంలో అక్టోబర్ 16 తేదీ ఆసక్తికరంగా మారింది.
అయితే ఇవన్నీ ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారాలు మాత్రమే. అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.మరోవైపు అక్టోబర్ 30 తేదీ కూడా చర్చలో ఉన్నట్లు సమాచారం. సినిమా నిర్మాణం, ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం అవసరమైతే.. అక్టోబర్ చివరి వారంలో విడుదల చేయడం ద్వారా ఆ పనులను పూర్తి స్థాయిలో ముగించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు టాక్.అయితే అక్టోబర్ 30 కూడా ఖరారైన తేదీ కాదని తెలుస్తోంది. ప్రస్తుతం అక్టోబర్ 9నే విడుదల తేదీగా నిర్ణయించారు.. ఈ సినిమా ట్రైలర్ను అక్టోబర్ 6న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసినట్లు సమాచారం. ట్రైలర్ లాంచ్ అనుకున్న ప్రకారం జరిగితే.. అక్టోబర్ 9న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలోనే మేకర్స్ ఉన్నట్లు భావించవచ్చు. ఒకవేళ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మార్పులు చోటుచేసుకుంటే మాత్రం విడుదల వాయిదా ప్రచారానికి మరింత బలం చేకూరే అవకాశం ఉంది.
అందుకే ప్రస్తుతం అందరి దృష్టి అక్టోబర్ 6న జరగనున్న ట్రైలర్ లాంచ్పైనే ఉంది. ఆ రోజు చిత్రబృందం చేసే ప్రకటనతో విడుదల తేదీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.