Supritha | ప్రముఖ నటి సురేఖ వాణి కూతురిగా సినీ ప్రేక్షకులకు పరిచయమైన సుప్రీత.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె.. టీవీ కార్యక్రమాలతోనూ సందడి చేస్తోంది. మరోవైపు హీరోయిన్గా సినిమాలు చేస్తూ అలరించే ప్రయత్నాలు చేస్తుంది . ఈ క్రమంలో తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను సుప్రీత వెల్లడించింది. తన జీవితంలో ఇప్పటివరకు మూడు బ్రేకప్స్ జరిగాయని సుప్రీత తెలిపింది. అయితే మొదటి ప్రేమను పెద్దగా సీరియస్‌గా తీసుకోనని చెప్పింది. చిన్నతనంలో కలిగిన క్రష్ లాంటిదని, దాన్ని పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.
కానీ రెండో ప్రేమ మాత్రం తన జీవితంపై తీవ్ర ప్రభావం చూపించిందని సుప్రీత చెప్పింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు కొనసాగిన ఆ బంధం తనకు ఎంతో ట్రామాను మిగిల్చిందని వెల్లడించింది. ఆ సంబంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దాని ప్రభావం వెంటాడిందని చెప్పింది. రెండో రిలేషన్షిప్ కారణంగా తనకు తీవ్రంగా భయపడే పరిస్థితి ఏర్పడిందని సుప్రీత తెలిపింది. ముఖ్యంగా ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు కంగారుగా అనిపించేదని, ఇప్పటికీ అందుకు సంబంధించిన మందులు వాడుతున్నానని చెప్పింది. ఆ సమయంలో ఎదురైన మానసిక ఒత్తిడి తన మూడో రిలేషన్షిప్పైనా ప్రభావం చూపించిందని వివరించింది. మూడో రిలేషన్షిప్ మొదట్లో బాగానే ఉన్నప్పటికీ.. ఆ బంధం ముగిసిన తీరు తనను తీవ్రంగా బాధించిందని సుప్రీత పేర్కొంది. తాను మారడానికి ప్రయత్నించినప్పటికీ.. తన భాగస్వామిలో ఎక్కువగా కనిపించిన అనుమానం, ఈగో వంటి విషయాలు ఇబ్బంది పెట్టాయని చెప్పింది.
తాను షూటింగ్లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? అంటూ ప్రశ్నలు ఎదురయ్యేవని సుప్రీత తెలిపింది. ఇలాంటి అనుమానాలు, నియంత్రించే ప్రయత్నాలు తనకు చాలా ఇబ్బందిగా అనిపించాయని చెప్పింది. ప్రేమలో తాను చాలా బాధపడ్డానని, చివరికి ఆ బంధం తన కెరీర్‌పైనా ప్రభావం చూపడంతో దాని నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది.వరుస బ్రేకప్స్ తనపై తీవ్ర ప్రభావం చూపించాయని సుప్రీత తెలిపింది. ఎక్కువగా ఏడవడం, అతిగా ఆలోచించడం వంటి సమస్యలు వచ్చాయని చెప్పింది. ఆ అనుభవాల నుంచి బయటపడాలని ప్రయత్నించినప్పటికీ.. అప్పుడప్పుడు గతం గుర్తొచ్చేదని పేర్కొంది. బ్రేకప్ కారణంగా తన బరువు కూడా గణనీయంగా తగ్గిపోయిందని సుప్రీత చెప్పింది. ఒక దశలో 52 కిలోలకు తగ్గిపోయానని, ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి వరకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. చాలా సన్నగా అయిపోయానని, చుట్టుపక్కల వాళ్లు కూడా బరువు తగ్గిపోయావంటూ తనను తిట్టేవారని చెప్పింది. ప్రస్తుతం ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు మందులు వాడుతున్నానని, మెడిటేషన్ కూడా చేస్తున్నానని తెలిపింది.